Chandra babu: గేటు దగ్గర్నుంచే పంపేశారు

గత ఐదేళ్లుగా వైకాపాతో అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లగా భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించారు.

Updated : 07 Jun 2024 07:53 IST

వైకాపాతో అంటకాగిన ఐపీఎస్, ఐఏఎస్‌లకు నో ఎంట్రీ 
చంద్రబాబు ఇంటికి వెళ్లిన పీఎస్‌ఆర్, సంజయ్‌ 
అపాయింట్‌మెంట్‌ లేనిదే కలవరన్న సిబ్బంది 
సిట్‌ అధిపతి రఘురామ్‌రెడ్డికీ అనుమతి నిరాకరణ

ఈనాడు, అమరావతి: గత ఐదేళ్లుగా వైకాపాతో అంటకాగి ఆ పార్టీ అరాచకాలకు వెన్నుదన్నుగా ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లగా భద్రతా సిబ్బంది అనుమతి నిరాకరించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న తెదేపా అధినేతను కలిసేందుకు వచ్చిన నిఘా విభాగం మాజీ అధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును తొలుత కరకట్టపై ఉన్న ప్రధాన గేటు వద్దనున్న సిబ్బంది.. లోపలికి అనుమతించారు. అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్లే లోపలి గేటు వద్ద సిబ్బంది ఆయన్ను ఆపేశారు. ముఖ్య భద్రతాధికారి అక్కడకు వచ్చి అపాయింట్‌మెంట్‌ లేనిదే చంద్రబాబు ఎవర్నీ కలవట్లేదని పీఎస్‌ఆర్‌తో చెప్పడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. సీఐడీ విభాగాధిపతి సంజయ్, గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిని ప్రధాన గేటు వద్దే ఆపేసి.. అనుమతి లేదని వెనక్కి పంపించేశారు. సిట్‌ అధిపతి కొల్లి రఘురామ్‌రెడ్డి చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్‌ కోసం ఆయన వ్యక్తిగత సిబ్బందిని సంప్రదించగా అనుమతి లభించలేదు. చంద్రబాబు, లోకేశ్, నారాయణ సహా పలువురిపై అక్రమ కేసుల బనాయింపు, చంద్రబాబు అరెస్టులో రఘురామ్‌రెడ్డే కీలక పాత్రధారి. అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు, నైపుణ్యాభివృద్ధి, ఫైబర్‌గ్రిడ్, ఎసైన్డ్‌ భూములు సహా వివిధ కేసుల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్యుల తరఫున రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఆయనే అమలు చేశారన్న ఫిర్యాదులున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని