రైతు భరోసాపై ఎన్ని మడతలో?

రాష్ట్రంలో 70లక్షల రైతు, కౌలు రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.8,750 కోట్లు అందించబోతున్నాం. దాదాపు 16 లక్షల కౌలు రైతులకు రైతు భరోసాను ఇస్తాం.

Updated : 31 Jan 2023 09:01 IST

నాలుగేళ్లలో రూ.50 వేలిస్తామంటూ.. కోత పెట్టారు
42% నిధులు పీఎం కిసాన్‌ కింద కేంద్రం ఇచ్చేవే
కౌలు రైతులనూ ఊరించి ఉసూరనిపించారు
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో 70లక్షల రైతు, కౌలు రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.8,750 కోట్లు అందించబోతున్నాం. దాదాపు 16 లక్షల కౌలు రైతులకు రైతు భరోసాను ఇస్తాం. ఇంత భారీ మొత్తాన్ని ఒకే విడతలో రైతుల చేతికి అందించడం.. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే ఇదో రికార్డు.

2019 జులై 12న అసెంబ్లీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన

రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఏడాదికి సగటున రూ.4వేల కోట్లే.. అంటే హామీ ఇచ్చిన మొత్తంలో సగమూ ఇవ్వడం లేదు. కౌలు రైతులకు ఏడాదికి సగటున లక్ష మందికి కూడా భరోసా దక్కడం లేదు. రాష్ట్రం ఇచ్చేది ఒక్కో రైతుకు ఏడాదికి రూ.7,500 మాత్రమే. మిగిలిన రూ.6వేలను కేంద్రమే నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తోంది. వాస్తవానికి వైకాపా అధికారంలోకి వచ్చే నాటికే పీఎం కిసాన్‌ అమల్లో ఉంది. దానితో కలిపి ఇస్తామని ఎన్నికల సమయంలో ఒక్కమాటా చెప్పలేదు.

డాదికి ఒకేసారి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50వేలు రైతుల చేతిలో పెడతామని 2019 ఎన్నికల ముందు చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి.. తీరా సీఎం అయ్యాక.. ఏడాదికి రూ.7,500 చొప్పున రూ.37,500 మాత్రమే రాష్ట్ర ఖజానా నుంచి ఇచ్చి సరిపెడుతున్నారు. కేంద్రం ఏడాదికి ఇచ్చే రూ.6వేలను(మూడు విడతల్లో) కూడా తన ఖాతాలో వేసుకుని.. చెప్పిన దానికంటే మిన్నగా ఏడాదికి రూ.13,500 ఇస్తున్నామంటూ ఏటా బటన్‌ నొక్కుతున్నారు. వాటిలోనూ ఈ ఏడాది మూడో విడత కింద సంక్రాంతికి ఇవ్వాల్సిన రూ.2వేలను ఇంకా విడుదల చేయలేదు. మొత్తంగా చూస్తే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే ఏటా రూ.8,750 కోట్లను ఇస్తుందంటూ ఘనంగా ప్రకటించిన ముఖ్యమంత్రి అందులో.. తమ ప్రభుత్వం సొంతగా సగమూ ఇవ్వలేకపోతోందనే అంశాన్ని కప్పి పెడుతున్నారు. 16లక్షల మంది కౌలు రైతులకూ రైతు భరోసాను వర్తింప జేస్తామన్న హామీపైనా జగన్‌మోహన్‌రెడ్డి నాలుక మడతేశారు. వారిని సామాజికవర్గాలుగా విభజించారు. 94% మందికి రిక్తహస్తం చూపారు.

సంక్రాంతి సొమ్ము ఏదీ?

కేంద్రం ఇచ్చే రూ.6వేలతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో రూ.13,500 ఇస్తోంది. ఇందులో ఏటా సంక్రాంతికి ఒక్కో రైతుకు రూ.2వేలు ఇవ్వాలి. పీఎం కిసాన్‌కు ఈ-కేవైసీ చేయడంలో జాప్యంతో కేంద్రం ఇవ్వాల్సిన మూడో విడత సొమ్ము ఇంకా రైతుల ఖాతాల్లో పడలేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం కౌలు రైతులకు నిధులు విడుదల చేయలేదు.

కౌలు రైతులకు ఒట్టి మాటలే!

ఏటా 16 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పినా.. తొలి మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా అందుకున్నవారు 2.68 లక్షల మందే. సగటున ఏడాదికి లక్ష మందైనా లేరు. మొత్తం కౌలుదారుల్లో సుమారు 6% మందికే సాయం దక్కుతోంది. అటవీ భూముల సాగుదారులు 85వేల మంది వరకు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు ఏడాదికి రూ.13,500 మొత్తం అందేది వీరికే.

* ఎన్నికల సమయంలో కౌలు రైతులందరినీ ఆదుకుంటామని చెప్పిన జగన్‌.. అధికారం చేపట్టాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికే రైతు భరోసా ఇస్తామన్నారు.  కౌలు కార్డులు లేవంటూ 90% మందికిపైగా మొండి చేయి చూపిస్తున్నారు.


మూడేళ్లలో రూ.11,661 కోట్లే

రాష్ట్రంలో 70లక్షల రైతు, కౌలు రైతు కుటుంబాలకు సాయం చేస్తామన్నా.. లబ్ధిదారుల సంఖ్య గత మూడేళ్లలో ఎప్పుడూ 53 లక్షలకు మించలేదు. రాష్ట్రం తమ సొంత నిధుల నుంచి ఏడాదికి సగటున రూ.3,887 కోట్లు మాత్రమే ఇచ్చింది. మొత్తంగా మూడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చింది రూ.11,661 కోట్లు మాత్రమే. అందులో రూ.3,108 కోట్లు ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నుంచే ఖర్చు చేశారు. మూడేళ్లలో రైతులకు ఇచ్చిన మొత్తం నిధుల్లో కేంద్రం వాటా 42% ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని