Andhra News: నమ్మకం పోయాకే... ప్రాణం తీసుకోవాలనుకున్నా

‘ఎనిమిది సార్లు స్పందనలో అర్జీలు పెడితే ఎవరూ స్పందించలేదు. కాకినాడ కలెక్టరేట్‌లో విలేకరులు కనిపిస్తే గోడు చెప్పుకొన్నా.. అప్పుడు స్పందించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Updated : 04 Nov 2022 11:57 IST

ఏ సమస్యా సీఎం దాకా చేరడం లేదు
పరామర్శకు వచ్చిన అధికారులకు ఇదే చెప్పా
ఆసుపత్రిలో మంచంపై నుంచి కదల్లేక.. పాపకు సేవ చేయలేక తల్లడిల్లుతున్నా
‘ఈనాడు’తో ఆరుద్ర ఆవేదన

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, అన్నవరం: ‘ఎనిమిది సార్లు స్పందనలో అర్జీలు పెడితే ఎవరూ స్పందించలేదు. కాకినాడ కలెక్టరేట్‌లో విలేకరులు కనిపిస్తే గోడు చెప్పుకొన్నా.. అప్పుడు స్పందించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సీఎంకు బాధ చెప్పుకొంటే పరిష్కారం దొరుకుతుందనుకుని ఇంతదూరం వస్తే... ఆయనను కలిసే అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్డు పక్కన ఉన్నా.. ఆయన దృష్టిలో పడతామనుకుంటే.. అక్కడా నిల్చోనీయలేదు. పాపను పక్క వీధిలోకి తీసుకెళ్లిపోయారు. రోడ్డు మీద కూడా ఉండనీయకపోతే మేం ఎక్కడ చావాలి.. అందుకే నమ్మకం పోయింది. ఏ విషయమూ సీఎం దాకా వెళ్లడంలేదు. మధ్యలో వాళ్లే ఆపేస్తున్నారు. బిడ్డను తీసుకుని కోర్టుల చుట్టూ తిరిగే ఓపికలేదు. దానికంటే చచ్చిపోవడం మేలనిపించింది’ అని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర బుధవారం ఆత్మహత్యాయత్నం చేసిన రాజులపూడి ఆరుద్ర ఆవేదన వ్యక్తంచేశారు. టెథర్డ్‌ కార్డ్‌ సిండ్రోమ్‌తో బాధపడుతున్న కుమార్తె సాయిలక్ష్మి చంద్ర ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎవరిమీదా ఆధారపడలేదనీ.. ఉన్న ఆస్తులు అమ్ముకుందామనుకుంటే కొందరు అడ్డుతగులుతున్నారని ఆమె వాపోయారు. 2019లో వార్డు వెల్ఫేర్‌ డెవలప్‌మెంట్‌ సెక్రటరీ(గ్రేడ్‌-2) ఉద్యోగానికి కాల్‌లెటర్‌ వచ్చినా పాపను చూసుకోవడానికి ఎవరూ లేక ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పారు. విజయవాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె గురువారం ‘ఈనాడు’తో మాట్లాడారు. ముఖ్యమంత్రి పంపించారంటూ... ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు, పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా తనను పరామర్శించడానికి వచ్చారని వివరించారు. కానిస్టేబుల్స్‌ ఆటంకాలతో ఇంటి అమ్మకానికి ఎదురవుతున్న ఇబ్బందులు, అమలాపురంలో స్థల సమస్య, పాప ఆరోగ్య సమస్యలను వారికి వివరించినట్లు చెప్పారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని ఆరుద్ర వెల్లడించారు.

సమస్య చెప్పుకోవాలంటే ఇంత కష్టమా...

గత నెల 31న సీఎంను కలిసేందుకు విజయవాడ వచ్చామని.. పాపకు నీరసంగా ఉందని ఎం-లాడ్జిలో విశ్రాంతి తీసుకున్నామని ఆరుద్ర తెలిపారు. ఈ నెల 1న ఉదయం 8 గంటలకు తాడేపల్లిలో సీఎంను కలుద్దామని వెళ్తే... ఇక్కడ కుదరదని, విజయవాడలో ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారని అక్కడికి వెళ్లాలంటూ సిబ్బంది పంపేశారు. విజయవాడ వస్తే ఇక్కడ కుదరదు... తాడేపల్లిలోని ఇంటిదగ్గరకే వెళ్లండంటూ పంపేశారని చెప్పారు. అక్కడి నుంచి సీఎం ఇంటికెళితే సమయం అయిపోయిందంటూ వెనక్కి పంపేశారని వాపోయారు. ‘బుధవారం వెళ్లినా సీఎంను కలవడం కుదరదని స్పష్టం చేశారు. గ్రీవెన్స్‌లో అప్లికేషన్‌ ఇచ్చి వెళ్లిపోండి మేం పంపిస్తామన్నారు. వివరాలు చెబుతుంటే.. కానిస్టేబుల్‌ది సివిల్‌ కేసు.. పట్టించుకోరని.. మా ప్రయత్నం మేము చేస్తామని అక్కడివారు అన్నారు. నమ్మకం పోయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాను’ అని ఆరుద్ర వాపోయారు.

పాపను చూసుకోలేకపోతున్నా...

జీజీహెచ్‌లో పాపను చూసుకోవడానికి ఆయమ్మలు, స్టాఫ్‌ లేక ఇబ్బందిగా ఉందని ఆరుద్ర తెలిపారు. ‘చేయి కోసుకున్న నన్ను ఆసుపత్రిలో చేర్పించినప్పట్నుంచి పాప నాదగ్గరే ఉంది. పాపను కనీసం వాష్‌రూమ్‌కు తీసుకెళ్లడానికీ ఇబ్బంది పడుతున్నా’ అని ఆవేదన వ్యక్తం చేశారు. పాప సాయిలక్ష్మి చంద్రకు ఆసుపత్రి సిబ్బంది ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయించారని.. మూడు రోజుల్లో రిపోర్టు ఇస్తామన్నారని చెప్పారు. ఆరుద్ర ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సమయంలో కాకినాడ గ్రామీణంలోని రాయుడుపాలెంలో ఉన్న ఆమె భర్త భువనేశ్వర్‌ సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకుని విజయవాడ వెళ్లారు. ప్రస్తుతం భార్య, బిడ్డల దగ్గరే ఉన్నారు.

ఆరుద్ర వాంగ్మూలం నమోదు

తాడేపల్లి: ఆరుద్ర నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు గురువారం తాడేపల్లి పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేయలేదని చెప్పారు. వాంగ్మూలం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందని చెప్పారు.


బాధితురాలిని పరామర్శించిన సీఎం ప్రత్యేక కార్యదర్శి, కలెక్టర్‌

ఈనాడు, అమరావతి - విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: ఆరుద్రను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటాతో  కలిసి ఆయన గురువారం పరామర్శించారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు తాము వచ్చామని, ప్రభుత్వం అండగా ఉండి ఆమె సమస్యలను పరిష్కరిస్తుందని బాధితురాలికి హామీ ఇచ్చారు. ఆరుద్ర, ఆమె కుటుంబసభ్యులతో కలెక్టర్‌ మాట్లాడి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుని రాసుకున్నారు.

వైద్యం చేయించలేకపోతున్నాననే బాధతోనే..

ఆరుద్రను పరామర్శించిన అనంతరం కలెక్టర్‌ ఢిల్లీరావు మాట్లాడుతూ... కుమార్తెకు విదేశాలలో వైద్య చికిత్స అందించేందుకు తీసుకెళ్లలేకపోతున్నాననే ఆందోళన ఆరుద్రలో పెరిగిపోయిందని కలెక్టర్‌ వెల్లడించారు. అందుకే తన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. సీఎంను కలవలేకపోయాననే మనస్తాపం బాధితురాలిలో పెరిగిపోయిందని, అందుకే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నారని చెప్పారు. ఆరుద్ర ఎదుర్కొంటున్న సమస్యలను ఇప్పటికే సీఎంకు తెలిపామని, నివేదిక రూపంలోనూ అందిస్తామని వివరించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి శుక్రవారం మరోసారి ఆరుద్రను కలుస్తారని ఢిల్లీరావు వెల్లడించారు. ప్రస్తుతం ఆరుద్ర ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆమె చేతికి అయిన గాయానికి వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. ఆత్మహత్యాయత్నంపై ఆరుద్ర వాంగ్మూలం నమోదు చేసినట్లు గురువారం తాడేపల్లి పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయలేదని, వాంగ్మూలం వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని