పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లపై జోక్యం చేసుకోవద్దు

పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్ల ముద్రణ, వినియోగం వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వం జారీచేసిన నిషేధ ఉత్తర్వులు పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లకు వర్తించవని స్పష్టంచేసింది.

Published : 26 Jan 2023 06:16 IST

రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు
నిషేధం విధిస్తే వ్యాపారులు, కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్న

ఈనాడు, అమరావతి: పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్ల ముద్రణ, వినియోగం వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రభుత్వం జారీచేసిన నిషేధ ఉత్తర్వులు పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్లకు వర్తించవని స్పష్టంచేసింది. మరోవైపు ఫ్లెక్సీలను నిషేధిస్తూ తెచ్చిన జీవోలు, నోటిషికేషన్లు పర్యావరణ చట్టం సెక్షన్‌ 5, నిబంధన 34, కేంద్ర ప్రభుత్వం 2021 ఆగస్టు 12న ఇచ్చిన నోటిఫికేషన్‌కు విరుద్ధంగా ఉన్నాయని ప్రాథమికంగా అభిప్రాయపడింది. నిషేధంపై ప్రభుత్వానికి ప్రశ్నల వర్షం కురిపించింది. ‘పర్యావరణానికి ఏవిధంగా హానికలిగిస్తున్నాయో శాస్త్రీయ అధ్యయనం ఏమైనా చేశారా? వ్యాపార భాగస్వాములకు నోటీసులిచ్చి, వారి వివరణను పరిగణనలోకి తీసుకున్నారా? ఆయా పరిశ్రమలపై వేల మంది కార్మికులు, వ్యాపారులు ఆధారపడి ఉంటారు. ఈ అంశాలను పరిశీలించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారు. మీది తొందరపాటు నిర్ణయం. మేం జోక్యం చేసుకుంటేనేమో... ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకున్నాయని మీరే(ప్రభుత్వం) ఆరోపిస్తున్నారు?’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ ఫ్లెక్సీ బ్యానర్ల విషయంలో మాత్రమే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. ఒవెన్‌ పీవీసీ ఫ్లెక్సీ బ్యానర్ల ప్రింటింగ్‌ యూనిట్లు, ఆ బ్యానర్ల వినియోగం విషయంలో జోక్యం చేసుకోవద్దని తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.గంగారావు, జస్టిస్‌ ఊటుకూరి శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తుది విచారణ కోసం విచారణను ఫిబ్రవరి 22కి వాయిదా వేసింది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం గతేడాది సెప్టెంబరులో జారీ చేసిన జీవో 65ని సవాలు చేస్తూ పలువురు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాదులు చల్లా కోదండరామ్‌, గంటా రామారావు, న్యాయవాదులు ఎస్‌.అనంత్‌, జ్యోతిరత్న అనుమోలు తదితరులు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు