బోధిస్తున్నారా.. బాధిస్తున్నారా?

పాఠశాలలో ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని ఆరుబయట కూర్చోబెట్టడం, గోడ కుర్చీ వేయించడం చూస్తుంటాం.

Published : 03 Dec 2022 03:49 IST

పాఠశాలలో ఏదైనా తప్పు చేస్తే పిల్లల్ని ఆరుబయట కూర్చోబెట్టడం, గోడ కుర్చీ వేయించడం చూస్తుంటాం. విజయవాడ మాచవరం టీఎంఆర్‌సీ మున్సిపల్‌ పాఠశాలలో మాత్రం విద్యార్థులు బడికి రావడమే పాపమన్నట్లు వారిని ఆరుబయట కంకర కుప్పపై కూర్చోబెట్టారు. ఒకవైపు రాళ్లు గుచ్చుకొని విద్యార్థులు బాధపడుతున్నా.. ఉపాధ్యాయులు ఇవేవీ పట్టనట్లు పాఠాలు చెప్పుకొంటూ పోతున్నారు. పైగా పిల్లలు కూర్చున్న పక్కనే భవనంపైన పనులు జరుగుతున్నాయి. ఏ క్షణాన పైనుంచి ఇటుకలు, సిమెంటు పెళ్లలు మీద పడుతాయోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కూర్చుండిపోయారు. ఈ ఆవరణలో ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ‘నాడు-నేడు’ పనుల వల్ల వారం రోజులుగా రెండు బడులను వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. కానీ.. ఎఫ్‌.ఎ.-2 పరీక్షల నేపథ్యంలో శుక్రవారం విద్యార్థులందరూ హాజరయ్యారు. దీంతో చోటు లేక కొన్ని తరగతుల విద్యార్థులను కంకర కుప్పలపై కూర్చోబెట్టారు. నాడు-నేడు పనులు పాఠశాల నడుస్తున్న సమయాల్లో చేపట్టడమేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కనీసం పనులయ్యే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. కంకరపై కూర్చున్న పిల్లలను చూసిన డీఈవో రేణుక రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు శ్రీముఖాలు ఇచ్చారు.

న్యూస్‌టుడే, విజయవాడ (కరెన్సీ నగర్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని