గర్భాశయ క్యాన్సర్‌పై అవగాహనలో గిన్నిస్‌ రికార్డు

గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, సీపీవోఐ సంయుక్త ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.

Published : 19 Mar 2023 03:46 IST

విజ్ఞాన్‌లో నిర్వహించిన సదస్సుకు 3,465 మంది మహిళల హాజరు

వడ్లమూడి(పొన్నూరు), న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీ, గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌, సీపీవోఐ సంయుక్త ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్‌పై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3,465 మంది మహిళలు పాల్గొని రికార్డు నెలకొల్పారు. ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’ జడ్జిగా పాల్గొన్న స్వప్నిల్‌ డంగారికర్‌ మాట్లాడుతూ... గతంలో 1,919 మంది మహిళలకు అవగాహన కల్పించిన రికార్డును విజ్ఞాన్‌లో సదస్సుతో అధిగమించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ లావు రత్తయ్య, హైదరాబాద్‌ యశోద వైద్యశాల రోబోటిక్‌ సర్జికల్‌ ఆంకాలజిస్టు సుంకవల్లి చినబాబు, అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన సీపీవోఐ వ్యవస్థాపకురాలు, సీఈవో సత్య ఎస్‌.కలంగిలకు అందించారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ... వర్సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లో మహిళలంతా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో అవగాహన సదస్సును నిర్వహించినట్లు చెప్పారు. రాబోయేరోజుల్లో పరిసర గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తమ వర్సిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా సుంకవల్లి చిన్నబాబు మాట్లాడుతూ... గర్భాశయ క్యాన్సర్‌తో దేశంలో ఏటా సుమారు 71 వేల మంది మహిళలు మృతి చెందుతున్నారన్నారు. స్క్రీనింగ్‌తో వ్యాధిని గుర్తించి ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు. ఫెర్టిలిటీ ప్రత్యేక వైద్యురాలు డాక్టర్‌ వెంకట సుజాత, కలంగి ఎస్‌.సత్య మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని