Diabetes: దేశ ఉత్పాదకతపై మధుమేహం ప్రభావం

ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారని.. దీని ప్రభావం దేశ ఉత్పాదకతపై పడుతోందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు.

Updated : 27 May 2024 06:12 IST

బాధిత కుటుంబాలపై పెరుగుతున్న ఆర్థిక భారం 
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ

హైదరాబాద్‌లో జరిగిన డయాబెటిస్‌ ఎక్స్‌పో-2024లో ప్రముఖ వైద్యుడు బినోద్‌కుమార్‌ సహాయ్‌కు జీవిత సాఫల్య పురస్కారం అందజేస్తున్న సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌  ఎన్‌.వి.రమణ, చిత్రంలో డాక్టర్‌ మోహన్, డాక్టర్‌ ఆర్‌ఎం అంజన, డాక్టర్‌ రంజిత్‌ ఉన్నికృష్ణన్, రెడ్డి ల్యాబ్స్‌ ఛైర్మన్‌ కె.సతీష్‌రెడ్డి, ఏఐజీ ఆసుపత్రి ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి 

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు మధుమేహం బారిన పడుతున్నారని.. దీని ప్రభావం దేశ ఉత్పాదకతపై పడుతోందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. ఆయా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడటంతో పాటు బాధితుల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. డాక్టర్‌ మోహన్స్‌ డయాబెటిస్‌ సెంటర్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించిన ‘డాక్టర్‌ మోహన్స్‌ డయాబెటిస్‌ ఎక్స్‌పో-2024’ ప్రారంభోత్సవ సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో 18 సంవత్సరాలు పైబడిన వారిలో 8 శాతం మంది మధుమేహం బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. మధుమేహ బాధితులు చికిత్సకు నగరాల్లో నెలకు రూ.10 వేలు, గ్రామాల్లో రూ.6 వేలు-రూ.8 వేల మధ్య వెచ్చిస్తున్నారన్నారు. డాక్టర్‌ మోహన్‌ తన తండ్రి నుంచి వారసత్వంగా మధుమేహ బాధితులకు సేవలందిస్తుండటం అభినందనీయమన్నారు. ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రుల ఛైర్మన్‌ డా.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో దాదాపు 25 శాతం మంది, దేశంలో 15 నుంచి 20 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని వివరించారు. డయాబెటిస్‌ నివారణ మార్గాలు, అందుబాటులో ఉన్న మందులు, వాటిని ఉపయోగించే విధానం తెలియజేస్తూ ఎక్స్‌పోలో స్టాళ్లు ఏర్పాటు చేశారన్నారు. డాక్టర్‌ మోహన్స్‌ డయాబెటిస్‌ స్పెషాలిటీస్‌ సెంటర్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ వి.మోహన్‌ మాట్లాడుతూ.. మధుమేహం బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ‘డయాబెటిస్‌ ఎక్స్‌పో -2024’ను ఏర్పాటు చేశామన్నారు. సీనియర్‌ డయాబెటాలజిస్ట్, హెచ్‌సీయూ వైద్యకళాశాల విశ్రాంత ప్రొఫెసర్‌ బినోద్‌కుమార్‌ సహాయ్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. వివిధ విభాగాల ప్రముఖ వైద్యులు, మధుమేహ బాధితులను లెజెండ్స్‌ ఆఫ్‌ హైదరాబాద్, డయాబెటిస్‌ వారియర్స్‌ అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ మోహన్స్‌ డయాబెటిస్‌ స్పెషాలిటీస్‌ సెంటర్‌ ఎండీ ఆర్‌.ఎం.అంజన, వైస్‌ ఛైర్మన్‌ రంజిత్‌ ఉన్నికృష్ణన్, రెడ్డి ల్యాబ్స్‌ ఛైర్మన్‌ కె.సతీష్‌రెడ్డి, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యులు, మధుమేహ బాధితులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని