Cyclone Remal: బంగాళాఖాతంలో వాయుగుండం

రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. శుక్రవారం కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.

Updated : 25 May 2024 06:24 IST

నేడు తీవ్ర తుపానుగా బలపడే అవకాశం
రాష్ట్రంపై ప్రభావం ఉండదన్న ఐఎండీ
పశ్చిమ బెంగాల్‌ వద్ద తీరం దాటనున్నట్లు వెల్లడి

ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. శుక్రవారం కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అత్యధికంగా కర్నూలు జిల్లా తాళ్లగోకులపాడులో 147 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లాలోని కాకినాడ గ్రామీణ ప్రాంత పరిధిలో 103, పిఠాపురంలో 67.75, శంఖవరంలో 67 మి.మీ వర్షం కురిసింది. దాదాపు 60 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు పడ్డాయి. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా బలపడింది. ఇది ఖేపుపరా (బంగ్లాదేశ్‌)కు దక్షిణ నైరుతి దిశలో 700 కి.మీ, పశ్చిమబెంగాల్‌ సమీపంలోని సాగర్‌ ద్వీపానికి 660 కి.మీ, క్యానింగ్‌కు 710 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈశాన్య దిశగా కదులుతూ శనివారం ఉదయానికి తుపానుగా, రాత్రికి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) పేర్కొంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఖెపుపరా, సాగర్‌ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 130 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఈ తుపానుకు ఒమన్‌ సూచించిన ‘రెమాల్‌’ అనే పేరు పెట్టారు. తుపాను నేపథ్యంలో తూత్తుకుడి నుంచి చెన్నై వరకు, గోపాలపూర్‌ నుంచి సాగర్‌ ద్వీపం వరకు గల పోర్టుల్లో ఒకటో నంబరు హెచ్చరికలు జారీ చేశారు.

తుపాను ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం అధికారిణి సునంద తెలిపారు. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు