AP High Court: 6 వరకు అరెస్టు వద్దు

ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది.

Updated : 24 May 2024 07:27 IST

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో రక్షణ
కేతిరెడ్డి పెద్దారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతమనేని ప్రభాకర్, జేసీ అస్మిత్‌రెడ్డిలకూ ఉపశమనం 
నలుగురి కంటే ఎక్కువ మందితో తిరగొద్దని హైకోర్టు షరతు
వారి కదలికలపై నిఘా ఉంచాలని ఈసీ పర్యవేక్షణలోని పోలీసులకు ఆదేశం
ఈనాడు - అమరావతి

ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న నేరాల్లో నిందితులుగా ఉండి.. హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులకు తాత్కాలిక ఊరట లభించింది. జూన్‌ 6 వరకు వారిని అరెస్టు చేయొద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఉత్తర్వులతో ఉపశమనం పొందినవారిలో ఈవీఎంను పగలగొట్టిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. తాడిపత్రి వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిలకు సైతం అరెస్టు నుంచి న్యాయస్థానం రక్షణ కల్పించింది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉందని, బరిలో ఉన్న అభ్యర్థులు పోలింగ్‌ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉన్నందున అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు చేసిన అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించింది. షరతులతో పిటిషనర్లకు అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. అభ్యర్థుల వెంట నలుగురికి మించి ఉండరాదని షరతు విధించారు. వీరి కదలికలపై ఎన్నికల సంఘం పోలీసులతో నిఘా, పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించారు. సాక్షులను బెదిరించకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు స్పష్టం చేశారు. కేసు లోతుల్లోకి వెళ్లకుండా ఈ మేరకు తాత్కాలిక ఉత్తర్వులిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాన వ్యాజ్యాల్లో పోలీసులు కౌంటరు దాఖలుచేయాలని పేర్కొంటూ విచారణను జూన్‌ 6కి వాయిదా వేశారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసేవరకూ తాడిపత్రి నియోజకవర్గంలో అడుగుపెట్టొద్దని అక్కడి వైకాపా, తెదేపా అభ్యర్థులకు షరతు విధించారు.

మాచర్ల నియోజకవర్గం పరిధి పాల్వాయిగేటులోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యవహారంలో రెంటచింతల పోలీసులు తనపై నమోదుచేసిన కేసులలో ముందస్తు బెయిలు మంజూరుచేయాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలుచేశారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘ఈవీఎంను ధ్వంసం చేస్తున్న ఘటనపై ప్రతిపక్ష నేత నారా లోకేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసి, ఆ అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దాన్ని పరిగణనలోకి తీసుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలని ఈసీ ఉత్తర్వులు జారీచేసింది. పిటిషనర్‌పై నమోదుచేసిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవే. ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్న కేసులలో అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు అర్నేష్‌కుమార్‌ కేసులో స్పష్టం చేసినా.. ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా ఈసీ ఉత్తర్వులు ఉన్నాయి. అలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం ఈసీకి లేదు. పిటిషనర్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. ఓట్ల లెక్కింపు వరకూ అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలి’’ అని వాదించారు. 

బెయిల్‌ ఇవ్వవద్దు

  • పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో తెదేపా ఏజెంట్‌గా ఉన్న నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. పిన్నెల్లికి బెయిలు మంజూరు చేయొద్దని కోరారు. ఆయన అల్లర్లు సృష్టించారని, పిటిషనర్‌పై దాడిచేసి గాయపరిచారని చెప్పారు. బాధితుడిగా వాదనలు చెప్పుకొనేందుకు ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. 
  • దెందులూరు తెదేపా అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి తెదేపా అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో పిటిషనర్లకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరారు. 
  • తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. నరసరావుపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ షరతులు విధిస్తూ మధ్యంతర ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు. స్వతంత్ర అభ్యర్థి పరిమి సోమశేఖర్‌ నాయుడి తరఫున న్యాయవాది చుక్కపల్లి భానుప్రసాద్‌ వాదనలు వినిపించారు. 
  • పోలీసుల తరఫున పీపీ వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ వ్యాజ్యాల్లో కౌంటరు దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మళ్లీ అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో నేర ఘటనలు పునరావృతం చేయకుండా పిటిషనర్లను/అభ్యర్థులను ఆదేశించాలని కోరారు. అభ్యర్థులు ఓట్ల లెక్కింపు కేంద్రాలకు దూరంగా ఉండేలా ఆదేశించాలని కోరారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే.. ఆ ఉత్తర్వులను పోటీచేసే అభ్యర్థులకే పరిమితం చేయాలని కోరారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని