Polavaram: పోలవరం మీదుగా విస్తృత జలరవాణా.. అందుకు అనుగుణంగా ప్రాజెక్టులో కొన్ని మార్పులు

తక్కువ వ్యయంతో విస్తృత ప్రయోజనాలు అందించే జలరవాణాపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో దృష్టి సారించింది.

Updated : 29 May 2024 07:52 IST

అదనంగా రూ.876 కోట్లు ఖర్చు
భరించేందుకు కేంద్ర  జలరవాణా శాఖ సుముఖం

 

ఈనాడు, అమరావతి: తక్కువ వ్యయంతో విస్తృత ప్రయోజనాలు అందించే జలరవాణాపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో దృష్టి సారించింది. జలరవాణాపై అధ్యయనం తర్వాత భద్రాచలం- రాజమహేంద్రవరం జలమార్గాన్ని నాలుగో కేటగిరీలో చేర్చి మూడో స్థాయి ప్రమాణాల ప్రకారం ఈ మార్గాన్ని రూపుదిద్దాలనుకుంటున్నారు. ఈ మార్గంలోనే కీలకమైన పోలవరం ప్రాజెక్టు కూడా ఉంది. జాతీయ ప్రాజెక్టు పోలవరంలోనూ తొలుత జలరవాణా ప్రమాణాల ప్రకారం పనులు చేపట్టారు. తాజాగా ఈ మార్గం ప్రాధాన్యం మారడంతో జలరవాణా మార్గ విస్తృతి కూడా పెరిగింది. దీంతో పోలవరంలో తాజా నేవిగేషన్‌ వ్యవస్థ ప్రకారం ఆధునికీకరించి పనులు చేసేందుకు రూ.876 కోట్లు అదనంగా ఖర్చవుతుందని తేల్చారు. ఆ ఖర్చునూ భరించేందుకు కేంద్రం సమ్మతించింది. పరిశోధనల అనంతరం జలరవాణా నిపుణులు పోలవరంలో కూడా కొన్ని మార్పులు సూచించారు. ఆ ప్రకారం రాబోయే రోజుల్లో కొన్ని ప్యాకేజీల పనుల్లో మార్పులు చేయాల్సి వస్తుంది. దీంతో పోలవరంలో నిర్మాణాలను కొంత మేర ధ్వంసం చేసి కొత్తగా కట్టాలి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించి అధ్యయనం చేసిన కమిటీ కూడా కొత్త జలరవాణా ప్రమాణాల ప్రకారమే ఇక్కడ పనులు చేయాలని తేల్చిచెప్పింది. 


1982 డీపీఆర్‌ - 2015.. కొత్త జలరవాణా ప్రమాణాలు..

భద్రాచలం- రాజమహేంద్రవరం జలరవాణా మార్గంలో పోలవరం కీలక కట్టడం. 1982లోనే దీని డీపీఆర్‌ ఆమోదం పొందింది. అందులో అప్పటి నేవిగేషన్‌ ప్రమాణాల ప్రకారమే కట్టడాల ప్రణాళిక రూపొందించారు. ప్రధానంగా పోలవరం ఎడమ వైపు ఈ నిర్మాణాలు అవసరమవుతాయి. ఇందుకోసం అనుసంధాన పనుల్లో మూడు ప్యాకేజీల ప్రకారం పనులు చేపట్టారు. నాటి నేవిగేషన్‌ ప్రమాణాల ప్రకారమే, కేంద్ర ఆకృతుల సంస్థ డిజైన్లను ఆమోదించగా పనులు పూర్తిచేశారు. 2015లో జలరవాణా అథారిటీ ఈ మార్గాన్ని నాలుగో కేటగిరీలో చేర్చింది. ఇక్కడి ప్రాధాన్యం దృష్ట్యా ఏ స్థాయి నౌకలు ప్రయాణిస్తాయో అందుకు అనుగుణంగానే ఈ మార్గం ఉండాలని నిర్దేశించింది. మూడో స్థాయి ప్రమాణాలను ఈ మార్గానికి నిర్దేశించింది. ఈ అంశంపై స్పష్టత రాకముందే 2019 నాటికే అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో ఎడమవైపు అనుసంధాన ప్రాజెక్టు పనులు పూర్తిచేశారు. తర్వాత పోలవరం అధికారులకు, జలరవాణా అథారిటీ అధికారులకు మధ్య చర్చలు జరిగాయి. తాజా నేవిగేషన్‌ ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలంటే ఒక్క పోలవరంలోనే రూ.876 కోట్ల అదనపు భారం పడుతుందని లెక్కించారు. ఆ నిధులనూ కేంద్ర జలరవాణా మంత్రిత్వశాఖ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు విన్నవించారు. ఈ నేపథ్యంలో ప్రమాణాలు మార్చాలా వద్దా అని అధ్యయనం చేసేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించింది. కుడివైపు నేవిగేషన్‌ సాధ్యం కాదని తేల్చిన ఆ కమిటీ ఎడమవైపు ఆధునిక జలరవాణా ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు సాగాల్సిందేనని పేర్కొంది.


వెడల్పుగా కాలువలు

జలరవాణా మార్గం విస్తృతి నేపథ్యంలో పోలవరంలో తవ్వే కాలువ వెడల్పు పెంచాలి. గోదావరిలో ఎడమవైపున పోలవరం వద్ద దాటేలా పడవలు ప్రయాణించాలంటే 40 మీటర్ల వెడల్పున్న కాలువ కావాలి. ప్రస్తుతం 20 మీటర్లున్న కాలువ వెడల్పును రెట్టింపు చేయాలి. ఇక్కడ టన్నెల్‌ను కూడా 20 మీటర్ల వ్యాసానికి పెంచుతారు. అందుకు అనుగుణంగానే ఇతర ఏర్పాట్లు చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని