prevention Of Road Accidents: రోడ్డు ప్రమాదాల నివారణ పట్టని ప్రభుత్వం

ఈ నెల 13న పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో టూరిస్టు బస్సు.. టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు.

Published : 26 May 2024 05:23 IST

రహదారి భద్రతకు ఐదేళ్లలో రూ.500 కోట్ల కేటాయింపు
ఖర్చు చేసింది కేవలం రూ.10 కోట్లే
అది కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి సమీక్ష నేపథ్యంలోనే..
సమావేశాలతో సరి.. నిధులిచ్చేది లేదు మరి
దిష్టిబొమ్మల్లా.. రహదారి భద్రత కమిటీలు

ఈనాడు, అమరావతి: ఈ నెల 13న పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో టూరిస్టు బస్సు.. టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. డ్రైవర్‌కు బదులు క్లీనర్‌ బస్సును వేగంగా నడపడమే దీనికి కారణం. ఈ నెల 18న అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి, హైవేలో డివైడర్‌ దాటి ఎదురురోడ్డులోకి వెళ్లి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ నెల 23న కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో ట్రావెల్స్‌ బస్‌ అతివేగంగా వెళ్తూ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.

ఇలా నిత్యం వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కడా తనిఖీలు, నిఘా ఉండటం లేదు. వాహనాలు అతి వేగంగా వెళ్లకుండా నియంత్రించలేకపోతున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపేస్తున్నా సరే.. ప్రమాదం జరిగాక గానీ గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి ప్రమాదాల నియంత్రణకే రహదారి భద్రత విభాగం ఏర్పాటు చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో ఉండే ఈ విభాగానికి చెందిన కమిటీలు.. ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయాలి. ఈ కమిటీలు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి, ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే వాటి అమలుకు అవసరమైన నిధులను విడుదల చేయకుండా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది. ఐదేళ్లుగా ప్రమాదాల్లో వేల మంది మరణిస్తున్నా.. వైకాపా ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా అనిపించలేదు. రహదారి భద్రతకు బడ్జెట్‌లో ఏటా రూ.100 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.500 కోట్లు కేటాయించినా.. కేవలం రూ.10 కోట్లు మాత్రమే విడుదల చేసిందంటే ఈ ప్రభుత్వానికి ప్రమాదాల నియంత్రణపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది.

పేరుకే నిధుల కేటాయింపు

  • రహదారి భద్రత కమిటీల్లో రవాణా, పోలీస్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, వైద్య-ఆరోగ్య, రెవెన్యూ శాఖల అధికారులు ఉంటారు.
  • జిల్లా స్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో ఉండే కమిటీ.. ప్రతి నెలా సమావేశమై, ఎన్ని ప్రమాదాలు జరిగాయి, వాటికి కారణాలేంటి, నియంత్రణకు ఏం చేయాలనే అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. ఎక్కడైనా నిధులు వెచ్చించాల్సి వస్తే.. ఆ ప్రతిపాదనను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపుతుంది.
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి కమిటీ ఏటా రెండుసార్లు సమావేశమై.. జిల్లాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి వాటికి నిధులు కేటాయించాలి.
  • జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల సమావేశాలు జరిగినా నిధుల విడుదల మాత్రం ఉండటం లేదు.
  • రహదారి భద్రతకు ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా రూ.100 కోట్ల చొప్పున ఐదేళ్లుగా కేటాయిస్తూ వచ్చింది. మద్యం తాగి, వాహనాలు నడిపేవారిని గుర్తించేందుకు బ్రీత్‌ ఎనలైజర్లు, వాహన వేగాన్ని గుర్తించి, జరిమానాలు విధించేందుకు అవసరమైన స్పీడ్‌ గన్స్, ప్రమాదాలు జరిగినప్పుడు సహాయక చర్యల కోసం క్రేన్ల వంటివి పోలీస్, రవాణా శాఖలు కొనుగోలు చేసేందుకు ఈ నిధులు ఇవ్వాలి.
  • ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్‌ స్పాట్స్‌ను గుర్తించి, అక్కడ తగిన పనులు చేసేందుకు, మలుపులు, ప్రమాదకర ప్రాంతాల్లో సైన్‌బోర్డులు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటుకు నిధులివ్వాలి.
  • పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలి.
  • రవాణాశాఖకు లైసెన్సుల జారీ, వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు తదితరాల నిర్వహణకు కొత్త పరికరాల కొనుగోలుకు నిధులు కేటాయించాలి.
  • కానీ వేటికీ జగన్‌ ప్రభుత్వం అయిదేళ్లలో డబ్బులు విడుదల చేయలేదు. దీంతో రహదారి భద్రత విభాగం కేవలం ప్రేక్షకపాత్ర పోషించడానికి, ప్రమాదాల జాబితా రూపొందించేందుకే పరిమితమైంది. 

న్యాయమూర్తి ప్రశ్నిస్తారని.. నిధుల విడుదల

రాష్ట్రంలో రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏడు చోట్ల ఆటోమేటిక్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి అవసరమైన పరికరాలను రహదారి భద్రత నిధి నుంచే కొనుగోలు చేశారు. దాదాపు ఏడాదిన్నర కిందట గుత్తేదారు వాటిని సరఫరా చేశారు. వాటి సొమ్ము ఇస్తేనే.. పరికరాలు బిగిస్తానని గుత్తేదారు చెబుతున్నా, ఇప్పటి వరకు పట్టించుకోలేదు. రెండు నెలల కిందట ఆఘమేఘాలపై ఆ నిధులు విడుదల చేశారు. వివిధ ప్రాంతాల్లో రహదారి భద్రత కింద చేసిన పనులు, కొనుగోలు చేసిన పరికరాలకు ఇంతకాలం బకాయిలు చెల్లించలేదు. వీటికి కూడా రెండు నెలల కిందట నిధులు విడుదలయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన రహదారి భద్రత, ఆడిట్‌పై ఈ ఏడాది మార్చి 15న సమావేశం జరిగింది. ఆడిట్‌ వివరాలు పరిశీలించి.. ఇంతకాలం బకాయిలు ఎందుకు చెల్లించలేదని న్యాయమూర్తి ప్రశ్నిస్తారనే భయంతో ఆ సమావేశానికి ముందే రూ.10 కోట్ల బకాయిలు విడుదల చేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని