Palnadu: పల్నాడు.. వర్గపోరుతో వల్లకాడు.. దశాబ్దాలుగా కోలుకోని కుటుంబాలు

గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఆరాటం.. రాజకీయ నేతల స్వార్థం.. పల్నాడు పల్లెల్లో దశాబ్దాల కింద రగిల్చిన చిచ్చులో ఎన్నో కుటుంబాలు సమిధలైపోయాయి.

Updated : 28 May 2024 07:56 IST

పచ్చని పల్లెల్లో ఫ్యాక్షన్‌ చిచ్చు 

తాజా ఘర్షణలతో నాటి నెత్తుటి గాథలు గుర్తుచేసుకుంటున్న బాధితులు

ఈనాడు- నరసరావుపేట, న్యూస్‌టుడే- కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి: గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఆరాటం.. రాజకీయ నేతల స్వార్థం.. పల్నాడు పల్లెల్లో దశాబ్దాల కింద రగిల్చిన చిచ్చులో ఎన్నో కుటుంబాలు సమిధలైపోయాయి. గ్రామాల్లో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి జరిగిన గొడవల్లో పెద్దదిక్కును కోల్పోయి వితంతువులుగా మిగిలిపోయిన మహిళలు.. తండ్రి లేక తల్లి పడే కష్టంలో పాలుపంచుకుంటూ చదువుకు దూరమైన పిల్లలు పడిన అవస్థలు వర్ణనాతీతం. వర్గాలను కాపాడుకోవడానికి.. కేసులు నమోదైతే బెయిల్, రిమాండ్‌ ఖర్చులకు భూములు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. తన వర్గాన్ని కాపాడుకుంటూ ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి వెచ్చించే ఖర్చుతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి వారసులకు అప్పులు మిగిలాయి. భర్త హత్యకు గురైతే పిల్లలను చూసుకుంటూ పొలాలను సాగు చేసి భారంగా బతుకు లాగిన భార్యల కథలు ఈ గడ్డపై కోకొల్లలు. హత్య కేసుల్లో భర్త జైలుకెళితే కుటుంబపోషణకు, న్యాయస్థానాల ఖర్చులకు భూములు తెగనమ్మి కూలీ పనులకు వెళుతూ అష్టకష్టాలు పడుతున్న అతివల దయనీయ గాథలూ ఎన్నో. హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ప్రత్యర్థులు ఎప్పుడు మీద పడి తెగనరుకుతారోనన్న ఆందోళనతో గ్రామాలు వదిలి ఏళ్లతరబడి పొరుగూళ్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి. ఇలా వర్గపోరు పల్నాడును వల్లకాడులా మార్చింది. దీంతో కొన్ని గ్రామాల ప్రజలు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల రూపంలో మరోసారి పల్నాడులో ఘర్షణలు చెలరేగి సుమారు వెయ్యి మందిపై కేసులు నమోదయ్యాయి. దీంతో పల్నాడులో ఫ్యాక్షన్‌కు బలైపోయిన కుటుంబాలు నాటి ఘటనలను గుర్తుచేసుకుంటున్నారు.


ఏడాదిన్నరలో ఏడు హత్యలు

- బీరవల్లి రామిరెడ్డి, పట్లవీడు గ్రామం, వెల్దుర్తి మండలం

మూడు దశాబ్దాల కిందట పట్లవీడు గ్రామంలో మా పొలంలో మరో సామాజికవర్గం వారి పశువులు వచ్చి మేశాయని వివాదం మొదలైంది. ఈ వివాదం పెద్దదై పొలంలో కూలీలతో పని చేయిస్తున్న మా నాన్నను ప్రత్యర్థులు చంపేశారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిని అక్కడే హతమార్చారు. అంతటితో ఆగకుండా గ్రామంలోకి వచ్చి మా వర్గంలో మరొకర్ని హత్య చేశారు. ఈ గొడవల్ని నియంత్రించే క్రమంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు పోలీసు కాల్పుల్లో మరణించారు. ఒక రోజు వ్యవధిలోనే నలుగురు హత్యకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన రెండు నెలలకు మా తమ్ముడు కనిపించకుండా పోయాడు. ఇది ప్రత్యర్థుల పనేనని గుర్తించినా మిన్నకుండిపోయాం. వీటిని తట్టుకోలేక మా అమ్మ ఏడాదిలోపు మనోవేదనతో చనిపోయింది. నాన్న, తమ్ముడు, అమ్మను కోల్పోయి ప్రత్యర్థులు కళ్లెదుటే తిరుగుతున్నా ఘర్షణకు దూరంగా ఉన్నాం. ఇరువర్గాలు రాజీ చేసుకుని కలిసిపోయిన ఏడాదిలోనే ప్రత్యర్థి వర్గం వారు ముగ్గురిని మట్టుబెట్టారు. దీంతో గ్రామం నుంచి కొందరు ఇళ్లు, పొలాలు వదిలేసి శాశ్వతంగా వలస వెళ్లిపోయారు. ఆ ఇళ్లు శిథిలావస్థకు చేరి ఫ్యాక్షన్‌ కోరలకు ఆనవాళ్లుగా మిగిలిపోయాయి. గొడవల్లో ఆస్తులు, ఆప్తులను పొగొట్టుకున్నాను. వర్గపోరులో అప్పట్లోనే మా నాన్న పదెకరాలు అమ్మేశారు. గ్రామంలో ఆధిపత్యం కోసం గొడవలకు దిగి నష్టపోతే ఎలా ఉంటుందనడానికి మా కుటుంబమే సజీవ సాక్ష్యం.


ఒంటరిగా మిగిలిపోయాను..

- గొంటు రమణమ్మ, రెంటాల గ్రామం, రెంటచింతల మండలం

రెంటాల గ్రామంలో 1994లో చెలరేగిన వివాదంలో నా భర్త గోపాల్‌రెడ్డిని ప్రత్యర్థులు హత్య చేశారు. 8 ఎకరాల వ్యవసాయ భూమి, సొంతిల్లుతో ప్రశాంతంగా సాగిపోతున్న జీవితం తలకిందులైపోయింది. పెద్ద కుమారుడు హనిమిరెడ్డి ఇక్కడ జీవించలేక జంగమేశ్వరపురం వెళ్లిపోయాడు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేయడంతో వారు అత్తగారింటికి వెళ్లిపోయారు. కాలక్రమంలో 6 ఎకరాల భూమి, సగం ఇల్లు కరిగిపోయింది. భర్త ఉన్నప్పుడు ఎంతో హుందాగా బతికిన మా కుటుంబం ఆయన హత్య తర్వాత పడిన అవస్థలు వర్ణనాతీతం. నేతల మాటలు నమ్మి మా కుటుంబం కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఇప్పుడు ఒంటరిగా గ్రామంలో ఉండలేక చిన్న కూతురి ఇంట్లో ఉంటున్నాను. రాజకీయాలు, ముఠా తగాదాల వల్ల నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేతలను నమ్మి తగాదాలకు పోయి విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఓ బాధితురాలిగా అందర్నీ వేడుకుంటున్నాను. 


పదేళ్లపాటు నరకయాతన

- కోటేశ్వరమ్మ, చినగార్లపాడు గ్రామం, కారంపూడి మండలం

చినగార్లపాడు గ్రామంలో 1989 నుంచి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి తరచూ వర్గపోరుకు దిగేవారు. ఈ గొడవల్లో ఆరుగురు హత్యకు గురయ్యారు. నిత్యం దాడులు, ప్రతి దాడులతో గ్రామం అట్టుడికిపోతుండేది. 2014లో పొలానికి నీళ్లు పెట్టుకునే విషయంలో తలెత్తిన వివాదం పార్టీల రంగులు పులుముకొని ప్రత్యర్థి వర్గంలో గోపాల్‌ అనే వ్యక్తిని హత్య చేశారు. నా భర్త గోవిందరెడ్డిపై కేసు నమోదవడంతో ఇల్లు, పొలాలు, వ్యాపారాలు వదిలేసి కోర్టుల చుట్టూ తిరుగుతుండేవారు. 2014 ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో సెప్టెంబర్‌ నెలలో ప్రత్యర్థి వర్గీయులు నా భర్తను హత్య చేశారు. ప్రత్యర్థి హత్య విషయంలో ఉన్నత విద్యావంతుడైన నా కుమారుడు వెంకటరెడ్డి పేరు కూడా పెట్టడంతో అతనికి ఉద్యోగం దూరమైంది.  ఒక పక్క కేసులు, మరో పక్క భర్త చనిపోయి ఇంటికి పెద్ద దిక్కు లేక చాలా ఇబ్బందులు పడ్డాం. ఉన్న పొలాన్ని కౌలుకు ఇచ్చి ఆ డబ్బులతో బతకడానికి, పెళ్లీడుకొచ్చిన కూతురి పెళ్లి చేసేందుకు అష్టకష్టాలు పడ్డాం. నా భర్త హత్యతో పదేళ్లపాటు నరకయాతన అనుభవించాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని