ఉద్యోగులను ప్రత్యర్థులుగా చూస్తున్న ప్రభుత్వం

ఉద్యోగులు, పింఛనుదారులపై ప్రభుత్వం మోసపూరిత పద్ధతులను అవలంబిస్తోందని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మండిపడ్డారు.

Updated : 29 Jan 2023 05:53 IST

జీతాలు, పింఛన్లు సకాలంలో ఇవ్వడం లేదు
ఏఐటీయూసీ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల ఆగ్రహం

ఈనాడు, అమరావతి: ఉద్యోగులు, పింఛనుదారులపై ప్రభుత్వం మోసపూరిత పద్ధతులను అవలంబిస్తోందని ఆల్‌ ఇండియా ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ (ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మండిపడ్డారు. ఉద్యోగులపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఓబులేసు మాట్లాడుతూ.. పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదని, జీపీఎఫ్‌ డబ్బులను కాజేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితిలో లేదని విమర్శించారు. ఉద్యోగులను ప్రభుత్వం ప్రత్యర్థులుగా చూస్తోందని, ఈ ధోరణి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ సమస్యలను గవర్నర్‌తో విన్నవించుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. ఉద్యోగ సంఘ నాయకుడు సూర్యనారాయణలాంటి వారిని బెదిరించడం మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులకు కలిపి సుమారు రూ.21వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని ఓబులేసు వెల్లడించారు. 11వ పీఆర్సీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండు చేశారు. వెంటనే 12వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్‌ వై.వి.రావు మాట్లాడుతూ.. ప్రభుత్వంలో విలీనంతో ఆర్టీసీ కార్మికులకు ఒరిగిందేమీ లేదని, గతం కంటే పరిస్థితి మరింత అధ్వానంగా తయారైందని ధ్వజమెత్తారు. ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని వాపోయారు. ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎన్‌.వెంకట సుబ్బయ్య, ఎన్జీవో పెన్షన్‌దారుల సంఘం నాయకుడు నాగరాజు, మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి గిరిబాబు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు