Cyclone Remal: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుపానుగా బలపడింది. దీనికి ‘రెమాల్‌’గా నామకరణం చేశారు.

Updated : 26 May 2024 07:10 IST

‘రెమాల్‌’గా నామకరణం
నేటి అర్ధరాత్రి తీరం దాటే అవకాశం
ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు

విజయవాడ జమ్మిచెట్టు సెంటర్‌లో నిలిచిన వర్షపు నీరు

ఈనాడు  డిజిటల్, విశాఖపట్నం, అనంతపురం, ఈనాడు, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుపానుగా బలపడింది. దీనికి ‘రెమాల్‌’గా నామకరణం చేశారు. ఇది ఖెపుపరా (బంగ్లాదేశ్‌)కు నైరుతి దిశలో, సాగర్‌ దీవులకు (పశ్చిమ బెంగాల్‌) దక్షిణ-ఆగ్నేయంగా, క్యానింగ్‌ (పశ్చిమ బెంగాల్‌)కు దక్షిణ-ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఉత్తరదిశగా కదులుతూ ఆదివారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రికి ఖెపుపరా, సాగర్‌ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశముందని వెల్లడించింది. ఆ సమయంలో గరిష్ఠంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. తుపాను నేపథ్యంలో ఏపీ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అండమాన్, నికోబార్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. మరోవైపు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా రాజస్థాన్‌ నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరు వద్ద పెద్ద వంకలో కొట్టుకుపోతున్న ఆవు

ప్రధానంగా అనంతపురం, ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. విజయవాడలోని పలు రహదారులపై వర్షపునీరు నిలిచిపోయింది. అనంతపురం జిల్లాలో శుక్రవారం రాత్రి భారీవర్షం కురిసింది. అత్యధికంగా కళ్యాణదుర్గం మండలంలో 86.4, కణేకల్లులో 70, ఉరవకొండలో 62 మి.మీ.లు నమోదైంది. ఈదురుగాలులకు యల్లనూరు, యాడికి, పెద్దపప్పూరు, కంబదూరు, ఉరవకొండ, నార్పల, శెట్టూరు, బెళుగుప్ప, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు మండలాల్లో అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. టమాటా పంట సైతం దెబ్బతింది. శ్రీసత్యసాయి జిల్లాలోని మడకశిర మండలంలో 72.2 మి.మీ.లు, కనగానపల్లి మండలంలో 63 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. తాడిమర్రి, మడకశిర మండలాల్లో దానిమ్మ, అరటి పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదివారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

బెళుగుప్ప మండలం దుద్దేకుంటలో నేలికూలిన అరటి పంటను చూపుతున్న రైతు రుద్రప్ప


టవర్‌ పడటంతో నుజ్జనుజ్జయిన వాహనం


వ్యాన్‌పై కూలిన గాలిమర టవర్‌ ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

గొల్లచంద్ర

కోడుమూరు పట్టణం, గోనెగండ్ల, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు వద్ద శనివారం గాలిమరలు బిగించే టవర్‌ ఓ వ్యానుపై కూలడంతో అందులో ఉన్న కోడుమూరుకు చెందిన గొల్ల చంద్ర దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కోడుమూరుకు సమీపంలో గాలిమరలు ఏర్పాటుచేస్తున్న గ్రీన్‌కో సంస్థకు చంద్ర తన వాహనాన్ని అద్దెకు తిప్పుతున్నారు. గాలివాన కారణంగా ఆయనతో పాటు మరో ఇద్దరు వాహనంలో సేద తీరుతుండగా టవర్‌ కూలి వ్యానుపై పడింది. వ్యానులో ఇరుక్కుపోయిన చంద్రను బయటకు తీసి, ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. గాయపడిన వారిలో ఒకరు గూడూరుకు చెందిన బోయ సోమన్న కాగా.. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని