EPFO - Higher pension: పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో షాక్‌

దేశవ్యాప్తంగా 70 ఏళ్లకు పైబడిన ఈపీఎఫ్‌ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) షాక్‌ ఇచ్చింది. 2014 సెప్టెంబరుకు ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది.

Updated : 06 Mar 2023 07:16 IST

అధిక పింఛను లబ్ధిదారులు పేరా 26(6), 11(3) ఆప్షన్‌ కాపీలు వారంలోపు ఇవ్వాలంటూ నోటీసులు
లేకుంటే అధికంగా చెల్లించిన మొత్తం వసూలు చేస్తామని వెల్లడి
2014కు ముందు పదవీ విరమణ చేసిన వారిలో ఆందోళన

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా 70 ఏళ్లకు పైబడిన ఈపీఎఫ్‌ పింఛనుదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) షాక్‌ ఇచ్చింది. 2014 సెప్టెంబరుకు ముందు ఉద్యోగ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న వారికి నోటీసులు జారీ చేసింది. సర్వీసులో ఉన్నప్పుడు అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించేందుకు పేరా 26(6) కింద, పింఛను నిధికి 8.33శాతం వాటా చెల్లించేందుకు పేరా 11(3) కింద యజమానితో కలిసి ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్‌ ఆధారాలను అందజేయాలని సూచించింది. వారం రోజుల్లోగా ఆధారాలు సమర్పించకుంటే ఇప్పటివరకు చెల్లింపులు చేసిన అధిక పింఛను మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. దీంతో రాష్ట్రంలో 2015 సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం అధిక పింఛనుకు అర్హత పొందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 50వేల మంది వరకు ఈ తరహా పింఛనుదారులు ఉంటారని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

ఆప్షన్‌ ఇవ్వలేదని...

ఈపీఎఫ్‌ చట్టం ప్రకారం 2014 నాటి సవరణకు ముందు అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులు ఈపీఎఫ్‌ చందా చెల్లించినప్పటికీ, ఉద్యోగి పింఛను పథకం (ఈపీఎస్‌)లో చేరేందుకు వేతనం మొత్తంపై 8.33 శాతం జమ చేసేలా యజమానితో కలిసి పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేదు. చట్టసవరణ నాటికి ఉమ్మడి ఆప్షన్‌పై గడువు లేదని, పింఛను పథకం సవరించిన తరువాత ఆప్షన్‌ ఇచ్చేందుకు అవకాశం లేకుండా చేశారని 2015 ఆర్‌సీ గుప్తా కేసులో చందాదారులు సుప్రీంకోర్టుకు తెలిపారు. ఉమ్మడి ఆప్షన్‌కు స్పష్టమైన గడువు పేర్కొననందున, 2014 సెప్టెంబరుకు ముందు పదవీవిరమణ చేసి అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా కట్టిన వారికి అధిక పింఛను పొందేందుకు అవకాశమివ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ తీర్పుమేరకు 2017లో ఈపీఎఫ్‌వో ప్రత్యేక సర్క్యులర్‌ ద్వారా అధిక వేతనంపై చందా కడుతున్నవారి నుంచి ఆప్షన్‌ తీసుకుని, ఆ మేరకు అదనపు ఈపీఎస్‌ నిధిని చందాదారు నుంచి సమీకరించి అధిక పింఛను మంజూరు చేసింది. ప్రస్తుతం 2022 సుప్రీంకోర్టు తీర్పులో 2014 సెప్టెంబరు 1 కన్నా ముందు పదవీవిరమణ పొందినవారు.. అంతకుముందే ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వకుంటే అధిక పింఛను వర్తించదని పేర్కొంది. ఈ తీర్పు మేరకు ఈపీఎఫ్‌వో ప్రత్యేక సర్క్యులర్‌ జారీ చేసింది. 2014 సెప్టెంబరు 1కి ముందు ఆప్షన్‌ ఇచ్చిన వారికి మాత్రమే అధిక పింఛను మంజూరు చేస్తామని తెలిపింది. పింఛను పథకం సవరణకు ముందుగా (2014 సెప్టెంబరు1) పదవీ విరమణ చేసిన ఉద్యోగులు.. ఆ పథకం నుంచి వైదొలిగినట్లేనని, అప్పటికే వారంతా యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వనందున సుప్రీంకోర్టు తీర్పు కాపీ పేరా నం 44(5) ప్రకారం అధిక పింఛనుకు అనర్హులని తెలిపింది.

రికవరీ కోసం ప్రత్యేక విభాగం...

2015 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అధిక పింఛను పొందిన వారికి ఇప్పుడు ‘అధికాన్ని’ రద్దు చేస్తూ.. ఆ మేరకు బకాయిలు రికవరీ చేయాలని ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. ఇందుకోసం ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. జనవరిలో ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌ జారీ చేసిన వెంటనే అధిక పింఛను పొందుతున్నవారి జాబితాలు సిద్ధం చేసి నోటీసులు జారీ చేస్తోంది. నోటీసులు అందుకున్న తేదీ నుంచి వారం రోజుల్లోగా.. పేరా 26(6), పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌కు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ ఆధారాలు సమర్పిస్తే అధిక పింఛను విషయాన్ని పరిశీలిస్తామని, ఆధారాలు ఇవ్వకుంటే ఇప్పటివరకు జమ చేసిన అధిక పింఛను బకాయిలు రికవరీ చేయడంతో పాటు పాతపింఛను పునరుద్ధరిస్తామని స్పష్టం చేసింది. ఈ నోటీసులు అందుకున్న పింఛన్‌దారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరిపై బకాయిల భారం కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి మొదలవుతుందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 వేల మందికిపైగా ఈ తరహా నోటీసులు అందుకున్నారు.


ఒక ఉదాహరణ ఇదీ..

హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌ (71) ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ 2011లో పదవీ విరమణ చేశారు. అప్పటికి ఆయన వేతనం (బేసిక్‌+డీఏ) రూ.16,200. ఆ సంస్థ ఆయన పొందుతున్న వాస్తవిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించింది. ఆయన పదవీ విరమణ చేసే నాటికి ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500గా ఉండటంతో ఆ వేతనంపై ఆయనకు రూ.1982 పింఛను మంజూరైంది. అయితే ఆ ఉద్యోగి అధిక వేతనంపై ఈపీఎఫ్‌ చందా చెల్లించినందున, 2015 ఆర్‌సీగుప్తా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అధిక పింఛను ఇవ్వాలంటూ యజమానితో కలిసి 2017లో ఉమ్మడి ఆప్షన్‌ ఇస్తూ దరఖాస్తు చేశారు. దానిని పరిశీలించిన ఈపీఎఫ్‌వో అధిక వేతనంపై 8.33 శాతం చొప్పున ఉద్యోగి పింఛను పథకాని (ఈపీఎస్‌)కి రూ.2.8 లక్షలు కట్టాలని డిమాండ్‌ నోటీసు జారీచేసింది. దీంతో ఉద్యోగి అంత మొత్తం జమచేశారు. అధిక వేతనం (రూ.16,200)పై పింఛను రూ.6,400గా ఖరారైంది. అప్పటివరకూ పింఛను బకాయిల కింద రూ.3.8 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం 2022 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. శ్రీనివాస్‌కు అధిక పింఛను వర్తించదని ఈపీఎఫ్‌వో పేర్కొంది. దీనిపై వారం రోజుల్లోగా సమాధానమివ్వాలని లేకుంటే బకాయిలు రికవరీ చేస్తామని రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని