NRI Doctor Lokesh: విమానాశ్రయంలో ప్రవాస వైద్యుడు లోకేశ్‌ అడ్డగింత

అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు.

Updated : 20 May 2024 08:08 IST

శాటిలైట్‌ ఫోన్‌తో దిల్లీ వెళ్తుండగా ఆపిన ఎస్పీఎఫ్‌
గన్నవరం పోలీసులకు అప్పగింత

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే-గన్నవరం గ్రామీణం: అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌ను గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది అడ్డుకొని, గన్నవరం పోలీసులకు అప్పగించారు. అనుమతి లేకుండా శాటిలైట్‌ ఫోన్‌ కలిగి ఉన్నందుకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అమెరికాకు తిరుగు ప్రయాణంలో భాగంగా ఆయన దిల్లీ వెళ్లే విమానం ఎక్కేందుకు ఆదివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్‌ఇన్‌లో ఎస్పీఎఫ్‌ సిబ్బంది డాక్టర్‌ లోకేశ్‌ లగేజీ తనిఖీ చేసి, శాటిలైట్‌ ఫోన్‌ను గుర్తించారు. భారతదేశంలో ఆ ఫోన్‌ను వినియోగించేందుకు అవసరమైన కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ అనుమతి పత్రం లేదని తేల్చారు. దీంతో ఆయన్ను గన్నవరం పోలీసులకు అప్పగించగా, స్టేషన్‌కు తరలించారు. శాటిలైట్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, దాని గురించి ఆరాతీశారు. ఆ ఫోన్‌ను తాను వర్జీనియాలో కొనుగోలు చేశానని, అమెరికా నుంచి వచ్చేటప్పుడు తన వెంట తెచ్చినట్లు లోకేశ్‌ వివరించారు. దర్యాప్తునకు సహకరిస్తానని హామీ ఇవ్వడంతో మధ్యాహ్నం విడిచిపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా శాటిలైట్‌ ఫోన్‌తో దేశీయ విమానాశ్రయాల మీదుగా లోకేశ్‌ రాకపోకలు సాగించినట్లు గుర్తించామని సీఐ వరప్రసాద్‌ వెల్లడించారు.

అమెరికా రాయబార కార్యాలయానికి పోలీసుల వివరణ: విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి పోలీసులు తన పట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరుపై లోకేశ్‌ అమెరికా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు పంపిన సంగతి విదితమే. దీనిపై ఎంబసీ అధికారులు ఆదివారం గన్నవరం పోలీసుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌ లోకేశ్‌ సీఎం జగన్‌ను అడ్డగించేందుకు ప్రయత్నించారని, దానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ కాపీ, లోకేశ్‌ ఫోన్‌లో ఉన్న వాట్సప్‌ చాట్‌ స్క్రీన్‌షాట్లను రాయబార కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. శాటిలైట్‌ ఫోన్‌ గురించి కూడా వారికి వెల్లడించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు