AP CID: వాసుదేవరెడ్డి నివాసంలో కొనసాగుతున్న సోదాలు

జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యనాయకులు సూత్రధారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) పూర్వపు ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.

Updated : 10 Jun 2024 07:25 IST

పూర్తయ్యాక ప్రాథమిక నివేదిక!

ఈనాడు-అమరావతి: జగన్‌ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యనాయకులు సూత్రధారులుగా కొనసాగించిన మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) పూర్వపు ఎండీ, ఐఆర్‌టీఎస్‌ అధికారి డి.వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 7న హైదరాబాద్‌ నానక్‌రాంగూడలోని ఆయన విల్లాలో ప్రారంభమైన సోదాలు గత మూడు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడ కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తాడేపల్లిలోని వాసుదేవరెడ్డి నివాసం, ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో తాళాలు వేసి ఉన్న కొన్ని బీరువాల్లో సోదాలు నిర్వహించేందుకు సీఐడీ బృందాలు ఉన్నతాధికారుల అనుమతి కోరాయి. లభించిన వెంటనే..అక్కడా సోదాలు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఏపీఎస్‌బీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్‌ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో ఈ నెల 6న వాసుదేవరెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పూర్తయ్యాక ప్రాథమిక నివేదిక సిద్ధం చేయనున్నారు. వైకాపా హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైకాపా నాయకులు, వారి సన్నిహితులు కలిసి.. మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ గుత్తాధిపత్యంలో ఉంచుకుని భారీ ఎత్తున దోచుకున్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఆ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని