జగన్‌ కేసుల్లో డిశ్ఛార్జి పిటిషన్లను పరిష్కరించని సీబీఐ కోర్టు

సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న డిశ్ఛార్జి పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించినా ప్రయోజనం లేకపోయింది.

Updated : 06 Jun 2024 07:53 IST

గత ఆదేశాలను సంబంధిత కోర్టులకు పంపండి
రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉన్న డిశ్ఛార్జి పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించినా ప్రయోజనం లేకపోయింది. పైగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసుల సంఖ్య ఈ ఏడాది పెరిగింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో పెండింగ్‌లో ఉన్న 134కుపైగా డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు పూర్తికాగా తీర్పు వెలువడలేదు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో డిశ్ఛార్జి పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. గతేడాది నవంబరు నుంచి ఒక్కదానిలోనూ తీర్పు వెలువడలేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ.. ధర్మాసనానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ధర్మాసనం నేతలపై ఉన్న కేసుల పరిష్కారానికి గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంబంధిత కోర్టులకు పంపాలని ఆదేశిస్తూ విచారణను జులై 3కు వాయిదా వేసింది.

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ 19కు వాయిదా

జగన్‌ అక్రమాస్తుల కేసులపై విచారణను హైదరాబాద్‌ సీబీఐ కోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది. జగన్‌ అక్రమాస్తులపై సీబీఐ నమోదు చేసిన 11 కేసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 9 కేసుల్లో ప్రధాన నిందితులైన జగన్, విజయసాయిరెడ్డితోపాటు ఇతర నిందితులు దాఖలు చేసిన 134కుపైగా డిశ్ఛార్జి పిటిషన్లపై బుధవారం సీబీఐ కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. జగన్‌ తరఫు న్యాయవాది గడువు కోరడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.

నేతలపై పెరిగిన కేసులు

ప్రజాప్రతినిధులపై తాజాగా దాదాపు 143 కేసులు నమోదయ్యాయి. వారిపై మొత్తంగా 258 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు రిజిస్ట్రీ తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. 235 కేసుల్లో సమన్లు జారీ అయినట్లు తెలిపారు. అశ్వనీకుమార్‌ ఉపాధ్యాయ్‌ కేసులో ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8లో పేర్కొన్న కేసుల సత్వర విచారణ కోసం గతేడాది నవంబరు 9న సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల అమలుపై తీసుకున్న సుమోటో పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌తో కూడిన ప్రత్యేక ధర్మాసనం మరోసారి విచారించింది. అయితే రెండు కేసుల్లోనే నిందితులను హాజరుపరచడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సమన్లు జారీ అయిన కేసుల్లో నిందితుల హాజరుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని