EC: మెప్మా ఎండీపై విచారణకు ఈసీ ఆదేశం

ఎన్నికల్లో వైకాపాకి అనుకూలంగా పని చేశారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఎండీ విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు.

Published : 22 May 2024 05:18 IST

వైకాపాకు అనుకూలంగా పని చేశారని అందిన ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో వైకాపాకి అనుకూలంగా పని చేశారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఎండీ విజయలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదుపై రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. సీఎం జగన్‌కు సమీప బంధువైన ఆమె స్వయం సహాయక సంఘాలతో పాటు తన పరిధిలోని సిబ్బందితో ఎన్నికల్లో అధికార పార్టీకి మద్దతుగా ప్రచారం చేయించారని గుంటూరుకు చెందిన కె.బాబూప్రకాశ్‌ గత నెల 24న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈసీ.. దానిని ఇటీవల సీఈఓ కార్యాలయానికి పంపించింది. దాంతో ఈ ఫిర్యాదుపై విచారించి 24 గంటల్లో నివేదిక పంపాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని సీఈఓ కార్యాలయం తాజాగా ఆదేశించింది. ‘ఆడిట్‌ శాఖకు చెందిన విజయలక్ష్మి వైకాపా అధికారంలోకి వచ్చాక డిప్యుటేషన్‌పై మెప్మా ఎండీగా చేరారు. డిప్యుటేషన్‌ ముగిసినా ఎండీగా కొనసాగడంతో పాటు ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. స్వయం సహాయక సంఘాల మద్దతు ఆ పార్టీకి లభించేలా ఎన్నికల నోటిఫికేషన్‌కి రెండు రోజుల ముందు ‘స్లమ్‌ లెవెల్‌ ఫెడరేషన్ల’కు రూ.42.50 కోట్ల రుణాలు మంజూరు చేశారు. వైకాపాకు ఓట్లేయకపోతే తదుపరి రుణాలు నిలిపేస్తామని స్వయం సహాయక సంఘాల సభ్యులను బెదిరించారు. మెప్మాలో అనేక కుంభకోణాలు జరిగినా ఎండీపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు’ అని బాబూప్రకాశ్‌ ఫిర్యాదులో ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని