రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తేనీటి విందు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం రాజ్‌భవన్‌లో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులు, అధికారేతర ప్రముఖులకు తేనీటి విందిచ్చారు.

Published : 27 Jan 2023 03:06 IST

ఈనాడు, అమరావతి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ గురువారం రాజ్‌భవన్‌లో ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులు, అధికారేతర ప్రముఖులకు తేనీటి విందిచ్చారు. ముఖ్యమంత్రి దంపతులు వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర ఆయన భార్య సుచేతా మిశ్ర, హైకోర్టు న్యాయమూర్తులు, శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి జోగి రమేష్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ కె.రాజేంద్రనాథరెడ్డి, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతం సవాంగ్‌, సమాచార హక్కు కమిషనర్లు, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ రుహుల్లా, పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సంకురాత్రి చంద్రశేఖర్‌, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం దంపతులు... గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ఆయన సతీమణి సుప్రవను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడినుంచి రాజ్‌భవన్‌ లాన్‌లో ఏర్పాటు చేసిన తేనీటి విందు ప్రాంగణానికి చేరుకున్నారు. గవర్నర్‌ ప్రాంగణమంతా కలియతిరుగుతూ అతిథులందరికీ అభివాదం చేశారు. గంటపాటు కార్యక్రమం కొనసాగింది.

తొలిసారి ఇలా..

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చే తేనీటి విందుకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతతోపాటు ప్రతిపక్షాలకు చెందిన అధ్యక్షులు, ముఖ్య నాయకులు రావడం పరిపాటి. ఈసారి విపక్షాల నాయకులు ఒక్కరూ హాజరవలేదు. ‘రాష్ట్రంలో అంబేడ్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 1ని తీసుకొచ్చి ప్రజాస్వామిక హక్కులను కాలరాసింది. దాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ తేనీటి విందును మేం బహిష్కరిస్తున్నాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని