రుద్రభూమినీ వదల్లేదు...

వైకాపా నాయకుల భూ ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చివరికి శ్మశాన వాటికలను సైతం వదిలిపెట్టడం లేదు.

Published : 07 Feb 2023 03:55 IST

శ్మశానవాటికకు కేటాయించిన స్థలం తమదంటున్న వైకాపా నాయకులు
‘స్పందన’లో గ్రామస్థుల ఫిర్యాదు

మార్కాపురం అర్బన్‌ న్యూస్‌టుడే: వైకాపా నాయకుల భూ ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. చివరికి శ్మశాన వాటికలను సైతం వదిలిపెట్టడం లేదు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం వేములకోట పంచాయతీలో సర్వే నంబరు 414/1లో ప్రభుత్వానికి 14.48  పోరంబోకు స్థలం ఉంది. అందులో 2 ఎకరాల భూమిని  కొట్టాలపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న బీసీ, ఎస్సీలకు రుద్రభూమిగా కేటాయించారు. రెవెన్యూ దస్త్రాల్లో ప్రభుత్వ పోరంబోకు భూమిగా, అడంగల్‌లో రుద్రభూమిగా పేర్కొన్నారు. చాలా కాలంగా గ్రామస్థులు ఎవరైనా మరణిస్తే అక్కడే అంతిమ సంస్కారాలు చేస్తున్నారు. విలువైన ఈ స్థలం గ్రామానికి ఆనుకొని ఉండటంతో అధికార పార్టీ స్థానిక నాయకుల కన్ను పడింది. దీంతో దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆ స్థలం తమదని దానికి సంబంధించి రెవెన్యూ వారిచ్చిన పట్టా తమ వద్ద ఉందని స్థానిక నాయకులు జంకె వెంకటనారాయణ రెడ్డి, చాగంటి వెంకటనారాయణరెడ్డి వాదించడం ప్రారంభించారు.

అంతటితో ఆగకుండా ఎవరైనా అక్కడ దహన కార్యక్రమాలు నిర్వహిస్తే పోలీసు కేసు పెట్టి ఇరికిస్తామని బెదిరింపులకు దిగారు. ఇటీవల శ్మశానవాటికలో పెరిగిన పిచ్చి చెట్లను తొలగించేందుకు గ్రామస్థులు ప్రయత్నించగా అక్కడికి చేరుకున్న నాయకులు పనులను అడ్డుకున్నారు. దీంతో  గ్రామస్థులు విషయాన్ని పలుమార్లు ఎమ్మార్వో, వీఆర్వోలకు ఫిర్యాదు చేశారు. ఓసారి ఎమ్మార్వో మండల సర్వేయర్‌ను పంపించగా వైకాపా నాయకులు అడ్డు పడటంతో కొలతలు వేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. గ్రామస్థులు సోమవారం మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమానికి వచ్చి తమ గోడును ఇన్‌ఛార్జి పరిపాలనాధికారి హరికి వివరించారు. ఆ భూమిని నాయకుల చెర నుంచి కాపాడాలని కోరుతూ ఫిర్యాదును అందించారు. కాగా ప్రస్తుతం వైకాపా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జంకె వెంకటరెడ్డి వేములకోట పంచాయతీకి చెందిన వారు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని