Election Commission: అటెస్టింగ్‌ అధికారి సీలు లేకున్నా పోస్టల్‌ బ్యాలట్‌ చెల్లుబాటు

ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ఫాం-13ఏ పై అటెస్టింగ్‌ అధికారి సీలు వేయలేదనే కారణంతో పోస్టల్‌ బ్యాలట్‌ను తిరస్కరించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అటెస్టింగ్‌ అధికారి పేరు, హోదా వంటి వివరాలన్నీ ఆ ఫాంలో ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలట్‌ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది.

Updated : 27 May 2024 05:34 IST

అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు

ఈనాడు, అమరావతి: ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ఫాం-13ఏ పై అటెస్టింగ్‌ అధికారి సీలు వేయలేదనే కారణంతో పోస్టల్‌ బ్యాలట్‌ను తిరస్కరించరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అటెస్టింగ్‌ అధికారి పేరు, హోదా వంటి వివరాలన్నీ ఆ ఫాంలో ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ పోస్టల్‌ బ్యాలట్‌ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అటెస్టేషన్‌ విషయంలో ఏవైనా సందేహాలు తలెత్తినా నివృత్తి చేసుకోవడానికి, అవసరమైతే ధ్రువీకరించుకోవడానికి వీలుగా... ఫెసిలిటేషన్‌ సెంటర్లలో నియమితులైన అటెస్టింగ్‌ అధికారులందరి పేర్లు, హోదాలతో కూడిన నమూనా సంతకాలు తీసుకుని. ఇతర జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించాలని ఆదేశించింది. పోస్టల్‌ బ్యాలట్‌ పత్రం వెనక భాగంలో సంతకం చేయడం రిటర్నింగ్‌ అధికారి/ సంబంధిత ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించే ఏఆర్‌ఓ బాధ్యత అని పేర్కొంది. లెక్కింపు సమయంలో ఏదైనా సందేహం తలెత్తితే.. ఆ పోస్టల్‌ బ్యాలట్‌ పేపర్‌ సీరియల్‌ నంబర్‌ను సంబంధిత పోస్టల్‌ బ్యాలట్‌ కౌంటర్‌ ఫాయిల్‌పై ఉన్న సీరియల్‌ నంబర్‌తో సరిపోల్చుకోవాలని తెలిపింది. ఆ పోస్టల్‌ బ్యాలట్‌ వాస్తవికతను నిర్ధారించుకునేందుకు అవసరమైతే రిటర్నింగ్‌ అధికారి వద్ద ఉన్న పోస్టల్‌ బ్యాలట్‌ పేపర్‌ ఖాతాతో సరిపోల్చుకోవొచ్చని వెల్లడించింది. ఆ పోస్టల్‌ బ్యాలట్‌ నకిలీదని తేలితే తిరస్కరించొచ్చని పేర్కొంది. ఓటు వేసిన తర్వాత పోస్టల్‌ బ్యాలట్‌ను పొందుపరిచిన బయట కవర్‌ బీ (ఫాం-13సీ)పై ఓటరు సంతకం లేదనే కారణంతో దాన్ని తిరస్కరించకూడదని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదివారం ఆదేశాలు జారీచేశారు. ఈ మార్గదర్శకాలపై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించాలని, కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. 

ఈ సందర్భాల్లో పోస్టల్‌ బ్యాలట్‌ చెల్లదు

  • ఒకరి కంటే ఎక్కువ అభ్యర్థులకు ఓటు వేసినా
  • నకిలీ పోస్టల్‌ బ్యాలట్‌ అని తేలినా
  • వాస్తవమైన పోస్టల్‌ బ్యాలట్‌ పత్రంగా గుర్తించలేనంతగా దెబ్బతిన్నా లేదా చిరిగిపోయినా
  • రిటర్నింగ్‌ అధికారి అందించిన ‘కవర్‌ బీ’ లో దాన్ని తిరిగి ఇవ్వకపోయినా
  • ‘కవర్‌ బీ’లో ఓటరు డిక్లరేషన్‌కు సంబంధించిన ఫాం-13ఏ లేకపోయినా
  • ఎవరికి ఓటు వేశారో స్పష్టత కొరవడినా
  • సీరియల్‌ నంబర్లు సరిపోలకపోయిన
  • ఓటరు తనను గుర్తించేందుకు బ్యాలట్‌పై ఏదైనా రాసినా అది చెల్లదు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని