రేపు ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సీఎం జగన్‌ సమీక్ష

వైకాపా జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమావేశమవనున్నారు.

Published : 07 Dec 2022 05:15 IST

సర్వేలు, ఎమ్మెల్యేల పనితీరుపై చర్చ

ఈనాడు, అమరావతి: వైకాపా జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమావేశమవనున్నారు. ఇటీవలే కొందరు జిల్లా అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను మార్చేసిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత సెప్టెంబరులో నిర్వహించిన సమీక్షలో ‘పని చేయలేకపోతే ఇప్పుడే చెప్పండి, పని చేయగలిగే వారిని కొత్తగా నియమిస్తా...’అని సీఎం హెచ్చరించిన విషయం విదితమే. అనంతరం ఏడెనిమిది జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ లాంటి వారిని ప్రాంతీయ సమన్వయ బాధ్యతల నుంచి తొలగించారు. వారి స్థానాల్లో కొత్తవారిని నియమించారు. గడప గడపనకు మన ప్రభుత్వం కార్యక్రమంతో పాటు, పార్టీ కార్యకలాపాలు, సంస్థాగత నిర్మాణం, గ్రూపులు, నేతల మధ్య విభేదాలు వంటి పలు అంశాలపై సీఎం జగన్‌ సమీక్షించనున్నట్లు వైకాపా వర్గాలు తెలిపాయి. గ్రూపులను సర్దుబాటు చేయడంతో పాటు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యే, పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం చేసే బాధ్యతలనూ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకే అప్పగించారు. ఇప్పటివరకూ వారు గుర్తించినవి, పరిష్కరించినవి, వారి స్థాయిలో చేయలేకపోయిన వాటిపై ఆయన చర్చించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని