Election Commission: ఈవీఎం ధ్వంసం ఘటనలో పీఓ, ఏపీఓ సస్పెన్షన్‌

మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పోలింగ్‌ అధికారి (పీఓ), సహాయ పోలింగ్‌ అధికారి (ఏపీఓ)లను సస్పెండ్‌ చేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు.

Published : 24 May 2024 06:16 IST

పిన్నెల్లిని అరెస్టు చేయాలంటూ ఈసీ సీరియస్‌
ఆ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా

ఈనాడు, అమరావతి: మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పోలింగ్‌ అధికారి (పీఓ), సహాయ పోలింగ్‌ అధికారి (ఏపీఓ)లను సస్పెండ్‌ చేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు వెలువడక ముందు.. గురువారం మధ్యాహ్నం మీనా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేసేందుకు అదనపు ఎస్పీ, డీఎస్పీలు సహా ఎనిమిది బృందాల పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు. ఈవీఎం ధ్వంసం  విషయంలో ఎన్నికల సంఘం సీరియస్‌గా ఉందని, త్వరలోనే ఎమ్మెల్యేను అరెస్టు చేసి తీరతామని ఆయన స్పష్టం చేశారు. పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన దృశ్యాలు ఎన్నికల సంఘం నుంచి బయటకు వెళ్లలేదన్నారు. దర్యాప్తు సమయంలో ఎక్కడో ఎవరి చేతి నుంచో బయటకు వెళ్లి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గానికి బయటి నుంచి ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించేందుకు తెదేపా నాయకులు ఇప్పుడు వెళ్లడం సరికాదన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని.. తెదేపా నేతలు వెళితే వైకాపా నేతలు కూడా పరామర్శలకు వెళ్తామని అంటారని చెప్పారు. పరిస్థితులు మళ్లీ అదుపు తప్పే అవకాశం ఉన్నందున పరామర్శలకు ఇది సమయం కాదని వ్యాఖ్యానించారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలి

వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపునకు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా అన్ని ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని సూచించారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో సీఈఓ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఓట్ల లెక్కింపునకు ఏయే ఏర్పాట్లు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో జూన్‌ 4న ఓట్ల లెక్కింపును కూడా విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలన్నారు. ఏ రోజున ఎన్ని గంటలకు ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారో ఆ వివరాలు రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలని ఆదేశించారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌ల నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఈవీఎంలను తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. లెక్కింపు కేంద్రాల్లో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్‌ కేంద్రాల సంఖ్యను బట్టి ఓట్ల లెక్కింపు టేబుళ్లను వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక టేబుళ్లు వేయాలన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలట్‌ ఓట్లు, ఆ తర్వాత ఈవీఎంల్లోని ఓట్లు లెక్కించాలని మీనా జిల్లా ఎన్నికల అధికారులకు తెలియజేశారు. ఓట్ల లెక్కింపునకు సిబ్బందిని నియమించుకుని వారికి ముందుగా శిక్షణ ఇవ్వాలన్నారు.

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్ఠమైన మూడంచెల భద్రత కొనసాగుతోందని సీఈఓ చెప్పారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు సీలు వేసిన తలుపులు, సెక్యూరిటీ కారిడార్లను కవర్‌ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కంట్రోల్‌ రూమ్‌ నుంచి అధికారులు అనుక్షణం పర్యవేక్షిస్తుండాలన్నారు. భద్రత, పర్యవేక్షణపై పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మీనా సూచించారు. సమావేశంలో అదనపు సీఈఓలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్‌.హరిందర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈసీ ఆదేశాల మేరకు చర్యలు

నరసరావుపేట అర్బన్, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ రోజు సత్తెనపల్లి జీజేసీ జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు పీవీ సుబ్బారావు పీఓగా, వెంకటపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని షేక్‌ షహనాజ్‌ బేగం ఏపీఓగా వ్యవహరించారు. ఈ కేంద్రంలోని ఈవీఎంను వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన నేపథ్యంలో పోలింగ్‌ సిబ్బందిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలింగ్‌ రోజు ఎన్నికల నియమావళిని ఉల్లఘించినందున.. ఈసీ ఆదేశాలమేరకు పీఓ, ఏపీఓలను విధుల నుంచి తొలగిస్తూ జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేశ్‌ బాలాజీరావు గురువారం ఉత్తర్వులిచ్చారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని