దేశంలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి

దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించకపోయినా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, స్వేచ్ఛగా రాయడానికి, తమ అభిప్రాయాలు చెప్పడానికి రచయితలు భయపడే స్థితి నెలకొందని ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత దామోదర్‌ మౌజో అభిప్రాయపడ్డారు.

Updated : 31 Jan 2023 05:19 IST

రచయితలకు స్వేచ్ఛ లేదు.. బెదిరింపులూ ఎక్కువయ్యాయ్‌
హిందీని బలవంతంగా రుద్దడం ప్రమాదకరం
ప్రమాదంలో ప్రాంతీయ భాషలు
 ‘ఈనాడు’తో జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత దామోదర్‌ మౌజో
ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
ఈనాడు - హైదరాబాద్‌

దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించకపోయినా అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, స్వేచ్ఛగా రాయడానికి, తమ అభిప్రాయాలు చెప్పడానికి రచయితలు భయపడే స్థితి నెలకొందని ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత దామోదర్‌ మౌజో అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాల్లోని మంచి చెడులను వ్యక్తంచేసే, రాసే స్వేచ్ఛ పౌరులకు ఉండాలన్నారు. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని.. మానసికంగా, శారీరకంగా భయాందోళనలకు గురి చేయడం వల్ల అనేకమంది మంచి రచయితలు రాయడం మానుకున్నారన్నారు. కొంకణి భాషలో రచనలు చేసిన దామోదర్‌ మౌజో 2021లో జ్ఞానపీఠ్‌ అవార్డు పొందారు. గౌరీలంకేశ్‌ హత్య తర్వాత ఈయనకు ప్రమాదం ఉందన్న సమాచారంతో ప్రభుత్వం పోలీసు రక్షణ కల్పించింది. పోలీసు రక్షణతోనే హైదరాబాద్‌లో జరిగిన సాహితీ వేడుకలో పాల్గొన్న ఆయన ‘ఈనాడు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

రచయితలు స్వేచ్ఛగా రచనలు చేయడం, అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి లేదంటారా? భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటారా?

తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ కచ్చితంగా ప్రమాదంలో ఉంది. అయితే ఇంతకుముందు ప్రమాదంలో లేదని కాదు. ఇటీవలి సంవత్సరాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వివిధ అంశాలపై నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు. నేను చెప్పాలనుకొన్నది చెప్తాను. రాయాలనుకొన్నది రాస్తాను. ఎవరినీ పట్టించుకోను..కానీ ఇలా మాట్లాడే, రచనలు చేసేవారిని ట్రోల్‌ చేయడం, బెదిరించడం, మానసికంగా, శారీరకంగా వేధించడం ఎక్కువైంది. కేరళ, తమిళనాడు సహా అనేక చోట్ల ఇలా జరిగింది. తమిళనాడులో మురుగన్‌కు ఎంత తీవ్రమైన బెదిరింపులు వచ్చాయో చూశాం. గొప్ప రచయిత రాయడం మానేశారు. రచయిత రచన చేయకుండా మానడం అంటే చనిపోయినవారితో సమానం. ఇలాంటి వాతావరణం దేశంలో నెలకొంది.

ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయనే   అభిప్రాయం కొందరి నుంచి వ్యక్తమవుతోంది. మీరేమంటారు?

అత్యయిక స్థితిని విధించకుండానే అలాంటి వాతావరణాన్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. మళ్లీ ఎమర్జెన్సీ ప్రవేశపెడతారని నేను అనుకోను. ప్రభుత్వ నిర్ణయాలు సరిగా లేవన్నపుడు వాటిపై తమ ఆందోళనను వ్యక్తం చేయడం ఓటరుకు ఉన్న హక్కు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినపుడు వ్యతిరేకించినా, మాట్లాడినా అణచివేయకూడదు. ప్రభుత్వం మంచి చేసినపుడు  హర్షించడానికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లినా, ప్రభుత్వాలు తీసుకొనే నిర్ణయాలు నచ్చనపుడు అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ కూడా లేదంటే ఎలా? ఏ ప్రభుత్వానికైనా ‘ప్రజలు  అధికారాన్ని ఇచ్చారు.. వాళ్లకోసమే ఉన్నాం..వారి మేలుకోసం పని చేయాలి’ అనే స్పృహ ఉండాలి.

ఏయే రంగాలు ప్రభావానికి గురవుతున్నాయంటారు?

చాలా రంగాలు ప్రభావితమవుతున్నా నాకు వాటి లోతుపాతుల గురించి తెలిసింది తక్కువ. నాకు పరిజ్ఞానం ఉన్నది సాహిత్యరంగంలో. నాకు ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నది ఇదే. తమను భయపెడుతున్నారనే అభిప్రాయాన్ని చాలామంది రచయితలు వ్యక్తం చేస్తున్నారు.  తాజాగా జరిగిన సంఘటన దీనికో ఉదాహరణ. కోబాడ్‌గాంధీ రాసిన పుస్తకాన్ని ఇటీవల మరాఠీలోకి అనువాదం చేశారు. అనువాదం చేసిన రచయితకు ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. అయితే సంబంధిత మంత్రి జోక్యం అభ్యంతరం తెలిపి అవార్డును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.. కోబాడ్‌గాంధీ రాసిన పుస్తకం ఎప్పుడో వచ్చింది. దానిపై ఎలాంటి నిషేధం లేదు. అనువాదాన్ని మాత్రం నిషేధించారు. అసలు పుస్తకం మార్కెట్‌లో ఉండగా, చాలా సంవత్సరాల తర్వాత చేసిన అనువాదం జాతి వ్యతిరేకం ఎలా అయ్యింది? ఇలాంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే విద్యావ్యవస్థ కూడా. గతంలో గవర్నర్లను మాత్రమే కేంద్రప్రభుత్వం నియమించేది. కొంతకాలంగా వర్సిటీల వీసీలనూ కేంద్రమే నియమిస్తోంది. తమకు నచ్చిన వారిని, తమ భావజాలం కలిగినవారిని నియమిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?

ప్రాంతీయ భాషలు ప్రమాదంలో పడ్డాయంటారా? ప్రత్యేకించి తెలుగుభాష ఆందోళనకర పరిస్థితిని ఎదుర్కొంటోందని ప్రముఖ భాషా శాస్త్రవేత్తలు అంటున్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి?

తెలుగుభాష ఒక్కటే కాదు.. అన్ని ప్రాంతీయ భాషలూ ప్రమాదంలో ఉన్నాయి. కొన్ని ముందు.. కొన్ని తర్వాత.. అంతే. మా మాతృభాష కొంకణినే తీసుకొంటే.. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలతోపాటు అన్ని భాషల స్కూళ్లకు గ్రాంటు ఇవ్వాలని గోవా ప్రభుత్వం నిర్ణయించింది. సహజంగా తల్లితండ్రులు పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చేర్చుతున్నారు. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలో ఉంటేనే పిల్లలు సులభంగా అన్ని విషయాలను అర్థం చేసుకోగలరు. ఆంగ్ల మాధ్యమంలో ఆ భాష నేర్చుకొంటారు. కానీ సంస్కృతిని మర్చిపోతారు. మాతృభాష.. మన సంస్కృతిలో భాగం. ధనికులు, ఉన్నతస్థాయి అధికారులు తమ పిల్లల భవిష్యత్తు విదేశాల్లో ఉందనుకుంటారు. వారి పిల్లలను ఉన్నత విద్యకోసం విదేశాలకు..ప్రత్యేకించి అమెరికా, యు.కె.లాంటి దేశాలకు పంపిస్తారు. ఇలా వెళ్లేవారి సంఖ్య పెరిగి ఉండొచ్చు. వారిలో మాతృభాషలో చదువుకొన్నవారూ ఎక్కువే. ఆంగ్ల మాధ్యమం వల్ల మరొక సమస్య కూడా ఉంది. దళితులు, పేదలు ఏమనుకుంటారంటే తమది కాని భాషను తమపై రద్దుతున్నారని. భాష, మాండలికం ఏదీ వారిది కానప్పుడు వారిలో ఆసక్తి ఎలా వస్తుంది? ఉదాహరణకు ఉన్నతస్థాయిలో మాట్లాడుకొనే వారి భాష, దళితులు, ఇతర అణగారిన వర్గాలు మాట్లాడుకునే భాష ఉందనుకొన్నాం. ఉన్నతస్థాయిలో ఉన్నవారి భాషకు ఎక్కువ మార్కులు వేస్తే సహజంగానే  ఇతరులు ఆ పాఠశాలకు దూరమవుతారు. ఇది మా భాష కాదు, మా పాఠశాల కాదు..వెళ్లి ఏం ప్రయోజనం అనుకొంటారు. భాషతో ఉండే మమకారం పోతుంది. నాది కాని దాంట్లో నేనేందుకు ఉండాలనే అభిప్రాయానికి వస్తారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండి, మాధ్యమిక స్థాయి నుంచి అదనపు భాషను నేర్పించడం వల్ల పిల్లల్లో మనో వికాసం కలుగుతుంది. నా విద్య మాతృభాషలోనే జరిగింది..కానీ నేనేమీ కోల్పోలేదు. ఇంగ్లిషును రుద్దడం ప్రభుత్వాలు మాత్రమే చేయడం లేదు. మన తప్పు కూడా ఉంది. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు పంపడం అనేది ఓ ట్రెండ్‌లాగా మారింది. పిల్లల భవిష్యత్తు అందులోనే ఉందని భావిస్తున్నారు. మాతృభాషలో ప్రాథమిక విద్య ఎంత ముఖ్యమో మరచిపోతున్నారు.

కేంద్ర ప్రభుత్వం హిందీకి అధిక ప్రాధాన్యం ఇస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కదా?

ఇది చాలా దురదృష్టకరం. హిందీని బలవంతంగా రుద్దడం భవిష్యత్తులో చాలా ప్రమాదకర పరిస్థితులను తెచ్చిపెడుతుంది. మన భాషలు వైవిధ్యమైనవి. ప్రతి భాషా ముఖ్యమైందే. రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో కొంకణి కూడా ఉంది. అలాంటప్పుడు కొంకణికి ఎందుకు జాతీయ భాష హోదా ఇవ్వరు. ఇదొక్కటే కాదు ఏ భాషకైనా ఎందుకివ్వరు? కేంద్రానికి హిందీ అధికార భాష కావొచ్చు. దాన్నే అందరిపైనా రుద్దడం మంచిది కాదు. ఒక భాషపై ఇంకో భాష పెత్తనం చలాయించడాన్ని ఆమోదించకూడదు. ఇదే పరిస్థితి కొనసాగితే  ప్రజల భాగస్వామ్యంలో విభజన వస్తుంది. ఉత్తర, దక్షిణ ప్రాంతాలన్న అభిప్రాయం రాకుండా చూడాలి. దీనిని ముందుగానే ఊహించి, గుర్తించి దేశంలోని ప్రజలంతా ఒకటే అనేలా వారి భాషలకు ప్రాధాన్యం ఇచ్చి గుర్తించాలి. ప్రతి భాషకూ జాతీయ హోదా ఇవ్వాలన్నది నా అభిప్రాయం.

మీకు ఇప్పటికీ హెచ్చరికలు వస్తున్నాయా? మీ రచనలకు ప్రేరణ ఏంటి?

మొదటినుంచీ వీటిని నేను పట్టించుకోలేదు. ప్రభుత్వం కూడా నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. నేను తీసుకున్న వైఖరి పట్ల పూర్తిగా నాకు అంగీకారం ఉంది. వాస్తవాలే మాట్లాడతానని అందరికీ తెలుసు. నేనేమీ సంఘ వ్యతిరేకశక్తిని కాదు. నేనేందుకు భయపడాలి? ప్రభుత్వంలో ఉన్నవారికి అనుకూలంగా మాట్లాడాలంటే అదెలా సాధ్యమవుతుంది? వాస్తవం ఏదైతే అదే మాట్లాడతాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల గురించి, జరుగుతున్న పరిణామాల గురించి వాస్తవాలు మాట్లాడితేనే అనేక చోట్ల సహించలేకపోతున్నారు. నేను ముంబయిలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కాకుండా కుటుంబం నిర్వహించే నిత్యావసర వస్తువుల దుకాణం నిర్వహణ చూసుకోవాలని నిర్ణయించుకొన్నాను. దుకాణానికి వచ్చే వారితో మాట్లాడి.. వారు చెప్పేవన్నీ వినేవాడిని. కుటుంబ సమస్యల నుంచి అన్ని విషయాలను తెలుసుకునేవాడిని. వారి అనుభవాలు, సమస్యలనే ఇతివృత్తంగా చేసుకొని కథలు రాయడం ప్రారంభించాను.


చయితలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయనీయండి. వాళ్లు చెప్పేది సరైంది కాదనుకుంటే వారి పుస్తకాలు కొనొద్దు. చెప్పేది వినొద్దు. ఏం తప్పు ఉందో చెప్పండి. అంతే కానీ ఏం మాట్లాడనీయమంటే  ఎలా? అన్ని వ్యవస్థలు బలహీనపడటం ప్రజస్వామ్యానికి మంచిదా?’’


బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇంగ్లిషు నేర్పించాలనుకొనడం, ఆ మాధ్యమంలో చదివించాలనుకోవడం మంచిది కాదు. మాతృభాషలో ప్రాథమిక విద్య ప్రభుత్వ బాధ్యత. తెలుగులో గ్రాడ్యుయేషన్‌ చదువుకున్నవారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వాలను చెప్పమనండి.. తల్లిదండ్రులు దానికే మొగ్గుచూపుతారు. ప్రభుత్వాలే మాతృభాషను దెబ్బతీస్తున్నాయి’’


భివృద్ధి పేరుతో ప్రకృతి వనరులను ధ్వంసం చేయకూడదు. రోడ్ల విస్తరణ, అభివృద్ధి ముఖ్యమే, కానీ ఆ పేరుతో విచ్చలవిడిగా చెట్లను నరకడం, నీటి వనరులను ధ్వంసం చేయడం మంచిది కాదు. ప్రకృతిని విధ్వంసానికి గురి చేసే విషయంలో ప్రభుత్వాలు పునరాలోచించాలి. అలాగే వ్యవసాయ భూమిని తీసేసుకోవడంలో కూడా’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని