Budget 2023: పది బడ్జెట్లు గడిచినా... పనికొచ్చే ప్రాజెక్టే లేదు

కేంద్రాన్ని నిలదీయలేని, పూర్తిగా సాగిలపడిన రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, కేంద్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది.

Updated : 02 Feb 2023 10:02 IST

విభజన హామీల్నీ పట్టించుకోని కేంద్రం
తాజా బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి దగా
ప్రభుత్వ చేతగానితనం వల్లే ఈ దుస్థితి
ఈనాడు - అమరావతి

కేంద్రాన్ని నిలదీయలేని, పూర్తిగా సాగిలపడిన రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనం, కేంద్ర ప్రభుత్వ అంతులేని నిర్లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మన రాష్ట్ర ప్రస్తావనే లేదు. రాష్ట్ర విభజన జరిగాక.. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. పది బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఈ ప్రభుత్వ హయాంలో చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే! రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లయింది. ఒక రాష్ట్ర చరిత్రలో తొమ్మిదేళ్లంటే ఆషామాషీ కాదు. అందులోనూ కొత్తగా ఏర్పడిన రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానంలో తొమ్మిదేళ్లు అత్యంత కీలకం. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పది బడ్జెట్లలో రాష్ట్రాలకు సర్వసాధారణంగా ఇచ్చే అరకొర కేటాయింపులు, విదిలింపులే తప్ప ఆంధ్రప్రదేశ్‌కంటూ నిర్దిష్టంగా, రాష్ట్ర స్వావలంబనకు ఉపయోగపడే ప్రాజెక్టును ఒక్కటైనా ప్రకటించలేదు. కనీసం విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాల్ని, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ లోక్‌సభలో ఇచ్చిన ప్రత్యేక హోదా వంటి హామీల్నీ నెరవేర్చలేదు. కేంద్రంతో పోరాడలేని రాష్ట్ర ప్రభుత్వాల నిస్సహాయత, ఏపీపై కేంద్రానికి ఉన్న అంతులేని ఉదాసీనతే దీనికి కారణం. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా మొదటి నాలుగేళ్లూ.. కేంద్రంతో సామరస్యంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోవాలని ప్రయత్నించింది. చివరి సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

వైకాపా విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సహా విభజన హామీల కోసం కేంద్రంపై పోరాడాల్సిందేనని రంకెలు వేసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే, 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీల్ని సాధిస్తామని అప్పట్లో ప్రతిపక్ష నేతగా జగన్‌ పదేపదే చెప్పారు.  అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్లేటు ఫిరాయించేశారు. గత ప్రభుత్వం కనీసం చివరి సంవత్సరమైనా కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా పోరాడింది. జగన్‌ మాత్రం.. కేంద్ర పెద్దలంటే అంతులేని విధేయత చూపుతూ, కనీసం గట్టిగా అడిగేందుకూ జంకుతూ నాలుగేళ్లు గడిపేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండటం కేంద్ర ప్రభుత్వానికి మరింత లోకువగా మారింది. ఇంకా విభజన గాయాల నుంచి కోలుకోని, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల్లేక, ఆర్థికలోటుతో కునారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్‌పై దిల్లీ పెద్దల అంతులేని నిర్లక్ష్యానికి ఇదే ప్రధాన కారణం. ఈ బడ్జెట్‌లో కూడా పోలవరం ప్రాజెక్టు, విశాఖలో రైల్వే జోన్‌కు నిధులు కేటాయింపుపై మాట్లాడలేదు. రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ప్లాంట్‌, రాజధాని నిర్మాణానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం.. ఇలా విభజన చట్టంలో ఇచ్చిన ఏ హామీ గురించీ కనీస ప్రస్తావనా లేదు. అయినా ఈ బడ్జెట్‌ బ్రహ్మాండంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి విలేకర్ల సమావేశం పెట్టి మరీ ప్రశంసించడం.. కేంద్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి వైకాపా ప్రభుత్వం ఎంతగా తహతహలాడుతోందో చెప్పడానికి నిదర్శనం. ఆయన స్పందన చూశాక... జగన్‌ ప్రభుత్వం అంతగా వణికిపోతుంటే ఇక కేంద్రం మాత్రం రాష్ట్రాన్ని ఎందుకు పట్టించుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి ఒరిగిందేమిటి?

ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా అండగా ఉంటామని 2014 ఎన్నికల సమయంలో భాజపా నాయకులు ఇచ్చిన హామీలు శుష్క వాగ్దానాలుగానే మిగిలిపోయాయి. ప్రతి బడ్జెట్‌లోనూ భాజపా పాలిత రాష్ట్రాలు, ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వరాలు కురిపిస్తూ, అప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరాల్లోని ప్రాజెక్టులకు నిధుల వరద పారిస్తున్న కేంద్రం తాజా బడ్జెట్‌లోనూ అదే ధోరణి కనబరిచింది.

రాష్ట్ర విభజన జరిగిన ఈ తొమ్మిదేళ్లలో రాజధాని నిర్మాణానికి రూ.1,500 కోట్లు ఇవ్వడం, వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం వంటి హామీల్ని మాత్రమే అరకొరగా నెరవేర్చింది.  

కర్ణాటకలోని వెనుకబడిన ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ బడ్జెట్‌లో రూ.5,300 కోట్లు కేటాయించిన కేంద్రం.. పోలవరం ప్రాజెక్టు గురించిన కనీస ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.

దేశంలోని వివిధ నగరాల్లోని మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు 2021-22లో కేంద్రం రూ.23,262 కోట్లు ఖర్చు చేసింది. బెంగళూరు, చెన్నై, కోచి, నాగ్‌పుర్‌, నాసిక్‌లలో మెట్రో రైళ్ల ప్రాజెక్టులకు భారీగా ఖర్చు చేసింది. బెంగళూరు మెట్రో రెండో దశ ప్రాజెక్టుకే ఏకంగా రూ14,788 కోట్లు ఇచ్చింది. నిరుటి బడ్జెట్‌లోనూ మెట్రోలకు రూ.19,130 కోట్లు కేటాయించింది. అందులోనూ ఎక్కడా విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. మెట్రో అనే కాదు.. బెంగళూరు సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టుకూ కేంద్రం గత బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించింది.

విశాఖకు రైల్వే జోన్‌ ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. ఎందుకు అడుగు ముందుకు పడటం లేదు?

వెనుకబడిన రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహం కేటగిరీ కింద.. పరిశ్రమలకు కేంద్ర, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీని తిరిగిచ్చేందుకు ప్రత్యేక హోదా కలిగిన ఈశాన్య రాష్ట్రాలకు 2022-23 బడ్జెట్‌లో రూ.3,631 కోట్లు కేటాయించింది. తాజా బడ్జెట్‌లోనూ రూ.1,714 కోట్లు పెట్టింది. ప్రత్యేక హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్‌కూ ఆ ప్రయోజనం చేకూరేది కదా? ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ఆ రాయితీలన్నా ఇస్తే ఇక్కడా పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతుంది కదా? ఇంత అన్యాయం జరుగుతున్నా.. పెండింగ్‌లో ఉన్న ప్రధానమైన విభజన హామీల గురించి కేంద్రం వీసమెత్తు పట్టించుకోకపోయినా నిలదీయాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై లేదా?


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని