ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మడతపేచీ
మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, చదువులను పరిగణనలోకి తీసుకుంటాం.
2014 జూన్ 2 కంటే ముందు 10ఏళ్ల సర్వీసు ఉండాలనే నిబంధన
10వేల మందినే తీసుకోవాలని కసరత్తు
ఎక్కువ మంది అనిచెప్పి.. తగ్గించేస్తున్నారు..
ఈనాడు-అమరావతి
మేం అధికారంలోకి రాగానే అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు, చదువులను పరిగణనలోకి తీసుకుంటాం. కాంట్రాక్టులో పని చేస్తున్న వారిలో వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇస్తున్నాం.
ఎన్నికల ముందు పలు సభల్లో ప్రతిపక్ష నేతగా జగన్
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసు ఆధారంగా వీలైనంతమందిని రెగ్యులరైజ్ చేస్తాం.
వైకాపా మేనిఫెస్టోలో హామీ
ఎన్నికలకు వెళ్లేప్పుడు ప్రతి రాజకీయ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తుంది. అందులోని ప్రతి మాటను నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకోలేకపోతే ఆ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి.
ప్రతిపక్ష నేతగా జగన్
రాష్ట్రంలో క్రమబద్ధీకరించాల్సిన ఒప్పంద ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలకు ముందు వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని సీఎం జగన్ హామీ ఇవ్వగా.. ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. అన్ని విభాగాల్లో కలిపి ఒప్పంద ఉద్యోగులు సుమారు 60వేల మంది వరకు పని చేస్తుండగా.. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న వారినే పరిగణనలోకి తీసుకుంటున్నారు. 10వేల మందినే క్రమబద్ధీకరించి, చేతులు దులిపేసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఇదే అమలు చేస్తే ఇప్పటి వరకు తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్ అవుతాయని భావించిన వేలమంది అవకాశాన్ని కోల్పోతారు. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇవ్వగా.. ఇప్పుడు 2014 జూన్ 2వ తేదీ కంటే ముందు 10ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుంటున్నారు. దీంతో విద్యాశాఖలో పని చేస్తున్న అధ్యాపకులు, లెక్చరర్లలో చాలా మందికి క్రమబద్ధీకరణ పరిధిలోకి రావడం లేదు. ప్రాజెక్టులు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పని చేస్తున్న వారి జాబితాను లెక్కలోకి తీసుకోవడం లేదు. అత్యధికంగా వైద్య, ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్‌లో కలిపి 19వేల మంది వరకు ఒప్పంద ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆ తర్వాత విద్యాశాఖలోనే అధికంగా ఉన్నారు.
మారిపోతున్న ఉద్యోగుల సంఖ్య..
ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం, దీనికి సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన వర్కింగ్ కమిటీ సమావేశాల్లో క్రమబద్ధీకరణకు అర్హత కలిగిన ఉద్యోగుల సంఖ్య తరచూ మారిపోతోంది. గత మే నెలలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారు 12,255మంది ఉన్నట్లు తేల్చారు. వీరిని క్రమబద్ధీకరిస్తే మొదటి ఏడాది రూ.431కోట్ల భారం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. వీరు కాకుండా విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, కార్పొరేషన్లు ఇతరత్రా విభాగాల్లో పని చేస్తున్న 18వేల మందిని క్రమబద్ధీకరిస్తే మొదటి ఏడాది రూ.632కోట్లు చెల్లించాలని లెక్కించారు. ఆ తర్వాత జూన్‌లో జరిగిన సమావేశంలో ఈ సంఖ్య 10,117కు తగ్గిపోయింది. 2014 జూన్ 2నాటికి పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని, అన్ని నిబంధనల ప్రకారం నియామకాలు పొందిన వారు 10,117మందే ఉన్నట్లు తేల్చారు. సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదైన డేటా ప్రకారం దీన్ని నిర్ధారించినట్లు వర్కింగ్ కమిటీ పేర్కొంది.
క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధించిన నిబంధనలు..
* ఆర్థిక శాఖ ద్వారా మంజూరైన పోస్టులో పని చేస్తూ ఉండాలి.
* నియామక సమయంలో రిజర్వేషన్ నిబంధనలు పాటించి ఉండాలి.
* ఉద్యోగి ఎంపికకు ప్రకటన ఇచ్చి ఉండాలి.
* 2014 జూన్ 2 నాటికి పదేళ్ల సర్వీసు పూర్తి చేయాలి.
వర్కింగ్ కమిటీ నివేదిక ప్రకారంప్రభుత్వ శాఖల్లో ఉన్న ఒప్పంద ఉద్యోగులు
* 2014 జూన్ 2 నాటికి ఉన్నవారు 11,062 మంది
* 2014 జూన్ 2 తర్వాత నియమితులైనవారు 9,017 మంది
వీరి పరిస్థితి ఏంటి?
* జూనియర్ కళాశాలల్లో ఒప్పంద లెక్చరర్ల నియామకాలు 2000 నుంచి 2013 వరకు జరిగాయి. ఇంటర్మీడియట్‌లో 3,720మంది లెక్చరర్లు ఉంటే వీరిలో 2014కు ముందు పదేళ్లు పూర్తి చేసుకున్న వారు సుమారు 800మంది మాత్రమే ఉన్నారు.
* పాలిటెక్నిక్ కళాశాలల్లో ఒప్పంద లెక్చరర్ల నియామకం 2005 నుంచి కొనసాగింది. ఇక్కడ 316మంది పని చేస్తున్నారు. వీరిలో ఒక్కరినీ క్రమబద్ధీకరించే పరిస్థితి లేదు.
* డిగ్రీ కళాశాలల్లో ఒప్పంద అధ్యాపకుల నియామకాలు 2,000 నవంబరు నుంచి జరిగాయి. ప్రస్తుతం 720మంది వరకు పని చేస్తుంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరిలో సుమారు 150మంది మాత్రమే క్రమబద్ధీకరణ వర్తిస్తుంది.
* సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో పని చేస్తున్న వారు 1,964మంది ఉన్నారు. ఏపీ రెసిడెన్షియల్‌లో 166మంది పని చేస్తున్నారు.
* జాతీయ ఆరోగ్య మిషన్‌లో 15వేలు, సమగ్ర శిక్ష అభియాన్‌లో 10,500 మంది పని చేస్తున్నారు. వీరు కాకుండా కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాల్లోనూ ఒప్పంద ఉద్యోగులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Turkey- syria Earthquake: అద్భుతం.. మృత్యుంజయులుగా బయటకొచ్చిన చిన్నారులు
-
India News
Cheetah: అవి పెద్దయ్యాక మనల్ని తినేస్తాయి.. మన పార్టీ ఓట్లను తగ్గించేస్తాయి..
-
Sports News
IND vs AUS: మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ని ఎంపిక చేయండి: రవిశాస్త్రి
-
Movies News
Kiara Sidharth Malhotra: ఒక్కటైన ప్రేమజంట.. ఘనంగా కియారా- సిద్ధార్థ్‌ల పరిణయం
-
Politics News
BJP: ప్రధాని మోదీపై రాహుల్ ఆరోపణలు నిరాధారం, సిగ్గుచేటు: రవిశంకర్ ప్రసాద్
-
World News
Turkey Earthquake: భూకంప విలయం.. రంగంలోకి శాటిలైట్లు!