ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల శాశ్వత పంపిణీ జరగలేదు

కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిని రాష్ట్ర విభజన తర్వాత ఒప్పందాల ద్వారా కానీ, ట్రైబ్యునల్‌ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య శాశ్వత ప్రాతిపదికన ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు.

Published : 09 Dec 2022 05:21 IST

విద్యుత్తు ఉత్పత్తిలో నిబంధనల ఉల్లంఘన: కేంద్ర మంత్రి

ఈనాడు, దిల్లీ: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల నీటిని రాష్ట్ర విభజన తర్వాత ఒప్పందాల ద్వారా కానీ, ట్రైబ్యునల్‌ ద్వారా కానీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య శాశ్వత ప్రాతిపదికన ఇప్పటివరకూ పంపిణీ చేయలేదని కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. ఆయన గురువారం లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘అంతర్‌ రాష్ట్ర జల వివాదాల పరిష్కార చట్టం 1956లోని సెక్షన్‌ 5(3)కింద 1976లో బచావత్‌ ట్రైబ్యునల్‌ (కృష్ణా జలవివాద పరిష్కార ట్రైబ్యునల్‌-1) 75% డిపెండబిలిటీ ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల నీటిని కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వాటాలను ఇంతవరకూ ఖరారు చేయలేదు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు 2015-16 జలసంవత్సరంలో పరస్పర అంగీకారంతో తాత్కాలిక ప్రాతిపదికన ఒక కార్యాచరణ ఒప్పందం చేసుకున్నాయి. తర్వాతి సంవత్సరానికి ఆ ఒప్పందాన్ని అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదించింది. 2017-18 నుంచి 2022-23 మధ్యకాలంలో ఏటా అదే ఏర్పాట్లను కృష్ణా నదీ యాజమాన్య మండలి (కేఆర్‌ఎంబీ) ఆమోదిస్తూ వచ్చింది. ఆ తాత్కాలిక ఒప్పందానికి అనుగుణంగా రెండు రాష్ట్రాలు నీటిని తీసుకొని వాడుకుంటూ వస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రిజర్వాయర్లుగా పనిచేస్తున్నాయి. అక్కడ 2 రాష్ట్రాలూ జల విద్యుత్తు ఉత్పత్తిచేస్తున్నాయి. 2020-21, 2021-22 సంవత్సరాల్లో రెండు రాష్ట్రాలూ డ్యాంల్లో మిగులు జలాలు లేనప్పుడు పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించాయి. విద్యుత్తు ఉత్పత్తికోసం రిజర్వాయర్లను దుర్వినియోగం చేయకుండా కేఆర్‌ఎంబీ ఒక ఉపకమిటీని ఏర్పాటుచేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలోని విద్యుత్తు కేంద్రాల నిర్వహణతోపాటు, రిజర్వాయర్లను తగిన విధంగా నిర్వహించేందుకు అవసరమైన యంత్రాంగాన్ని రూపొందించడం ఈ కమిటీ బాధ్యత. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పంపిణీచేసే అధికారం ప్రస్తుత బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు ఉంది’’ అని కేంద్ర మంత్రి వివరించారు.

ప్రధాని విదేశీ పర్యటనల వ్యయం రూ.239 కోట్లు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత అయిదేళ్లలో చేసిన విదేశీ పర్యటనలకు రూ.239.62 కోట్లు వ్యయమైనట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ తెలిపారు. సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.

క్లీన్‌ ఎయిర్‌ పథకంతో వాయు నాణ్యత మెరుగైంది..

నేషనల్‌ క్లీన్‌ఎయిర్‌ పథకం కింద చేపట్టిన కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా 131 నగరాల్లో వాయు నాణ్యత 2017-18తో పోల్చితే 2021-22 నాటికి మెరుగైనట్లు అశ్వినీకుమార్‌ చౌబే తెలిపారు. వైకాపా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పీఎం 10 సూక్ష్మ ధూళి కణాల సంఖ్య క్యూబిక్‌ మీటర్‌ గాలిలో హైదరాబాద్‌లో 110 మైక్రోగ్రాముల నుంచి 88 మైక్రోగ్రాములకు,  విజయవాడలో 91 నుంచి 67కు, రాజమహేంద్రవరంలో 85 నుంచి 68కి, అనంతపురంలో 78 నుంచి 52కు, చిత్తూరులో 70 నుంచి 49కి, కడపలో 75 నుంచి 54కు తగ్గినట్లు పేర్కొన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హైదరాబాద్‌లోని సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) బెంచ్‌ సేవలు అందిస్తుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. క్యాట్‌ బెంచ్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా అని వైకాపా రాజ్యసభ సభ్యుడు ర్యాగ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ సమాధానమిచ్చారు.

* దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 24,994 న్యాయాధికారుల పోస్టులకుగానూ 19,205 మంది ఉన్నారని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌రిజిజు తెలిపారు. వైకాపా రాజ్యసభ సభ్యుడు నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

* ఆంధ్రప్రదేశ్‌లో ఏడు బీచ్‌ల శుభ్రతకు ‘స్వచ్ఛ్‌ నిర్మల్‌ తత్‌ అభియాన్‌’ కింద నోడల్‌ ఏజెన్సీగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ గ్రీన్‌ కార్ప్స్‌కు రూ.37,85,550 విడుదల చేసినట్లు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్‌ చౌబే తెలిపారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం తెలిపారు. ఆ నిధుల్లో వ్యయం చేయని రూ.1,65,020ను సంస్థ వెనక్కు ఇచ్చేసిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని