Gopichand Thotakura: అంతరిక్ష యాత్రికుడు బెజవాడ బిడ్డే

భారతదేశ తొలి స్పేస్‌ టూరిస్టు గోపీచంద్‌ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్‌ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్‌-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.

Updated : 21 May 2024 07:23 IST

దేశంలోనే తొలి స్పేస్‌ టూరిస్టుగా రికార్డు
గతంలో కిలిమంజారో పర్వత అధిరోహణ
విజయవాడతో విడదీయలేని బంధం

అంతరిక్షం నుంచి దిగ్విజయంగా తిరిగి వచ్చిన సందర్భంగా తల్లిదండ్రులతో గోపీచంద్‌ 

ఈనాడు, అమరావతి: భారతదేశ తొలి స్పేస్‌ టూరిస్టు గోపీచంద్‌ తోటకూరకు విజయవాడతో విడదీయలేని బంధం ఉంది. అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్‌ సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్‌-25 వ్యోమనౌకలో ఆయన ఇటీవల అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. మూడు పదుల వయసు దాటకముందే భారతీయ విమానాలు, విదేశీ జెట్‌లు, వైద్య విమానాలను వేల గంటలు నడిపిన ఘనతను ఆయన సాధించారు. విమానాలే కాకుండా సీప్లేన్, హాట్‌ఎయిర్‌ బెలూన్‌ పైలట్‌గా గోపీచంద్‌కు గుర్తింపు ఉంది. పర్వతారోహకుడిగా దక్షిణాఫ్రికాలోని కిలిమంజారోను అధిరోహించారు. నగర శివారు పోరంకిలోని వందడుగుల రోడ్డులో ఆయన తాత, నానమ్మలు భూమయ్య, స్వర్ణలత నివసిస్తున్నారు. తండ్రి విజయకుమార్, తల్లి పద్మజలకు గోపీచంద్‌తోపాటు మరో అబ్బాయి మేఘశ్యామ్‌ ఉన్నారు. 1993లో పుట్టిన గోపీచంద్‌ విశాఖలోని టింఫనీ, దిల్లీలోని సంస్కృతి, బాలభారతి ఎయిర్‌ఫోర్స్‌ పాఠశాలలు, హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతిలో చదువుకున్నారు.

బెంగళూరులోని సరళాబిర్లా కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న ఉత్తమ విద్యాసంస్థ ఎంబ్రీరిడిల్‌ ఏరోనాటికల్‌ విశ్వవిద్యాలయంలో ఏరోనాటికల్‌ సైన్స్‌లో డిగ్రీ చేశారు. అక్కడే కమర్షియల్‌ పైలట్‌గా శిక్షణ తీసుకుని లైసెన్సు పొందారు. ఆ తర్వాత యూకేలోని ఎమిరేట్స్, కొవెంట్రీ విశ్వవిద్యాలయాలలో ఏవియేషన్‌లో ఎంబీఏ చేశారు. బిజినెస్‌ జెట్స్, మెడికల్‌ ఫ్లెట్స్‌ను దేశ విదేశాల్లో నడిపారు. ప్రస్తుతం అమెరికా కేంద్రంగా ప్రిజర్వ్‌ లైఫ్‌ కార్పొరేషన్‌ పేరుతో అన్ని సౌకర్యాలతో కూడిన వెల్‌నెస్‌ రిసార్టును నిర్వహిస్తున్నారు. తమ మనవడు అంతరిక్షంలోకి వెళ్లి దిగ్విజయంగా తిరిగి రావడం గర్వకారణంగా, ఆనందంగా ఉందని భూమయ్య, స్వర్ణలతలు అన్నారు. చిన్నతనం నుంచి చురుకుగా ఉండేవాడని, అందరికంటే ప్రత్యేకంగా ఉండేందుకు ప్రయత్నించేవాడని .గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని