CM Revanth Reddy: రామోజీరావు వ్యక్తి కాదు.. వ్యవస్థ

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావు ఒక వ్యక్తి మాత్రమే కాదని.. వ్యవస్థ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొనియాడారు.

Updated : 12 Jun 2024 07:06 IST

నివాళి అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి
కుటుంబ సభ్యులకు పరామర్శ

రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళి అర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ దివంగత రామోజీరావు ఒక వ్యక్తి మాత్రమే కాదని.. వ్యవస్థ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆయన మరణం ప్రజలకు తీరని నష్టమని పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై పోరాడే విషయంలో రామోజీరావు.. తాను స్థాపించిన ‘ఈనాడు’, ఈటీవీ మాధ్యమాల ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించారని అన్నారు. సీఎం మంగళవారం ఫిల్మ్‌సిటీలోని రామోజీరావు నివాసానికి వెళ్లారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రామోజీరావు తనయుడు, ‘ఈనాడు’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్‌సిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయేశ్వరిలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీ మనవరాళ్లు సహరి, బృహతి, దివిజ, మనవడు సుజయ్, సహరి భర్త రేచస్‌లను పలకరించారు. రామోజీరావుతో తనకు ఉన్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. సీఎంతో పాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, రాష్ట్ర రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి.. రామోజీకి నివాళి అర్పించారు. సీఎం మాట్లాడుతూ.. ‘రామోజీరావు చూపిన మార్గంలో ఆయన ఆలోచన విధానాలకు అనుగుణంగా మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజల పక్షాన నిలబడుతుంది. రామోజీ లాంటి మరో వ్యక్తి రారు. ఆయనకు ప్రత్యామ్నాయం లేదు. ఆయన చూపిన మార్గంలో వారి సంస్థలు.. ప్రజల తరఫున నిలబడతాయని ఆకాంక్షిస్తున్నా. వారి కుటుంబానికి, సంస్థలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటా’ అని సీఎం భరోసా ఇచ్చారు.

రామోజీరావుకు నివాళి అర్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. చిత్రంలో బృహతి, రేచస్‌ ఎల్ల, సహరి,
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, ఈనాడు ఎండీ కిరణ్, దివిజ, సుజయ్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి

అందరికీ ఆదర్శప్రాయులు.. ఇంద్రసేనారెడ్డి 

రామోజీరావు మృతి తెలుగు సమాజానికి తీరని లోటని త్రిపుర గవర్నర్‌ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలుగు ప్రజలు అభిమానించే రామోజీరావు అందరికీ ఆదర్శప్రాయులని అన్నారు. మంగళవారం ఆయన రామోజీ నివాసానికి వెళ్లి.. నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. రామోజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఎందరికో స్ఫూర్తి: ఎమ్మెల్యే జి.వివేక్‌

రామోజీరావు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి కొనియాడారు. రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శించారు. మీడియాకు విశ్వసనీయత తీసుకురావడంలో రామోజీ కీలకపాత్ర పోషించారన్నారు. సంక్లిష్ట సమయాల్లో ప్రజల పక్షాన తన గళాన్ని బలంగా వినిపించారన్నారు.

రామోజీరావు కుటుంబసభ్యులను పరామర్శిస్తున్న త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌. చిత్రంలో శైలజా కిరణ్, కిరణ్, విజయేశ్వరి


అత్యున్నత స్థాయి జర్నలిజంలో ఓ శకం ముగిసింది.. కేఆర్‌ వేణుగోపాల్‌ 

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూయడంతో అత్యున్నత స్థాయి ప్రాంతీయ జర్నలిజంలో ఒక శకం ముగిసినట్లయిందని ప్రధాన మంత్రి మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి కేఆర్‌ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. రామోజీ జర్నలిజం ద్వారా జాతీయ ప్రాధాన్యమున్న ఎన్నో అంశాలను ప్రభావితం చేయగలిగారని తెలిపారు. 1982లో ‘ఈనాడు’ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఒంటిచేత్తో విప్లవాత్మక మార్పునకు నాంది పలికారని వివరించారు. ఫలితంగానే ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఎన్టీఆర్‌ ఓడించగలిగారన్నారు. అధికారంలోకి రాగానే ఎన్టీఆర్‌ తెచ్చిన సంస్కరణలు, జాతీయ స్థాయిలో తెదేపా చూపిన ప్రభావం వెనక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక దినపత్రికగా ‘ఈనాడు’ పాత్ర ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నారు. రామోజీరావు కుటుంబానికి, ‘ఈనాడు’ పరివారానికి కేఆర్‌ వేణుగోపాల్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని