లేపాక్షి చిత్ర, శిల్పకళా సౌందర్యం అద్భుతం

విజయనగర రాజుల కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయంలోని పురాతన చిత్ర, శిల్పకళా సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉందని జీ-20 దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు.

Published : 08 Feb 2023 04:35 IST

ఆలయాన్ని సందర్శించిన జీ-20 ప్రతినిధులు

లేపాక్షి, హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: విజయనగర రాజుల కాలంలో నిర్మించిన లేపాక్షి ఆలయంలోని పురాతన చిత్ర, శిల్పకళా సౌందర్యం ఎంతో అద్భుతంగా ఉందని జీ-20 దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఇంతటి శిల్ప సంపదను తాము ఎక్కడ చూడలేదని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని లేపాక్షి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం 29 మంది జీ-20 ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద వారికి కలెక్టర్‌ బసంత్‌కుమార్‌, పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్తీక్‌, పురావస్తుశాఖ ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందించగా వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆలయం ప్రాశస్త్యం, చరిత్ర, నిర్మాణ కట్టడాలు, ప్రాధాన్యం, తైలవర్ణ చిత్రాలు, శిల్ప సంపద, వాస్తు నిర్మాణశైలి, ఏడుశిరస్సుల నాగేంద్రుడు, నాట్యమండపం, సీతమ్మపాదం, వేలాడే స్తంభం తదితర 680 స్తంభాల వివరాలను పురావస్తుశాఖ అధికారులు వారికి వివరించారు. ఆలయంలో వేలాడే స్తంభాన్ని చూసి ఆశ్చర్యచకితులయ్యారు. రాతిపై రాసిన తెలుగుశాసనాలు, జఠాయువు పక్షి విగ్రహాన్ని పరిశీలించారు. ఏకశిల నందీశ్వరుడిని తిలకించి ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో బంధించారు. దాదాపు గంటసేపు ఆలయంలో గడిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని