Polavaram: నమ్మించారు.. నిండా ముంచారు

గోదావరి వరదలకు 2021లో పోలవరం బ్యాక్‌వాటర్‌ రావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అతలాకుతలమైంది. ముంపు ప్రభావిత గ్రామాలతోపాటు దేవీపట్నం, పూడిపల్లి, కె.వీరవరం, తొయ్యేరు తదితర గ్రామాలవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మైదాన ప్రాంతాలకు పరుగులు తీశారు.

Published : 27 May 2024 04:07 IST

ఇదీ పోలవరం నిర్వాసిత కుటుంబాల వేదన
పునరావాసం లేక.. ప్యాకేజీ రాక అవస్థలు

గోకవరంలో అసంపూర్తిగా పునరావాస కాలనీ

దేవీపట్నం మండలంలోని పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం. అర్హత ఉండీ ప్రయోజనాలు అందనివారి వివరాలు సేకరిస్తాం. అధికారులనే గ్రామాలకు పంపించి త్వరితగతిన సమస్య పరిష్కరిస్తాం. ఓటు హక్కు బదిలీ అయినంత మాత్రాన ప్యాకేజీ రాదనే ఆందోళన వద్దు.

ఫిబ్రవరి 29న గోకవరంలోని కృష్ణుడిపాలెం, దేవీపట్నం పునరావాస కాలనీల గ్రామసభల్లో రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌


నిర్వాసితులకు న్యాయం చేయడంలో ఎవరు మోసం చేస్తున్నారో తెలియడం లేదు. కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు పంపించి ఏడిపిస్తున్నారు. అర్హులకు ప్యాకేజీ, పరిహారం ఇవ్వడం లేదు. నూటికి 90 మందికి తిండిలేక అవస్థలు పడుతున్నాం.

నిర్వాసితులకు న్యాయం కోసం ఇటీవల ప్రాణత్యాగానికి సిద్ధమైన రైతు సీతారామయ్య ఆవేదన


ఈనాడు, రాజమహేంద్రవరం - న్యూస్‌టుడే, దేవీపట్నం: గోదావరి వరదలకు 2021లో పోలవరం బ్యాక్‌వాటర్‌ రావడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అతలాకుతలమైంది. ముంపు ప్రభావిత గ్రామాలతోపాటు దేవీపట్నం, పూడిపల్లి, కె.వీరవరం, తొయ్యేరు తదితర గ్రామాలవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని మైదాన ప్రాంతాలకు పరుగులు తీశారు. ఆ తరువాత వచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఏడాదిలోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయించి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లిస్తామని హామీల వర్షం కురిపించారు. మూడేళ్లు దాటినా ఇప్పటికీ ఆ హామీలు నెరవేరలేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలోని కృష్ణుడిపాలెంలో 19 గ్రామాల కోసం నిర్మించిన పునరావాస కాలనీలో కొందరికి ఇళ్లు కేటాయించారు. దేవీపట్నం, పూడిపల్లి ప్రజలకు మాత్రం ఇప్పటికీ గూడు కల్పించలేదు. దీంతో వారంతా గోకవరం, కోరుకొండ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో తలదాచుకుంటున్నారు. గుత్తేదారుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇళ్ల నిర్మాణాలు అర్ధాంతరంగా నిలిచాయి. 

గోకవరంలో 75 ఎకరాల సేకరణ

దేవీపట్నం, పూడిపల్లి గ్రామాల ప్రజల పునరావాసానికి గోకవరంలో 75 ఎకరాలను సేకరించారు. దేవీపట్నం ప్రజల కోసం 55 ఎకరాలను ప్రత్యేకించారు. ఒక్కొక్కరికీ ఐదు సెంట్ల చొప్పున ఎకరాలో 12 మందికి ఇళ్ల స్థలాలను కేటాయించి మిగిలిన భూమిని సామాజిక అవసరాలకు వినియోగించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అందరికీ పట్టాలు అందజేశాక 530 ఇళ్లకు ప్రతిపాదించి 430 ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. పూడిపల్లి వాసుల కోసం 20 ఎకరాల్లో 74 ఇళ్లు మంజూరు చేశారు. 70 చివరి దశకు చేరుకున్నాయి. నాలుగు వివాదంలో ఉన్నాయి. దేవీపట్నం వాసులకు కేటాయించిన భూమిలో దాదాపు ఎనిమిదెకరాల విషయంలో న్యాయపరమైన వివాదాలు నెలకొనడంతో నిర్వాసితులకు పట్టాలిచ్చినా పనులు ప్రారంభించలేదు. రెండుచోట్లా కలిపి ఇప్పటివరకు మొత్తం 439 ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుంది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కడా సీసీ రహదారులు, విద్యుత్తు తదితర మౌలిక వసతులు కల్పించలేదు. కె.వీరవరంలోని 52 గిరిజన కుటుంబాలకు కంబలంపాలెం సమీపంలోని గుబ్బలంపాలెం పునరావాస కాలనీకి ఆనుకుని కొండ సమీపంలో పునరావాసం కల్పించారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పునరావాస ప్యాకేజీ కోసం దేవీపట్నం మండలంలోని 44 గ్రామాల్లోనూ బాధితులున్నారు. తమకు ప్యాకేజీ పొందేందుకు అర్హత ఉందంటూ సుమారు 1,100 మంది దరఖాస్తు చేశారు. వారు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. 

న్యాయం చేస్తామని నమ్మకం కల్పిస్తారా?

ఓటర్ల ప్రమేయం లేకుండా రంపచోడవరం నుంచి జగ్గంపేట నియోజకవర్గానికి ఓట్లు ఎలా బదిలీ చేశారన్న స్థానికుల ప్రశ్నలపై స్పందించిన రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌ ఫిబ్రవరి 29న కృష్ణుడిపాలెం, దేవీపట్నం పునరావాస కాలనీల్లో హడావుడిగా గ్రామసభలు నిర్వహించారు. వారంలో అధికారులను గ్రామానికి పంపించి పోలవరం నిర్వాసితులకూ న్యాయం చేస్తామని అన్నారు. ఓటు మారినంత మాత్రాన ప్యాకేజీ రాదనే భయం వద్దని భరోసానిచ్చారు. ‘ఇప్పటికి ఆరుగురు ఐఏఎస్‌ అధికారులు వచ్చి వెళ్లారు. ఇప్పుడు మీరూ సమస్యలన్నీ ఓపికగా విన్నారు. న్యాయం చేస్తారనే నమ్మకముంది’ అని మహిళలు కన్నీటిపర్యంతమయ్యారు. ఆనాడు భరోసా ఇచ్చిన ఆయన ఆ తరువాత గ్రామాలకు సిబ్బందిని పంపలేదు. ప్యాకేజీలకు సంబంధించిన అర్హులనూ నిర్ధారించలేదు. దేవీపట్నం నివాసి, రైతు సీతారామయ్యకు అర్హత ఉన్నా ప్యాకేజీకి అనర్హుడంటూ ఇప్పటికీ వర్తింపజేయలేదు. అర్హత ఉండీ ప్యాకేజీలు, ఇళ్లు అందక, భూనిర్వాసితులకు నష్టపరిహారం దక్కక అనేక మంది ఇబ్బందులను గమనించి తన చావుతోనైనా అందరికీ న్యాయం జరుగుతుందని పురుగు మందుతాగి నిర్వాసిత రైతు సీతారామయ్య శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి కార్యాలయం వద్దే ఆత్మహత్యాయత్నం చేశారు. 


మూడేళ్లవుతున్నా పట్టించుకోలేదు 

‘మేము నిర్మిస్తే ఆలస్యమవుతుంది. మీరే కట్టుకుంటే ఇంటి నిర్మాణానికి డబ్బులిస్తాం’ అని నాడు అధికారులు చెప్పి నమ్మించారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతోపాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.2.85 లక్షలు బ్యాంకు ఖాతాలో వేస్తామన్నారు. గ్రామాన్ని ఖాళీ చేసి మూడేళ్లవుతున్నా డబ్బులందలేదు. ఇళ్లు లేక నెలకు రూ.3వేల నుంచి రూ.5వేల వరకు అద్దెలు చెల్లిస్తూ ఇబ్బందులు పడుతున్నాం. 

దేవిశెట్టి వీరయ్యదొర, పూడిపల్లి


నిలువ నీడ లేకుండా చేశారు..

వరద భయంతో బయటకు వచ్చిన పోలవరం ముంపు గ్రామాల నిర్వాసితులను ప్రభుత్వం రోడ్డున పడేసింది. కాలనీకి వచ్చిన ప్రతి అధికారి మీ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని మూడేళ్లుగా దేవీపట్నం నిర్వాసితులకు హామీలిస్తున్నారు. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఇంటి నిర్మాణాలు మధ్యలోనే నిలిచాయి. కాలనీలు పూర్తవకుండానే ఇటీవల కురిసిన వర్షానికి దేవీపట్నం పునరావాస కాలనీ గోదావరిని తలపించింది.

కుంజం రాజామణి, సర్పంచి, దేవీపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని