Andhra news: రెండోరోజూ చర్చలు విఫలం

ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశా) ప్రతినిధుల మధ్య రెండోరోజూ చర్చలు విఫలమయ్యాయి.

Updated : 23 May 2024 05:09 IST

రూ.203 కోట్లను విడుదల చేశాం
ఆరోగ్యశ్రీ ట్రస్టు బకాయిల్లో 50% చెల్లించాల్సిందే
ఆశా స్పష్టీకరణ

ఈనాడు, అమరావతి: ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశా) ప్రతినిధుల మధ్య రెండోరోజూ చర్చలు విఫలమయ్యాయి. తొలుత ప్రకటించినట్లే.. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, ఉద్యోగులకు చికిత్సల్ని కొనసాగించబోమని ఆశా స్పష్టం చేసింది. బుధవారం రూ.203 కోట్లను విడుదల చేశామని, మిగిలిన బకాయిల్ని త్వరలో విడుదలకు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, సేవల్ని కొనసాగించాలని జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆశా ప్రతినిధులను ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ లక్ష్మీశా కోరారు. రూ.1,600 కోట్లకుపైగా ఉన్న బకాయిల్లో కనీసం 50% అయినా చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ కింద సేవల్ని కొనసాగిస్తామని వారు స్పష్టంచేశారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద అనుబంధ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలనుకున్న రోగులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ముఖ్యంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు చేయించుకుని, శస్త్రచికిత్సల కోసం తేదీల్ని ఖరారు చేసుకున్న వారు మరింత ఇబ్బందిపడే అవకాశం ఉంది. ‘ఆరోగ్యశ్రీ ట్రస్టు తరఫున బుధవారం రూ.203 కోట్లు విడుదల చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లో కలిపి ఇప్పటివరకు రూ.366 కోట్లను అనుబంధ ఆసుపత్రుల ఖాతాల్లో జమచేశాం. మిగిలిన బకాయిలను త్వరలోనే చెల్లిస్తాం. రోగులకు సేవలు అందించని ఆసుపత్రులపై తగిన చర్యలు తీసుకుంటాం’ అని లక్ష్మీశా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు అసౌకర్యం కలగకుండా చూడాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు... ప్రాంతీయ, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని