Amaravathi: అమరావతిలో కదలిక!

రాజధాని అమరావతికి పట్టిన పీడ విరగడైంది.. పనుల్లో కదలిక మొదలైంది.. స్తబ్ధత తొలగుతోంది.. ఐదేళ్లుగా స్తంభించిన నిర్మాణ పనులు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి.

Updated : 09 Jun 2024 12:42 IST

రాజధానిలో ముళ్ల కంపల తొలగింపు పనుల ప్రారంభం
70కి పైగా పొక్లెయిన్‌లు.. రాత్రి, పగలు కార్యకలాపాలు 

ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ భవన నిర్మాణ పనులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: రాజధాని అమరావతికి పట్టిన పీడ విరగడైంది.. పనుల్లో కదలిక మొదలైంది.. స్తబ్ధత తొలగుతోంది.. ఐదేళ్లుగా స్తంభించిన నిర్మాణ పనులు తిరిగి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. సీఆర్డీఏ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నుంచి రాజధాని నగర పరిధిలోని గ్రామాల్లో రహదారులు, ముఖ్యమైన కట్టడాలు, నిర్మాణాల వెంబడి ఉన్న ముళ్ల కంపలను, ముళ్ల చెట్లను పొక్లెయిన్‌లతో తొలగిస్తున్నారు. సుమారు 70కి పైగా జేసీబీలు రాత్రి, పగలు తేడా లేకుండా రాజధానిలో పనులు చేస్తున్నాయి. సీఆర్డీఏ అధికారులు వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 12న ఎన్టీఆర్‌ జిల్లా గన్నవరం సమీపంలో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తరువాత తరచూ అమరావతిలోని వెలగపూడి సచివాలయానికి ఆయన వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రాజధానిలో ఉన్న ముళ్ల కంపలను తొలగించాలని సీఆర్డీఏ అధికారులు నిర్ణయం తీసుకొని జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టారు. ప్రధానంగా అనుసంధాన రహదారులకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఆ తరువాత రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు, సీఆర్డీఏ ఆధీనంలోని భూముల్లో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం తుళ్లూరు, రాయపూడి, హైకోర్టు, సచివాలయం, వెంకటపాలెం, లింగాయపాలెం, నేలపాడు, శాఖమూరు, వెలగపూడి, మందడం, ఉద్దండరాయునిపాలెం తదితర ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయి. వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న అనంతరం అమరావతిని పాడుబెట్టింది. దీంతో ఈ ప్రాంతమంతా ముళ్ల పొదలతో చిట్టడవిలా మారిపోయింది. ఎవరి ప్లాటు ఎక్కడ ఉందో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొంది. మరోవైపు రాయపూడి వద్ద ఉన్న సీఆర్డీఏ జోనల్‌ కార్యాలయం, తుళ్లూరు సమీపంలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ భవనాల నిర్మాణం పనుల్లో కూడా వేగం పెరిగింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజధాని గుత్తేదారు సంస్థలతో సమీక్ష నిర్వహించి నిర్మాణ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం ఉంది.

పొక్లెయిన్‌లతో పిచ్చిమొక్కల తొలగింపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని