పేదలకు తక్కువ ధరకు క్యాన్సర్‌ చికిత్స అందించాలి

రోజూ ఉదయం గంట సేపు బ్యాడ్మింటన్‌ ఆడటం అలవాటని, 74 ఏళ్ల వయసులోనూ ఇదే తన ఆరోగ్య రహస్యమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.

Published : 05 Feb 2023 05:10 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

మాదాపూర్‌, న్యూస్‌టుడే: రోజూ ఉదయం గంట సేపు బ్యాడ్మింటన్‌ ఆడటం అలవాటని, 74 ఏళ్ల వయసులోనూ ఇదే తన ఆరోగ్య రహస్యమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మెరుగైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు, నడక, యోగా సాధనతో ఆరోగ్యవంతమైన జీవనం సాగించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని మెడికవర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆసుపత్రిలో శనివారం నిర్వహించిన.. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. ‘‘ఖరీదైన క్యాన్సర్‌ చికిత్సలను పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్రైవేటు ఆసుపత్రులూ కనిష్ఠ ధరలకు చికిత్స అందించాల్సిన అవసరం ఉంది. భారత్‌లో ఏటా పది లక్షల కొత్త క్యాన్సర్‌ కేసులు వస్తున్నాయి. ఈ వ్యాధితో 5.5 లక్షల మంది మృత్యువాతపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. పశ్చిమ దేశాల జీవనశైలి, ఆహారపు అలవాట్లు భారతీయులకు సరిపడవు. సంప్రదాయ ఆహారంలో భాగమైన సొరకాయ, ఇంగువ, దాల్చినచెక్క, లవంగం, రాగి సంకటి.. ఇలా ప్రతి దాంట్లో ఆరోగ్యానికి మేలు చేసే ఏదో ఒక ఔషధం ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా ఉండటం, సానుకూల దృక్పథంతో ఆలోచించడం ఆరోగ్యానికి మంచిది’’ అని సూచించారు. క్యాన్సర్‌ను జయించిన పలువురిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. మెడికవర్‌ ఆసుపత్రి ఛైర్మన్‌, ఎండీ డాక్టర్‌ అనిల్‌కృష్ణ తదితరులు మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని