Cyclone Remal: తీరం దాటిన రెమాల్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను ఆదివారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

Updated : 27 May 2024 06:58 IST

ఒడిశా, పశ్చిమబెంగాల్‌లో విస్తారంగా వానలు
వర్షాలు, ఈదురుగాలులకు తెలంగాణలో 13 మంది మృతి
కోల్‌కతా, ఈనాడు డిజిటల్‌ - విశాఖపట్నం, న్యూస్‌టుడే - కొత్తపల్లి

కాకినాడ జిల్లాలోని ఉప్పాడ బీచ్‌రోడ్డుపై కెరటాల ఉద్ధృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘రెమాల్‌’ తుపాను ఆదివారం ఉదయం తీవ్ర తుపానుగా బలపడింది. ఇది ఉత్తర దిశగా పయనించి ఆదివారం అర్ధరాత్రి దాటాక బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్‌ సరిహద్దుల్లో తీరం దాటినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో గరిష్ఠంగా 135 కి.మీ. వేగంతో గాలులు వీచాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటికే బెంగాల్‌ ప్రభుత్వం 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి కోల్‌కతా విమానాశ్రయం నుంచి సర్వీసులను అధికారులు నిలిపివేశారు. తూర్పు, ఆగ్నేయ రైల్వేలు కూడా రైలు సేవలను రద్దు చేశాయి. సహాయక చర్యల కోసం 16 బెటాలియన్ల రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ దళాలను అధికారులు సిద్ధం చేశారు. బంగ్లాదేశ్‌ కూడా 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను సన్నద్ధతపై ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ ఆదివారం సమీక్ష నిర్వహించారు. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ సి.వి.ఆనందబోస్‌ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తుపాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని తీరప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడ్డాయి. ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, కోనపాపపేట తదితర చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో ఉప్పాడ - కాకినాడ బీచ్‌రోడ్డుపై రాకపోకలు నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. సోమవారానికి ఇది తుపానుగా బలహీనపడనున్న నేపథ్యంలో కోల్‌కతా, సాగర్‌ ద్వీపం, హుగ్లీ పోర్టులకు ఎనిమిది, పారాదీప్, ధామ్రా పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు, గోపాలపుర్‌ నుంచి తూత్తుకుడి వరకు అన్ని పోర్టులకు రెండో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను పరిస్థితిపై దిల్లీలోని ప్రత్యేక ప్రాంతీయ వాతావరణ కేంద్రం (ఆర్‌ఎస్‌ఎంసీ) అధికారులు.. మయన్మార్, బ్యాంకాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మాల్దీవులు, ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఖతర్‌ ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు. ‘రెమాల్‌’ ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ నెల 28 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.

రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు

తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వేడి, ఉక్కపోత అధికమైంది. తుని, కాకినాడ, నరసాపురం, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, అమరావతి, బాపట్ల తదితర ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీలు పెరిగాయి. రానున్న రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం ఒకటి, రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. 72 మండలాల్లో తీవ్ర వడగాలులు, 200 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని