రూ.350 కోట్ల స్థలంపై వైకాపా నేత కన్ను!

ప్రభుత్వ, క్రిస్టియన్‌ మైనారిటీ స్థలాలను కబ్జా చేస్తున్న వైకాపా నాయకులు విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న సుమారు రూ.350 కోట్ల విలువైన అటవీశాఖ భూమిపై కన్నేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు.

Updated : 28 Nov 2022 11:05 IST

అటవీ శాఖ అనుమతి లేకుండానే సర్వే
జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ వెల్లడి

ఈనాడు, విశాఖపట్నం: ప్రభుత్వ, క్రిస్టియన్‌ మైనారిటీ స్థలాలను కబ్జా చేస్తున్న వైకాపా నాయకులు విశాఖ నగరం నడిబొడ్డున ఉన్న సుమారు రూ.350 కోట్ల విలువైన అటవీశాఖ భూమిపై కన్నేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగా సిరిపురం రోడ్డువైపు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఆనుకుని ఉన్న అటవీశాఖ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు కడప జిల్లాకు చెందిన వైకాపా ముఖ్య నేత చూస్తున్నారు. అటవీశాఖ చీఫ్‌ కన్జర్వేటర్‌కు చెందిన ‘వనవిహార్‌’లోని బ్లాక్‌ నంబరు 12లో టౌన్‌ సర్వే నంబరు 88లో స్థలాన్ని ప్రైవేటు ఆస్తిగా చూపించే ప్రయత్నం జరుగుతోంది. దాదాపు రూ.350 కోట్ల విలువైన 3.6 ఎకరాల స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నారు. ఇది అటవీశాఖ స్థలమైనప్పటికీ ప్రైవేటుదిగా పేర్కొని ఆ శాఖ అనుమతి లేకుండానే సర్వే చేసేశారు. దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లో మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) సర్వేయర్‌తో అధికార పార్టీ నేత సర్వే చేయించారు. ఆ స్థలం పూర్వీకుల నుంచి దఖలు పడినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి వచ్చిన ఓ ముఖ్య నేత ఆదేశాల మేరకు తప్పుడు పత్రాలు సృష్టించి, దీన్ని ప్రైవేటు భూమిగా చూపించి కాజేయాలనే కుట్ర జరుగుతోంది’ అని మూర్తి యాదవ్‌ ఆరోపించారు.

* ‘ఐఏఎస్‌ హోదాలో భూములను కాపాడకుండా టీడీఆర్‌ జారీలో ఏ తప్పూ లేదని సీబీసీఎన్‌సీ వ్యవహారంలో జీవీఎంసీ కమిషనర్‌ రాజబాబు వివరణ ఇవ్వడం సరికాదు. యాజమాన్యపు హక్కులపై న్యాయపరమైన చిక్కులున్నప్పుడు ఒక వ్యక్తి పేరు మీద సీబీసీఎన్‌సీ స్థలానికి టీడీఆర్‌ ఎలా మంజూరు చేస్తారు’ అని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని