Andhra Pradesh: నగరాలకు ముంపు ముప్పు

కాకినాడలో శుక్రవారం కురిసిన వర్షానికి డ్రెయిన్లు పొంగిపొర్లాయి. కాలనీలు నీటమునిగాయి. నగరపాలక సంస్థ పరిధిలో పూడికతీత పనులు చేయకపోవడంతో ముంపు సమస్య మరింత తీవ్రమైంది.

Published : 25 May 2024 06:09 IST

చినుకు పడితే ప్రమాదమే
కాలవల్లో పూడిక తొలగింపులో ఉదాసీనత
వర్షాకాలం సమీపిస్తున్నా మేల్కోని యంత్రాంగం
ఈనాడు - అమరావతి

విజయవాడలో అసంపూర్తిగా నిలిచిపోయిన వరదనీటి కాలవ పనులు

ఈ నెల ఏడో తేదీన కురిసిన కొద్దిపాటి వర్షానికే రాజమహేంద్రవరం నగరం అతలాకుతలమైంది. అప్పటికే మురుగు కాలవలు పూడికతో నిండిపోవడంతో వాన నీటికి తోడు మురుగునీరు కలిసి రోడ్లపై పొంగి పొర్లింది. నగరవాసులు నరకయాతన పడ్డారు. ఇంత జరిగినా ఇప్పటికీ కాలవల్లో పూడికలు తొలగింపునకు నగరపాలక సంస్థ తీసుకుంటున్న చర్యలు అంతంత మాత్రమే. ఒక్క రాజమహేంద్రవరంలోనే కాదు రాష్ట్రంలోని చాలా నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.  

నగరాలలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థతో ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలవల ద్వారా నీరు వెళ్లే మార్గం లేక రోడ్లపైకి వస్తోంది. పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు చేరి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. సమస్యకు కారణమైన డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఐదేళ్ల వైకాపా ప్రభుత్వంలో చేసిన ప్రయత్నమేమీ లేదు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన వరద, మురుగునీటి కాలవల పనులూ పక్కన పెట్టారు. కనీసం ఏటా కాలవల్లో పూడికలు తొలగించే ప్రయత్నమైనా చేస్తున్నారా అంటే ఇప్పటివరకు అరకొర పనులతో నెట్టుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పనులే ప్రారంభించకపోవడం నగరపాలక సంస్థల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ.

విశాఖలో గెడ్డలతో గండమే 

విశాఖలో ముఖ్యమైన గెడ్డలు, కాలవల్లో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించకపోతే వర్షాకాలంలో అనేక లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గత ఏడాది తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా...పాత నగరంలోని చాలా ప్రాంతాలు ఆరు గంటలకుపైగా నీటి ముంపులోనే ఉన్నాయి. 

ఎర్రిగెడ్డ, ఎస్‌ఎల్‌ కెనాల్, గంగులగెడ్డలో టన్నుల కొద్దీ పేరుకుపోయిన వ్యర్థాలు ఈ ఏడాది ఇప్పటికీ తొలగించలేదు. మల్కాపురం గెడ్డ, ఏకలవ్యకాలనీకి ఆనుకుని ఉన్న గెడ్డ, కేఆర్‌ఎం కాలనీ, మద్దిపాలెం పరిసరాల్లోని వరద నీటి కాలవల్లోనూ వ్యర్థాలు పేరుకుపోయాయి.

కడపలో పొంచి ఉన్న ముప్పు రహదారుల విస్తరణలో భాగంగా కడపలో పడగొట్టిన మురుగు కాలవలను తిరిగి ఇప్పటికీ పూర్తిగా పునర్నిర్మించని కారణంగా ఈ ఏడాది వర్షాకాలంలో కడపవాసులకు ముంపు కష్టాలు తప్పేలాలేవు. విస్తరణలో భాగంగా దెబ్బతిన్న కాలవలు పూడిపోయాయి.. వర్షాలు కురిస్తే వ్యర్థాలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉంది. నగర పరిధిలో 23 ప్రాంతాల్లో వరద నీటి కాలవల నిర్మాణం కోసం గత ఏడాది రూ.73 కోట్లతో టెండర్లు ఖరారు చేసినా ఇప్పటివరకు మూడు ప్రాంతాల్లోనే పనులు ప్రారంభించారు. ఇవి కూడా నత్తనడకన సాగడంతో మురుగు నీరు ముందుకు సాగక ప్రజలు అవస్థలు పడుతున్నారు. మిగిలిన 20 కాలవల నిర్మాణ పనుల ఊసెత్తడం లేదు.

కడప కోటిరెడ్డి కూడలిలో నత్తనడకన వరదనీటి కాలవ పనులు

విజయవాడలో పనులు టెండర్లకే పరిమితం

విజయవాడలో మురుగు కాలవల్లో పూడిక తొలగింపు పనులు టెండర్లకే పరిమితమయ్యాయి. నగర పరిధిలో 133 కిలోమీటర్ల పొడవునా కాలవలు ఉన్నాయి. వీటిలో ఏటా ఈ పాటికే 70 శాతానికిపైగా పనులు పూర్తయ్యేవి. ఈసారి టెండర్లు పిలిచి ఎన్నికల కోడ్‌ పేరుతో పక్కన పెట్టారు. గట్టిగా వర్షం కురిసినప్పుడల్లా నగరంలోని అత్యధిక ప్రాంతాలు ఏరులవుతున్నాయి. బెంజిసర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ సర్కిల్, దుర్గా థియేటర్‌ వరకు రోడ్లకు ఇరువైపులా భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. నిర్మలాకాన్వెంట్, మొగల్రాజుపురం, ఏపీఐఐసీ కాలనీతోపాటు సింగ్‌నగర్‌ చుట్టుపక్కల అనేక ప్రాంతాలు నీటి ముంపునకు గురవుతున్నాయి. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వరద నీటిపారుదల కాలవల పనులను వైకాపా ప్రభుత్వం అసంపూర్తిగా నిలిపివేయడంవల్ల వర్షాకాలం వచ్చిందంటే నగర ప్రజల అవస్థలు వర్ణనాతీతం.

రాజమహేంద్రవరంలో నల్లా ఛానల్‌లో పేరుకున్న వ్యర్థాలు

రాజమహేంద్రవరం అధికారుల మొద్దునిద్ర

రాజమహేంద్రవరంలో 630 కిలో మీటర్ల విస్తీర్ణంలోని కాలవల్లో పూడికల తొలగింపు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. మురుగు నీటిని గోదావరిలోకి పంపే నల్లా, ఆవ ఛానళ్లతోపాటు ప్రధాన కాలవలను శుభ్రం చేసేందుకు ఏటా వర్షాకాలం ముందు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వెచ్చిస్తారు. ఈసారి అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నల్లా ఛానల్‌లో కలిసే అనుసంధాన కాలవల్లో పూడికను తొలగించకపోతే నగరంలోని ఆర్యాపురం, తుమ్మలావ, కృష్ణానగర్, ఆదెమ్మదిబ్బ, సీతంపేటకు వెళ్లే రహదారులు ముంపు బారిన పడతాయి. ఎగువ బాలాచెరువు నుంచి దిగువ వై-జంక్షన్‌ వరకూ వచ్చే కాలవల్లో పూడికను తీయకపోతే హైటెక్‌ బస్టాండ్, కంబాలచెరువు, సుబ్బారావునగర్‌ ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోతుంది. 

నెల్లూరులో పూడికలతో నిండిన కాలవ

నెల్లూరులో అదే నిర్లక్ష్యం 

నెల్లూరులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నా అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. పూడిక తొలగించకపోవడం, ఆక్రమణలు క్రమంగా పెరిగిపోవడంతో కొద్దిపాటి వర్షానికి నగరం జలమయమవుతోంది. ప్రతి ఏటా ఇదో పెద్ద సమస్యగా తయారవుతున్నా యంత్రాంగం ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు పూడికల పనులు ప్రారంభం కాలేదు. ప్రత్యేకించి నగరంలోని పంట కాలవల్లో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగిస్తే ముంపు సమస్య చాలావరకు పరిష్కారమవుతుంది. ఇటు నగరపాలక సంస్థ, అటు జలవనరులశాఖ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో వర్షాకాలంలో ఏటా మనసునగర్, కుదుస్‌నగర్, పరమేశ్వర్‌నగర్, మనుమసిద్ధినగర్‌ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. కొన్ని చోట్ల ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు.

కాకినాడలో శుక్రవారం కురిసిన వర్షానికి జలమయమైన వైఎస్‌ఆర్‌ కూడలి


కాకినాడలో పొంగిపొర్లిన డ్రెయిన్లు

శుక్రవారం కాకినాడ ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలోకి చేరిన వర్షపు నీరు

కాకినాడలో శుక్రవారం కురిసిన వర్షానికి డ్రెయిన్లు పొంగిపొర్లాయి. కాలనీలు నీటమునిగాయి. నగరపాలక సంస్థ పరిధిలో పూడికతీత పనులు చేయకపోవడంతో ముంపు సమస్య మరింత తీవ్రమైంది. బాలాజీచెరువు, భానుగుడి కూడలి, రామకృష్ణారావుపేట, సూర్యారావుపేట, కొత్తపేట, పిండాలచెరువు, నూకాలమ్మగుడి, మొయిన్‌రోడ్డు, సినిమారోడ్డు తదితర ప్రాంతాల్లోకి నీరు చేరింది. వర్షాకాలం రాక ముందే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందోనని స్థానికులు భయపడుతున్నారు.

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌


గుంటూరులో నిలువెల్లా నిర్లక్ష్యం

గుంటూరులో బ్రాడీపేట పీకలవాగు మురుగు కాలవలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు

వర్షం కురిస్తేచాలు గుంటూరులోని పల్లపు ప్రాంతాలు జలమయం కావడం, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడం సర్వసాధారణమవుతోంది. ఉద్ధృతంగా ప్రవహించే కాలవల్లో చిన్నారులు కొట్టుకుపోతుంటారు. వర్షాకాలం సమీపిస్తున్నా నగరపాలక సంస్థ ఇప్పటికీ కాలవల్లో పూడికలు తొలగించే పనులు ప్రారంభించలేదు. కొద్దిపాటి వర్షానికే నగరంలోని అనేక రహదారులు జలమయమవుతుంటాయి. కాలవల్లోని చెత్తాచెదారం రోడ్లపైకి వస్తుంటుంది. వాగులు, కాలవల వెంట ఉన్న ఆక్రమణలు తొలగించి వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా చూడాలని పట్టణ ప్రణాళిక విభాగానికి ఈనెల 15న ఆస్తి పన్ను చెల్లింపుదారుల సంఘం లేఖ రాసినా స్పందన లేదు. గత ఏడాది కూడా సరైన ముందస్తు చర్యలు తీసుకోని కారణంగా ముంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నగరంలో దాదాపు 25 ప్రాంతాలు వర్షాకాలంలో ముంపునకు గురవుతున్నాయి. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవలసిన నగరపాలక సంస్థ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని