Dharmana Prasada Rao: ఇది ధర్మాన గారి దోపిడీ

ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో అధికారం చలాయించి విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో  రూ.వందల కోట్ల విలువైన 71.29 ఎకరాలను హస్తగతం చేసుకున్నారని...

Updated : 15 Oct 2022 09:21 IST

మాజీ సైనికుల పేరుతో విశాఖ శివార్లలో కేటాయించిన 71.29 ఎకరాలు హస్తగతం

2005-11 మధ్య మంత్రి కుటుంబీకులు, స్నేహితుల పేరున రిజిస్ట్రేషన్‌

ఇందుకోసం దొడ్డిదారిన నిరభ్యంతర పత్రాల జారీ

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడే ధర్మాన ప్రసాదరావు అక్రమాలు

ఆయన పాత్రపై మరింత లోతైన దర్యాప్తునకు సిట్‌ సిఫార్సు

ఐఏఎస్‌ అధికారులు లవ్‌ అగర్వాల్‌, శ్యామలరావులనూ తప్పుబట్టిన దర్యాప్తు బృందం

పలువురు ఐఏఎస్‌లు, రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ల పాత్రపై అభియోగాలు

‘ఈనాడు’ చేతికి సిట్‌ నివేదిక

ఈనాడు - అమరావతి

* ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో అధికారం చలాయించి విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో  రూ.వందల కోట్ల విలువైన 71.29 ఎకరాలను హస్తగతం చేసుకున్నారని.. విశాఖ భూ కుంభకోణాలపై గత ప్రభుత్వ హయాంలో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చిచెప్పింది.

* మాజీ సైనికోద్యోగుల పేరుతో ప్రభుత్వం ఇచ్చిన డీ ఫాం పట్టా భూములు అమ్ముకునేందుకు వీలుగా ధర్మాన వారికి నిరభ్యంతర పత్రాలు జారీ చేయించారు. ఆనక ఆ భూములన్నీ ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, వారి కంపెనీల పేరున రిజిస్టర్‌ చేయించేశారు. ఈ భూ కుంభకోణాల్లో ధర్మాన ప్రసాదరావే సూత్రధారి, పాత్రధారి అని తేల్చిన ఆ నివేదిక తాజాగా ‘ఈనాడు’కు అందింది.

* ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఈ అనుమతులు వచ్చాయని.. సామాన్యులకు ఇలా ఎన్వోసీలు దక్కే ఆస్కారమే లేదని కూడా సిట్‌ తేల్చి చెప్పింది.

* ఈ కుంభకోణంలో భాగంగా అధికారులు రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారనీ స్పష్టం చేసింది.

* మాజీ సైనికోద్యోగులుగా భూములు విక్రయించిన కొందరు ఎక్కడున్నారో కూడా సిట్‌ గుర్తించలేకపోయింది.

అన్నన్నా.. ధర్మానా? మీ ప్రేమంతా విశాఖ పైనా? లేక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ మంత్రిగా చేతివాటం ప్రదర్శించి విశాఖలో సొంతం చేసుకున్న ఆస్తులపైనా? అమరావతి పరిరక్షణకు పాదయాత్ర చేస్తున్న రైతులపై ఇటీవల కాలంలో మీ చిందులు, శివాలు చూసి.. విశాఖను రాజధాని చేయడం కోసం రాజీనామాకైనా సిద్ధమన్న మీ మాటలు విని... మిమ్మల్నేదో ఉత్తరాంధ్ర ఉద్యమకారుడని ప్రజలంతా భావించారు. ఆసలు కిటుకు విశాఖలో మీ భార్య, కుమారుడు, సోదరుడు, సన్నిహితుల పేరుతో మీరు కొట్టేసిన భూముల్లో ఉందని ‘సిట్‌’ నివేదిక బయటికొస్తే గానీ తెలియలేదు! ఉత్తరాంధ్ర వెనుకబాటు గురించి ఏం ఉపన్యాసాలు చెబుతున్నారు ధర్మానగారూ! మీలాంటి వాళ్లను చూశాకే తెలుస్తోంది.. వెనుకబడింది ఉత్తరాంధ్రేగానీ, మీలాంటి నాయకులు కాదని! విశ్రాంత సైనికోద్యోగుల కోసం విశాఖలో కేటాయించిన భూముల్ని అధికారం చలాయించి.. అధికారుల్ని అదిరించి... రికార్డులు మార్పించి... ఎంత సులువుగా కొట్టేశారు! ఎంతైనా సీనియారిటీ సీనియారిటీనే!

మీది ఎంత ముందుచూపు? 15 ఏళ్ల క్రితమే విశాఖలో విలువైన భూముల్ని మీ స్వాధీనం చేసేసుకున్నారు. మీరు మనిషి ఎంత గుంభనమో.. అంతే గుంభనంగా విశాఖలో 70 ఎకరాలకు పైగా అత్యంత విలువైన భూముల్ని చాప చుట్టేసి మీ ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఒకందుకు మెచ్చుకోవాల్సిందే! అక్రమార్జనలోనూ మీ పేరులో ఉన్న ‘ధర్మాన్ని’ తప్పలేదు! మీ భార్య, కుమారుడితో పాటు మీ సోదరుడికి, మిమ్మల్ని నమ్ముకుని మీ వెంటే ఉన్న మిత్రులకు, సన్నిహితులకు ధర్మంగా వాటాలు పంచిపెట్టారు! వాళ్లను ముందు పెట్టి, రూ.కోట్ల విలువైన భూముల్ని స్వాహా చేసేశారు. ఆ భూముల విలువ ఇప్పుడే రూ.వందల కోట్లు. విశాఖే రాజధాని అయితే వాటి విలువ ఒక్కసారిగా రెండు, మూడు రెట్లు పెరిగిపోదూ! అందుకేనా ఎన్నికల ముందు ఓట్ల కోసం అమరావతే రాజధానన్న మీరు... ఇపుడు మడమ తిప్పి, ధర్మం తప్పి.. రైతులపై విషం చిమ్ముతున్నారు?

‘అతను పెట్టినవి 67 కంపెనీలు ఉన్నాయి. వాటిని నడపడానికి నాకు ముఖ్యమంత్రి ఉద్యోగం కావాలంటున్నాడు. ఎటెళ్లిపోతున్నాం మనం. నీ ఆలోచనేంటి అసలు? ఎవరికైనా ఇల్లు సరదా ఉంటే నాలుగు బెడ్‌ రూంలు... బంధువులు ఎక్కువ ఉంటారంటే... అది కూడా ఎవరికైనా పిచ్చయితే పది బెడ్‌రూమ్‌ల ఇల్లు కడతాడు. అలాంటిది 60 బెడ్‌రూమ్‌ల ఇల్లు కట్టే క్యారెక్టర్‌ ఒకటి 2010లో ఉందంటే.. మొఘలుల కాలం నాటి భూస్వామ్య భావజాలం అతనిలో స్పష్టంగా కనిపించడం లేదూ. అలాంటి వాళ్లకు బీదవాళ్ల గురించి ఆలోచించే సమయం, ఆ దృష్టి ఉంటాయా?’ అని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు జగన్‌ను తిట్టిపోసిన మీరు.. ఇప్పుడు అదే స్థాయిలో ఆయనపై పొగడ్తలు కురిపిస్తున్నారు. ఎంతయినా మీ లౌక్యం ఎవరికి సాధ్యం ధర్మానా?


విశాఖ నగరాన్ని రాజధాని చేయాలంటూ ధర్మాన ఇటీవల ఉద్వేగంగా మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర వేదికపై ఉద్రిక్త ప్రసంగాలు చేస్తున్నారు. ఇది ఉత్తరాంధ్రపై ప్రేమా? అప్పనంగా, అక్రమంగా చేజిక్కించుకున్న భూముల ద్వారా విశాఖ రాజధాని మాటున రూ.వందల కోట్ల ప్రయోజనం దక్కించుకునే ఉత్సాహమా? అమరావతిలో భూములు కొని రాజధాని ఏర్పాటు చేసుకున్నారంటూ పదే పదే విమర్శలు గుప్పించే ధర్మానా.. ఇది ఏం ధర్మం? మూడు రాజధానులంటూ ముచ్చటపడుతున్న మీ మాటల్లో ఇదేనా అసలు మర్మం?


రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెవెన్యూ, స్టాంపులు- రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు.. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనూ అవే బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలో రెవెన్యూ యంత్రాంగంపై అధికారం చలాయించి విశాఖ నగర శివార్లలో రూ.వందల కోట్ల విలువైన భూములను హస్తగతం చేసుకున్నారు. మాజీ సైనికోద్యోగుల పేరుతో ప్రభుత్వం విశాఖ చుట్టుపక్కల ఇచ్చిన డీ ఫాం పట్టా భూములు అమ్ముకునేందుకు వీలుగా ధర్మాన వారికి నిరభ్యంతర పత్రాలు జారీ చేయించారు. ఆనక ఆ భూములన్నీ ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, వారి కంపెనీల పేరున రిజిస్టర్‌ చేయించేశారు. విశాఖ గ్రామీణ, పరవాడ, మధురవాడ మండలాల్లో ఏకంగా 71.29 ఎకరాలను ధర్మాన ఇలా సొంతం చేసుకున్నారని.. విశాఖ భూ కుంభకోణాలపై గత ప్రభుత్వ హయాంలో నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తేల్చిచెప్పింది. ఈ భూ కుంభకోణాల్లో ధర్మాన ప్రసాదరావే సూత్రధారి, పాత్రధారి అని తేల్చిన ఆ నివేదిక తాజాగా ‘ఈనాడు’కు అందింది. ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఈ అనుమతులు వచ్చాయని.. సామాన్యులకు ఇలా ఎన్వోసీలు దక్కే ఆస్కారమే లేదని కూడా సిట్‌ తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ధర్మాన పాత్రపై మరింత లోతైన దర్యాప్తు జరగాలని సిఫార్సు చేసింది. ఈ కుంభకోణంలో భాగంగా అధికారులు రెవెన్యూ రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారని స్పష్టం చేసింది. కొన్ని కేసుల్లో డీ ఫాం భూముల కేటాయింపు తీరూ ప్రశ్నార్థకమైంది. నిజంగా వారు మాజీ సైనికోద్యోగులా? కాదా? అసలు ఎప్పుడు వారికి ఆ భూములు కేటాయించారు వంటి విషయాల్లో తలెత్తిన సందేహాలకూ సమాధానాలు దొరకలేదు. మాజీ సైనికోద్యోగులుగా భూములు విక్రయించిన కొందరు ఎక్కడున్నారో కూడా సిట్‌ గుర్తించలేకపోయింది.

ఏమిటీ విశాఖ భూ కుంభకోణం?
విశాఖ రూరల్‌ మండలం అటవీ, రెవెన్యూ భూముల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్‌ చేశారని 2017 మే నెలలో వెలుగులోకి వచ్చింది. లోతుగా పరిశీలించగా 2015లోనే అప్పటి విశాఖ తహసీల్దార్‌ సుధాకర్‌నాయుడు జిల్లా కలెక్టర్‌కు భూ అక్రమాలపై ఒక నివేదిక సమర్పించినట్లు తేలింది. 2015కు ముందు వివిధ రెవెన్యూ కార్యాలయాల పరిధిలో చోటుచేసుకున్న అక్రమాలు, రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌పై కొందరు అధికారులు ఉన్నతాధికారులకు ముందే తెలియజేసిన ఉదంతాలూ బయటపడ్డాయి. వీటన్నింటి నేపథ్యంలో 2017 జూన్‌ 20న ప్రభుత్వం.. అప్పటి గ్రేహౌండ్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ ఆధ్వర్యంలో విశాఖ సంయుక్త కలెక్టర్‌ జి.సృజన, డిప్యూటీ కలెక్టర్‌ లంకా విజయసారథి సభ్యులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌ విస్తృత దర్యాప్తు చేసి విశాఖ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని రూ.వందల కోట్ల విలువైన భూములకు సంబంధించి చోటుచేసుకున్న అక్రమాలను వెలికితీసి, అప్పటి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నేటికీ వెలుగు చూడని ఆ నివేదిక తాజాగా ‘ఈనాడు’ చేతికి చిక్కింది. అప్పటి, ఇప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్రను ఆ నివేదికలో సిట్‌ కీలకంగా ప్రస్తావించింది. ఈ నివేదిక రాజకీయ ప్రేరేపితం అనుకోవడానికీ లేదని, అదే ఉద్దేశమైతే తెదేపా ప్రభుత్వ హయాంలోనే ధర్మానపై చర్యలు తీసుకుని ఉండేవారనే అభిప్రాయం వినిపిస్తోంది.

వెలుగు చూడని నివేదికలు
సిట్‌ అప్పటి ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక వెలుగుచూడలేదు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ అదే అంశంపై ఇద్దరు విశ్రాంత ఐఏఎస్‌ అధికారులతో దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది, వారు విచారణ చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికనూ ప్రభుత్వం ఇంకా బయటపెట్టకపోవడం గమనార్హం.

అర్హత లేనివారికీ కట్టబెట్టేశారు
మాజీ సైనికులు, రాజకీయ బాధితుల పేరుతో పట్టాలు సృష్టించి రికార్డులు తారుమారు చేసి, నిరభ్యంతర పత్రాలు పొంది ఆ భూములను మంత్రి ధర్మాన కుటుంబసభ్యులు, ఆయన సన్నిహితుల పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. కొన్ని కేసుల్లో డీ ఫాం భూములు పొందినవారు మాజీ సైనికోద్యోగులు, అధికారులే అయినా వారికి ఆ రూపేణా భూమి పొందే అర్హత లేదనీ విచారణలో వెలుగు చేసింది. వారి నుంచి భూములు చేతులు మారి, మంత్రి కుటుంబీకులకు చేరినా అసలు వ్యక్తులు ఎక్కడున్నారో కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం కనుక్కోలేకపోయింది. ఈ భూముల దందాలో రికార్డులు మార్చడం ఒక ఎత్తు అయితే.. కొన్ని కేసుల్లో అసలు వాటికి సంబంధించిన రికార్డులు కూడా కనుక్కోలేకపోయారు. కొన్ని భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్‌కు అనుమతులు లభించిన సమయంలో ధర్మాన ప్రసాదరావే రెవెన్యూ మంత్రిగా ఉన్నారనీ సిట్‌ నివేదికలో పేర్కొంది. ఈ భూములను పొందిన పేదలు లేదా మాజీ సైనికోద్యోగులు వాటిని అమ్ముకోవాలన్నా, వారి నుంచి ఎవరైనా కొనాలన్నా జిల్లా కలెక్టర్‌ నిరభ్యంతర పత్రాలు జారీ చేయాలి. సరైన తనిఖీలు, పరిశీలన లేకుండానే అప్పటి విశాఖ జిల్లా అధికారులు ఈ భూముల క్రయవిక్రయాలకు ఎన్వోసీలు ఇచ్చేశారని, ధర్మాన రెవెన్యూ మంత్రిగా ఉండటం వల్లే ఇదంతా జరిగిందని సిట్‌ తేల్చింది. ఈ వ్యవహారంలో అప్పటి కలెక్టర్లు లవ్‌ అగర్వాల్‌, జె.శ్యామలరావులతో పాటు సంయుక్త కలెక్టర్ల పాత్రనూ తప్పుపట్టింది.  


అడుగడుగునా ఉల్లంఘనలే..

* మాజీ సైనికోద్యోగుల పేరుతో పొందిన డీ ఫాం పట్టా భూములు అమ్ముకునేందుకు నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) జారీ చేయాలని స్వయంగా మంత్రి ధర్మాన జిల్లా కలెక్టర్లకు సిఫార్సులు చేశారని సిట్‌ నివేదిక తేల్చింది. డీ ఫాం పట్టాలు పొందిన తర్వాత పదేళ్లకు ఆ భూములు అమ్ముకోవచ్చనే జీవో నంబరు 1117 తేదీ 11.11.1993 ఆధారంగా ఆయన సిఫార్సులు చేశారు.

* ఎసైన్డ్‌ భూములు అక్రమంగా అమ్మకాలు జరిగే సమయానికే విశాఖ జిల్లాలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించారు. తప్పుడు డీ ఫాం పట్టాలు సృష్టించి, వాటి ఆధారంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేస్తున్నారని ప్రభుత్వ దృష్టికి రావడంతో డీ ఫాం పట్టా భూములను రిజిస్టర్‌ చేయవద్దని అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఎమ్మార్వో అనుమతులతో కాకుండా జిల్లా కలెక్టర్‌కు తెలియజేసి ఆయన స్వయంగా అనుమతిస్తే మాత్రమే ఎసైన్డు భూములు, డీ ఫాం భూములు రిజిస్ట్రేషన్‌ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నా, ఉల్లంఘించి మరీ భూములు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయని సిట్‌ తేల్చింది. కలెక్టర్ల నుంచి అనుమతులు రాకముందే కొందరు సబ్‌ రిజిస్ట్రార్లు ఆ భూములకు రిజిస్ట్రేషన్లు చేసేయడం గమనార్హం.

* విశాఖ జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడలో సర్వే నంబరు 437/1లో 5.14 ఎకరాల డీ ఫాం పట్టా భూమి అమ్ముకునేందుకు అప్పటి కలెక్టర్‌ జె.శ్యామలరావు అనుమతులు ఇవ్వడాన్ని సిట్‌ తప్పుపట్టింది. కేవలం ఈ భూములు మంత్రి బంధువులు కొంటుండటం వల్లే కలెక్టర్‌ అనుమతిచ్చారు తప్ప సాధారణ పరిస్థితుల్లో ఈ భూములు అమ్మేందుకు అనుమతులిచ్చే అవకాశమే లేదని స్పష్టంగా పేర్కొంది.

* విశాఖ గ్రామీణ మండలం మధురవాడలోని సర్వే నంబరు 355/4లోని 5 ఎకరాల డీ ఫాం భూమి అమ్మకాల వ్యవహారంలోనూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాత్ర ఉందని, దీనిపై లోతైన విచారణ జరపాలనీ సిట్‌ పేర్కొంది. 

* విశాఖ జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడకు చెందిన సత్యాడ అప్పారావు 3.95 ఎకరాల భూమిని అమ్ముకునేందుకు నిరభ్యంతర పత్రం జారీ చేయడంలోనూ అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఈ భూములను ధర్మాన రామదాస్‌, ఐ.బి.కుమార్‌ డైరెక్టర్లుగా ఉన్న కోరమాండల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరున కొన్నారు. ఈ భూముల అమ్ముకునేందుకు ఎసైనీకి కలెక్టర్‌ నిరభ్యంతర పత్రం జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఒక ఎసైనీ ఈ భూములు అమ్ముకునేందుకు ఎన్వోసీ తెచ్చుకోలేరని.. ధర్మాన ప్రసాదరావు జోక్యంతోనే అది సాధ్యమైందని సిట్‌ తేల్చింది. ఆ భూములు ఆఖరికి ధర్మాన కుటుంబానికే చేరాయని పేర్కొంది.

* ప్రస్తుత ఐఏఎస్‌ అధికారి, అప్పట్లో విశాఖ జిల్లా డీఆర్వోగా ఉన్న సత్యనారాయణ కొన్ని రోజులపాటు ఇన్‌ఛార్జి జాయింట్‌ కలెక్టర్‌గా వ్యవహరించిన సమయంలో ఏకంగా 28.72 ఎకరాలకు ఎన్వోసీలు జారీ చేసేశారు. కలెక్టర్‌ అనుమతితోనే ఎన్వోసీలు ఇవ్వాలి. ఇక్కడ జిల్లా కలెక్టర్‌కు తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండానే ఇన్‌ఛార్జి జేసీ హోదాలో సత్యనారాయణ నిరభ్యంతర పత్రాలు జారీ చేయడాన్ని సిట్‌ తీవ్రంగా తప్పు పట్టింది.


రిజిస్ట్రేషన్ల ఐజీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా!

విశాఖనగరం, జిల్లాలో నకిలీ డీ ఫాం పట్టాల ఆధారంగా భూముల బదలాయింపు జరుగుతోందని 2005 నవంబరులో అప్పటి రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌.. విశాఖపట్నం జిల్లా రిజిస్ట్రార్‌కు తెలియజేశారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి ఉంటే తప్ప డీ ఫాం భూములకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని మెమో (నంబరు జి3/ 16463/ 2005-1 తేదీ 29.11.2005) ద్వారా జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చారు. ‘మాజీ సైనికులకు ఇచ్చిన డీ పట్టా భూములను జీవో నంబరు 1117, తేదీ 11.11.93 ప్రకారం రిజిస్ట్రేషన్లు చేయొద్దు. సంబంధిత ఎమ్మార్వో నుంచి అనుమతి పొందితే తప్ప ఎసైన్డ్‌ భూములు రిజిస్టర్‌ చేయొద్దు’ అని అందులో ఆదేశించారు. తర్వాత 2006 అక్టోబరులో భూముల అక్రమాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై వార్తా కథనాలు రావడంతో ఆయన  2006 నవంబరు 13న మరో మెమో జారీ చేశారు. ఆ ప్రకారం ఎమ్మార్వో నుంచి వచ్చిన లేఖల సాయంతో ఎసైన్డు భూములను రిజిస్టర్‌ చేయవద్దని ఆదేశించారు. ఎమ్మార్వోలు ఏ సర్వే నంబరు ఎసైన్డ్‌ భూముల జాబితా నుంచి తొలగిస్తూ లేఖ ఇచ్చారో దానిపై జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసి, వారి అనుమతి పొందాకే రిజిస్టర్‌ చేయాలని ఆదేశించారు. ఈ కుంభకోణంలో అనేక కేసుల్లో సబ్‌ రిజిస్ట్రార్లు ఈ నిబంధనలు పాటించలేదు. కొన్ని సందర్భాల్లో నిరభ్యంతర పత్రం జారీ చేసే దస్త్రం నడుస్తుండగానే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసేయడం గమనార్హం. రెవెన్యూతో పాటు రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు పర్యవేక్షించే మంత్రి కూడా నాడు ధర్మాన ప్రసాదరావే కావడం గమనార్హం.


ధర్మానకు కొనుగోలుదారులతో సంబంధం ఏమిటంటే?

మాజీ సైనికోద్యోగులుగా పేర్కొంటూ కొందరు ప్రభుత్వం నుంచి విశాఖ రూరల్‌, పరవాడ మండలాల్లో పొందిన మొత్తం 71.29 ఎకరాల డీ ఫాం భూములను మంత్రి ధర్మాన ప్రసాదరావు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు చేజిక్కుంచుకున్నారని సిట్‌ తేల్చింది. ఇందుకోసం ధర్మాన హయాంలోనే 20 నిరభ్యంతర పత్రాలు జారీ అయ్యాయి. ఆయా భూ యజమానుల నుంచి ధర్మాన భార్య లక్ష్మి, కుమారుడు రామమనోహర్‌నాయుడు, సోదరుడు ధర్మాన రామదాస్‌లతో పాటు ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువుల పేరునే ఈ భూములన్నీ మారిపోయాయి.  


కొనుగోలుదారుల గురించి సిట్‌ తేల్చిన వివరాలివీ..

1) కోరమాండల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాపర్టీస్‌: ఈ కంపెనీలో మంత్రి ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన రామదాస్‌ డైరెక్టర్‌. మరో డైరెక్టర్‌ అయిన ఐబీ కుమార్‌ కూడా ధర్మానకు అత్యంత సన్నిహితుడు.

2) ఓంకాన్‌ రియల్టర్స్‌ అండ్‌ డెవలపర్స్‌: ఈ కంపెనీకీ ధర్మాన రామదాసే డైరెక్టర్‌. ఈ కంపెనీ పేరునా కొన్ని భూములు రిజిస్ట్రేషన్‌ జరిగాయి.

3) ధర్మాన రామదాస్‌: పై రెండు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉండటంతో పాటు కొన్ని భూములను నేరుగా రామదాస్‌ పేరునే కొన్నారు.

4) ధర్మాన రామమనోహర్‌ నాయుడు: ధర్మాన ప్రసాదరావు కుమారుడు. ఈయన పేరునా కొన్ని భూముల కొనుగోళ్లు జరిగాయి. కొన్ని సర్వే నంబర్లలో వేరే వారు కొన్నా చివరికి ఆ భూమి రామమనోహర్‌నాయుడు చేతికి చిక్కింది.

5) ధర్మాన లక్ష్మి: ధర్మాన ప్రసాదరావు భార్య. ఒక సర్వే నంబర్‌లో డీఫాం భూములు మొదట గుబ్బల గోపాలకృష్ణ చేతికి చిక్కాయి. ఆ తర్వాత అవి ధర్మాన లక్ష్మి పేరుతో రిజిస్టరయ్యాయి.

6) జి.ప్రసన్న: ధర్మానకు సన్నిహితుడైన ఐ.బి.కుమార్‌కు భార్య. ఈమె కూడా భూముల కొనుగోలుదారుల జాబితాలో ఉన్నారు.

7) గుబ్బల గోపాలకృష్ణ: కోరమాండల్‌ ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాపర్టీస్‌ లిమిటెడ్‌లో డైరెక్టర్‌. ఐడీ కుమార్‌కు కుమార్తెను ఇచ్చిన మామ.

8) ఎస్‌.రవికుమార్‌, అల్లు కేశవ వెంకట జోగినాయుడు, జాస్తి భాస్కరరావు, పి.నాగేంద్రప్రసాద్‌: వీరిలో కొందరు ధర్మానకు బంధువులు, మరికొందరు స్నేహితులు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని