NRI Doctor Lokesh: ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం

జగన్‌ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 19 May 2024 07:34 IST

గన్నవరం విమానాశ్రయం నుంచి ఎత్తుకెళ్లి దాడి
గుండెనొప్పి అన్నా.. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా జాప్యం
సీఎం విదేశీ పర్యటనకు కొద్ది సమయం ముందు ఘటన
జగన్‌ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించినందుకు కక్షసాధింపు

ఈనాడు, అమరావతి: జగన్‌ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన తనను పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి దాడి చేశారని ఆయన వాపోయారు. వారు తన ఛాతీపై కొట్టడంతో గుండెల్లో నొప్పి వస్తోందనీ, ఆసుపత్రికి తీసుకెళ్లాలని బతిమాలినా.. వినిపించుకోకుండా తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించారన్నారు. విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘నేను ఆదివారం అమెరికాకు తిరిగి వెళ్లేందుకు విమాన టికెట్లు తీసుకున్నా. గన్నవరం నుంచి ఎయిరిండియా సర్వీసులో దిల్లీ వెళ్లేందుకు అవసరమైన టికెట్‌ ప్రింటింగ్‌ కోసం శుక్రవారం రాత్రి విమానాశ్రయానికి వెళ్లా. రాత్రి 10 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయంలో కూర్చుని ఉండగా, కొందరు పోలీసులు వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్లి వాహనంలోకి ఎక్కించారు. ఎక్కడికి తీసుకెళుతున్నారని అడిగితే.. విమానాశ్రయం గేటు బయట వదిలిపెడతామని చెప్పారు. నేనేం తప్పు చేశానని అడిగినా.. సమాధానం చెప్పలేదు. జాతీయ రహదారిపైకి వచ్చాక వాహనాన్ని ఎక్కడెక్కడో తిప్పి.. చివరికి గన్నవరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు’ అని లోకేశ్‌ వెల్లడించారు. 

గుండెల్లో నొప్పి వస్తోందన్నా పట్టించుకోలేదు..

‘విమానాశ్రయం గేటు బయట విడిచి పెడతామని చెప్పి, ఎక్కడికి తీసుకెళుతున్నారని అడిగితే.. పోలీసులు నా ఛాతీపై గట్టిగా కొట్టారు. దీంతో బీపీ పెరిగిపోయి.. గుండెల్లో నొప్పి వస్తోందనీ, ఆసుపత్రికి తీసుకెళ్లాలని అడిగా. కానీ, వాళ్లు నా మాట వినిపించుకోకుండా స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. నొప్పి ఎక్కువగా ఉందని చెప్పడంతో.. చివరికి గన్నవరంలోని ఓ చిన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుడు పరీక్షించి.. వెంటనే గుండె వైద్య నిపుణులున్న ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్‌ పిలిపించాలని చెప్పినా పోలీసులు చాలా ఆలస్యం చేశారు. తర్వాత ఎప్పటికో అంబులెన్స్‌ తెచ్చి విజయవాడలోని ఆయుష్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రాత్రి నుంచి వైద్యం అందడంతో శనివారానికి కొంత కోలుకున్నా’ అని లోకేశ్‌ చెప్పారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సామాజిక మాధ్యమాల ద్వారా తాను కొన్నేళ్లుగా ఎండగడుతున్నానని.. దీంతో రాష్ట్ర పోలీసులు తనపై నిఘా ఉంచి, విమానాశ్రయానికి వచ్చిన తనను బలవంతంగా ఎత్తుకెళ్లారని వాపోయారు.

ప్రవాసాంధ్రుడు డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌ను పరామర్శిస్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.
చిత్రంలో బసవయ్య, గూడపాటి లక్ష్మీనారాయణ, మన్నవ సుబ్బారావు, దారపనేని నరేంద్ర

హైకోర్టులో కేసు దాఖలు చేస్తా..

అమెరికా పౌరుడినైన తనను రాష్ట్ర పోలీసులు అపహరించడం చట్టవిరుద్ధమని డాక్టర్‌ లోకేశ్‌ పేర్కొన్నారు. ‘దీనిపై ఇప్పటికే అమెరికా ఎంబసీ, భారత ప్రధాని కార్యాలయానికి సమాచారం అందించా. భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ తదితరులకూ తెలియజేశా. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ దీనిపై స్పందించి.. నాపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. ఈ ఘటనపై హైకోర్టులో సోమవారం కేసు దాఖలు చేస్తా. డీజీపీ, సీఎస్‌లు స్పందించకపోతే వారిపైనా ప్రైవేటు కేసులు వేసి న్యాయపోరాటం చేస్తానని’ వెల్లడించారు. ఆయుష్‌ ఆసుపత్రిలో తనకు చికిత్స జరుగుతున్న సమయంలోనూ పోలీసుల తీరు దారుణంగా ఉందని లోకేశ్‌ పేర్కొన్నారు. అసలు తనను ఎందుకు నిర్బంధించారు, ఏ సెక్షన్ల కింద కేసు పెట్టారో కూడా చెప్పకుండా.. దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. చివరికి తన తరఫు న్యాయవాది వచ్చి ప్రశ్నిస్తే.. అప్పుడు సెక్షన్‌ 151 కింద కేసు పెట్టినట్టు చెప్పి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారన్నారు. డాక్టర్‌ లోకేశ్‌ను తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, గూడపాటి లక్ష్మీనారాయణ, నరేంద్రలు పరామర్శించారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని ఉమా తెలిపారు. పార్టీ తరఫున అన్నివిధాలుగా అండగా ఉంటామని నేతలు ఆయనకు హామీ ఇచ్చారు.


41 నోటీసు ఇచ్చి.. ఇంటికి

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విదేశీ పర్యటనకు బయలుదేరిన సీఎం జగన్‌ను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు యత్నించిన డాక్టర్‌ లోకేశ్‌పై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న లోకేశ్‌ కొన్నాళ్లుగా తెదేపా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా, లోకేశ్‌ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. ‘విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వాహనశ్రేణిని అడ్డుకునేందుకు వెళ్తున్నా.. మీరు కలిసి రావాలంటూ’ వివిధ వాట్సప్‌ గ్రూపుల్లో తెదేపా కార్యకర్తలను ఆయన ప్రేరేపించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 151   కింద కేసు నమోదు చేశారు. అనంతరం 41 నోటీసు ఇచ్చి, ఇంటికి పంపినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు