‘సంకల్ప దీక్ష’పై పోలీసుల నిర్బంధం
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) చేపట్టిన ‘సంకల్ప దీక్ష’ను భగ్నం చేసేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేశారు.
సీపీఎస్ రద్దు చేయాలంటూ దీక్షకు పిలుపునిచ్చిన యూటీఎఫ్
ఉపాధ్యాయుల ముందస్తు హౌస్ అరెస్టు
ఈనాడు, అమరావతి, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్) చేపట్టిన ‘సంకల్ప దీక్ష’ను భగ్నం చేసేందుకు పోలీసులు కఠిన ఆంక్షలు అమలు చేశారు. దీక్ష నిర్వహణకు అనుమతి లేదంటూ ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. కొందర్ని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. దీక్షాస్థలికి ఎక్కువ మంది రాకుండా నిలువరించేందుకు గురువారం రాత్రి నుంచే చాలా మందిని గృహనిర్బంధం చేశారు. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రధానంగా హనుమాన్‌జంక్షన్ నుంచి గన్నవరం వరకు శుక్రవారం తెల్లవారు జాము నుంచే భారీగా పోలీసులు మోహరించారు. అడుగడునా చెక్‌పోస్టులు పెట్టి వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉపాధ్యాయుడిగా అనుమానిస్తే వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సీపీఎస్ రద్దు చేయాలని కృష్ణా జిల్లా గన్నవరం శివారులోని ‘ధర్మస్థలి’ ఆవరణలో సంకల్ప దీక్షకు యూటీఎఫ్ పిలుపునిచ్చింది. దీనికీ అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఉపాధ్యాయులు సభాస్థలికి చేరుకునే ఆస్కారం లేకుండా చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై పొట్టిపాడు టోల్‌ప్లాజా, పిన్నమనేని కూడలి, హనుమాన్‌జంక్షన్, విమానాశ్రయం, గన్నవరం పరిసరాల్లో ఎనిమిది చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 418మంది ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకొని వీరవల్లి, ఉంగుటూరు, గన్నవరం, పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు, హనుమాన్‌జంక్షన్, ఆత్కూరు స్టేషన్లకు తరలించారు.
పాఠశాలల వద్ద పోలీసుల కాపలా..
ఉపాధ్యాయులు సంకల్ప దీక్షకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పాఠశాలల వద్ద పోలీసులు ఉదయం నుంచి కాపలా కాశారు. గుంటూరులో యూటీఎఫ్ సహాధ్యక్షురాలు కుసుమకుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, నెల్లూరులో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బాబురెడ్డిని గృహ నిర్బంధం చేశారు. ఎన్టీఆర్ జిల్లా యూటీఎఫ్ గౌరవాధ్యక్షుడు మచ్చా శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు డి.అపర్ణను హౌస్‌అరెస్టు చేశారు. ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌లను పెదఅవుటపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆత్కూరు పోలీసుస్టేషన్ వద్ద ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించడంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. కేసులు నమోదుచేసిన పోలీసులు..మధ్యాహ్నం తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. సంకల్ప దీక్ష కొనసాగింపుగా ఈనెల 5న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షలు నిర్వహించాలని యూటీఎఫ్ పిలుపునిచ్చింది. రానున్న రోజుల్లో తమ పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు, ప్రసాద్ వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన గ్యారెంటెడ్ పెన్షన్ పథకంతో ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. ఉపాధ్యాయులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ప్రొగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయం ఆవరణలో సంకల్ప దీక్ష నిర్వహించారు. ‘ప్రతిపక్ష నేతగా సీపీఎస్‌ను రద్దు చేస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు జీపీఎస్ అమలు చేస్తామంటున్నారు. దీంతో ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Crime News: మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
AP Govt: మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..
-
Crime News
Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..