‘పోలీసు’ పోస్టుల విభజన ఏదీ?

రాష్ట్రంలో 6,511 పోలీసు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల వారీగా విభజన (నోటిఫై) చేయలేదని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.

Published : 01 Dec 2022 05:12 IST

కేటగిరీల వారీగా నోటిఫై చేయలేదని ఆశావహుల ఆందోళన

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 6,511 పోలీసు ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల వారీగా విభజన (నోటిఫై) చేయలేదని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. భర్తీ ప్రక్రియలో తమకు అన్యాయం జరిగే ప్రమాదముందని ఆయా వర్గాల అభ్యర్థులు వాపోతున్నారు. యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, డీఎస్‌సీ తదితర నియామక సంస్థలన్నీ... ఉద్యోగాల భర్తీకి ఇచ్చే నోటిఫికేషన్లలోనే ఏయే కేటగిరీ వారికి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో వివరంగా ఇస్తాయి. కేంద్ర భద్రత బలగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల విడుదలైన నోటిఫికేషన్‌లో కేటగిరీల వారీగా పోస్టులను నోటిఫై చేశారు. ఏపీ పోలీసు నియామక మండలి ఇప్పటివరకు జారీచేసిన ఏ నోటిఫికేషన్‌లోనూ పోస్టులను విభజించలేదు. ఫలితంగా తమ రిజర్వేషన్‌ శాతానికి అనుగుణంగా ఉద్యోగాలు లభించలేదని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈసారి ప్రకటనలోనైనా కేటగిరీల వారీగా పోస్టులను ఇవ్వాలని ప్రభుత్వానికి, డీజీపీకి, పోలీసు నియామక మండలికి లేఖలు రాసినా తమ వినతిని పరిగణనలోకి తీసుకోలేదని వారు అంటున్నారు. ఇప్పటికైనా సమస్య తీవ్రతను గుర్తించి పోస్టులను రిజర్వేషన్ల వారీగా నోటిఫై చేయాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని