AP News: గడప గడపలో సమస్యల గళం

గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తగులుతూనే ఉంది. తమ కష్టాలపై సోమవారం చాలాచోట్ల పౌరులు గళం విప్పారు.

Updated : 17 May 2022 06:35 IST

హామీలపై స్పీకర్‌ను నిలదీసిన మహిళలు
అడ్డమైన పథకాలు పెట్టారంటూ తిరువూరులో నిరసన
ఇసుక తవ్వకాలపై తిరుపతిలో మండిపాటు

న్యూస్‌టుడే, బృందం: ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల వద్దకు వెళుతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తగులుతూనే ఉంది. తమ కష్టాలపై సోమవారం చాలాచోట్ల పౌరులు గళం విప్పారు. 

పంచాయతీ సరే... చెక్‌ పవర్‌ ఏదీ?

శ్రీకాకుళం జిల్లా డొంకలపర్త పంచాయతీ పరిధిలోని తుడ్డలిని ప్రత్యేక పంచాయతీగా మార్చారని, చెక్‌పవర్‌ ఎందుకు ఇవ్వలేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాంను సర్పంచి అంపిలి రూపావతి నిలదీశారు. గ్రామంలో అపరిశుభ్రత తాండవిస్తోందని, రోడ్లు, కాలువలను నిర్మించాల్సి ఉందన్నారు. ‘ఎన్నికల సమయంలో వీధి కుళాయిల ద్వారా తాగునీరు అందిస్తామన్నారు. నేటికీ సమస్య అలాగే ఉంది. ఇంటి పట్టా ఉన్నా స్థలం ఎక్కడో తెలియదు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు ఎందుకు కల్పించడం లేదు’ అంటూ మహిళలు ప్రశ్నించారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
* ‘మత్స్యకార భరోసా కొందరికే వచ్చింది. అర్హులందరికీ ఇవ్వాలిందే’నని మందస మండలం మర్రిపాడులో మంత్రి సీదిరి అప్పలరాజును మహిళలు అడ్డుకున్నారు.

ఇసుక రేవులపై నిలదీత

తిరుపతి జిల్లా నాగలాపురం మండలం చిన్నాపట్టు, అచ్చమనాయుడుకండ్రిగ, సుబ్బానాయుడుకండ్రిగ, నందనం గ్రామాల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఇసుక రేవుల అంశంపై గ్రామస్థులు నిలదీశారు. 

పంథా మార్చిన నాయకులు

ప్రజాప్రతినిధులను చాలాచోట్ల ప్రజలు నిలదీస్తుండటంతో వైకాపా నాయకులు పంథా మార్చారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మూడో వార్డు శాంతినగర్‌లో సోమవారం హిందూపురం ఎంపీ మాధవ్‌, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ పర్యటించారు. వారి రాకకు ముందే వాలంటీర్లు, ముఖ్య కార్యకర్తలు... ప్రతి ఇంటి వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిలదీసే వారిని గుర్తించి... నాయకుల వద్ద గట్టిగా మాట్లాడకుండా చేశారు. ఈ తతంగాన్ని శాంతినగర్‌లో సోమవారం వీడియో తీయడానికి మీడియా ప్రతినిధి ఒకరు ప్రయత్నించగా ఫోన్‌ లాక్కొని.. ఆయన జేబులోనే పెట్టారు. మరో నాయకుడు విలేకర్లపై దూషణలకు దిగగా మిగిలిన నాయకులు ఆయనకు సర్దిచెప్పారు. అనంతరం విలేకర్లు తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ రోడ్డుపై ఎలా నడిచేది?

‘వర్షం వస్తే దారంతా బురదమయం అవుతుంది. మేం ఈ రోడ్డుపై ఎలా నడిచేది’ అంటూ కర్నూలు జిల్లా ఆదోని మండలం విరూపాపురంలో పార్వతి, జయలక్ష్మి అనే మహిళలు స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డిని ప్రశ్నించారు. గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధికి మూడు కుళాయి కనెక్షన్‌లు ఉన్నాయని, తమకు మాత్రం నీరు రావడం లేదని ఒకరు ఆరోపించారు.

మద్దతు ధర ఎక్కడుంది సారూ...

‘రైతులకు మద్దతు ధర కల్పిస్తున్నామని చెబుతున్నారు. నేను మొక్కజొన్న వేశా. మద్దతు ధరకు విక్రయిద్దామంటే హమాలీ, సంచులు, పురుకోసుల ఖర్చులు, లారీ బాడుగలు మేమే చెల్లించాలి. ఇవన్నీపోను రైతుకు మిగిలేది ఏముంది’ అంటూ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సింగరాజుపల్లికి చెందిన ఓ రైతు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ను నిలదీశారు.

నా కుమారుడికీ అమ్మఒడి రాలేదు

‘నా కుమారుడికీ అమ్మ ఒడి రాలేదు. మంజూరు చేయించండి’ అని కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం రంగాపురంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కుంభళనూరు సర్పంచి లక్ష్మి వాపోయారు.

ముఖ్యమైన పనులను వదిలేశారు

‘అడ్డమైన పథకాలన్నీ అమలు చేశారు. ముఖ్యమైన పనులేమీ చేయలేదు. రోడ్లు, ఇళ్లు ముఖ్యం. 40 ఏళ్ల వాళ్లకి, మిషన్‌ కుట్టే వాళ్లకి, ఆటో వాళ్లకు డబ్బులు ఇవ్వడం దేనికి? ముఖ్యమైన పనులు చేయకుండా వదిలేశారు... వర్షం పడితే రోడ్డుపైకి మోకాళ్లలోతు వరకు నీళ్లొస్తున్నాయి’ అంటూ ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం కోడూరుకు చెందిన కోట వరమ్మ తిరువూరు ఎమ్మెల్యే కె.రక్షణనిధిని నిలదీశారు.కిడ్నీ వ్యాధితో ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ధరలు తగ్గించే మార్గం చూడండి

‘గ్యాస్‌, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్తు ఛార్జీలు పెరిగిపోయాయి. తగ్గించే మార్గం చూపండి’ అని వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని మహిళలు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని