Viveka Murder Case: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి రెండోసారి నోటీసుల జారీతో ఈ విషయం స్పష్టమవుతోంది.

Updated : 27 Jan 2023 05:09 IST

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి నోటీసు జారీలో స్పష్టత

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి రెండోసారి నోటీసుల జారీతో ఈ విషయం స్పష్టమవుతోంది. ఎంపీని సీబీఐ విచారించే అవకాశముందన్న ప్రచారాన్ని నిజం చేస్తూ ఈ నెల 23న అవినాష్‌రెడ్డికి తొలిసారిగా నోటీసులు అందజేసి ఆ మర్నాటి మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి రావాలని సూచించింది. సీబీఐ ఇంత వేగంగా స్పందిస్తుందని ఊహించలేని ఎంపీ.. తనకు 5 రోజుల గడువు కావాలని కోరారు. ఆయన విజ్ఞప్తిని మన్నిస్తూ ఈ నెల 28న హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి ఉదయం 11 గంటలకు చేరుకోవాలని మలి విడత నోటీసును బుధవారం జారీ చేసింది. దీన్నిబట్టి.. ఆలస్యానికి తావులేకుండా సీబీఐ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. హత్య జరిగి నాలుగేళ్లయిందని.. సీబీఐ విచారణలోనే జాప్యం జరిగితే ఎలాగని ఇటీవలే సీఎం జగన్‌ సోదరి, వైతెపా అధ్యక్షురాలు షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నాలుగేళ్ల తర్వాత అవినాష్‌ వ్యాఖ్యలు

ఈ హత్య కేసు గురించి ఎంపీ అవినాష్‌రెడ్డి నాలుగేళ్ల తర్వాత మీడియావద్ద చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘నిన్న నోటీసులు ఇచ్చి.. నేడు విచారణకు రమ్మంటే ఎలా’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘న్యాయం గెలవాలి. నాలుగైదు రోజుల్లో సీబీఐ విచారణకు హాజరవుతా. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందునే రాలేనని సీబీఐకి తెలిపా. సీబీఐ అధికారులు మళ్లీ నోటీసులిచ్చే అవకాశముంది. నోటీసు తీసుకుని విచారణకు హాజరవుతా. సీబీఐ అడిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతా. నేనేంటో, నా వ్యవహారశైలి ఏంటో జిల్లా ప్రజలకు తెలుసు. న్యాయం గెలవాలి.. నిజం వెల్లడి కావాలన్నదే నా ధ్యేయం. ఈ కేసులో నిజం తేలాలని భగవంతుడిని కోరుకుంటున్నా. ఆరోపణలు చేసేవారు.. మరోసారి ఆలోచించాలి. మీ కుటుంబాల్లో ఇదే జరిగితే ఎలా బాధపడతారో అర్థం చేసుకోవాలి’ అంటూ ఆయన హితవు పలికారు. దీన్నిబట్టి చూస్తే ఈ నెల 28న సీబీఐ ముందు ఆయన హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంతకుముందు అవినాష్‌ ఏనాడూ వివేకా హత్య గురించి మీడియా ముందు మాట్లాడలేదు.

కోర్టు ఆదేశాలతో వేగం

ఇంతకీ సీబీఐ అవినాష్‌రెడ్డిని సాక్షిగా పిలుస్తోందా.. నిందితుడిగానా? నోటీసుల్లో ఏం పేర్కొన్నారన్న చర్చ నడుస్తోంది. హత్య కేసు దర్యాప్తును హైదరాబాద్‌కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత సీబీఐ వేగంగా స్పందిస్తున్నట్లుగా ఉంది. సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో బుధవారం అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకుని నోటీసులు అందజేశారు. ఈ సమయంలో ఇంట్లో ఎంపీ లేకున్నా... సిబ్బందికి అందజేసి హాజరు కావాలని చెప్పి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని