‘ఇసుక’ సొమ్ము ఎవరి పాలవుతోంది?

రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ప్రతి రీచ్‌ నుంచి నిత్యం వందలాది లారీల లోడ్లు తరలి వెళ్తున్నాయి.

Published : 27 Jan 2023 03:06 IST

6 నెలలుగా ఖజానాకు చెల్లించని జేపీ సంస్థ  
ఏం జరుగుతోందని గనులశాఖను ప్రశ్నించిన ఆర్థికశాఖ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ప్రతి రీచ్‌ నుంచి నిత్యం వందలాది లారీల లోడ్లు తరలి వెళ్తున్నాయి. అన్నిచోట్లా నగదే తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వ ఖజానాకు కొన్ని నెలలుగా నిధులు జమ కావడంలేదు. ఆర్థికశాఖ ఆరా తీసినా ఫలితం లేదు. ఇదేమని అడిగితే ఉల్టా మీరే లెక్కలు చెప్పండంటూ అధికారులనే సంబంధిత సంస్థ ప్రశ్నించడం గమనార్హం. అన్ని జిల్లాల్లో ఇసుక వ్యాపారాన్ని రెండేళ్ల కాలానికి ఉత్తరాదికి చెందిన జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ (జేపీ) సంస్థ తీసుకుంది. 2021, మే 14 నుంచి ఇసుక తవ్వకాలు, అమ్మకాలను ప్రారంభించింది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలు జరుగుతాయని, గుత్తేదారు సంస్థ టన్ను రూ.475 చొప్పున విక్రయిస్తుందని, అందులో రూ.375 ప్రభుత్వానికి చెల్లిస్తుందని అప్పట్లో గనులశాఖ అధికారులు ప్రకటించారు. ప్రభుత్వానికి ఏడాదికి రూ.765 కోట్ల చొప్పున రెండేళ్లకు రూ.1,530 కోట్ల రాబడి వస్తుందని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం... ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకూ విక్రయించబోయే ఇసుకకు ఒకటో తేదీన రూ.31.87 కోట్లు, అలాగే 16 నుంచి నెలాఖరు వరకు విక్రయించే ఇసుకకు 16న రూ.31.87 కోట్లను అడ్వాన్సుగా ప్రభుత్వం వద్ద జమ చేయాలి.

ఇసుక రాబడిపై గనులశాఖ చెబుతున్న లెక్కలకు, ఖజానాకు జమైన దానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఆర్థికశాఖ ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై ఇటీవల గుత్తేదారు సంస్థతో గనులశాఖ చర్చించినట్లు సమాచారం. జేపీ సంస్థ ప్రజలకు ఇసుకను విక్రయించడంతోపాటు ఉపాధి హామీ పనులు, నాడు- నేడు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు వంటి ప్రభుత్వ పథకాలకు సరఫరా చేస్తోంది. ఈ డబ్బుల సంగతి తేల్చాలని ఆ సంస్థ అధికారులను కోరినట్లు తెలుస్తోంది. ఫలితంగా జిల్లాల వారీగా ఎంతెంత ఇసుక సరఫరా అయిందనే వివరాలను ఇవ్వాలని ఆయా శాఖల అధికారులను గనులశాఖ కోరినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని