విద్యార్థుల్లో వెలుగులు నింపే ‘హీల్‌’

అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు ఏర్పాటుచేసిన పాఠశాల హీల్‌ ప్యారడైజ్‌.

Updated : 20 Mar 2023 07:23 IST

తల్లిదండ్రులను కోల్పోయినవారికి విద్యాబోధన
వసతి, భోజన సౌకర్యాలు అన్నీ ఉచితమే
దరఖాస్తుకు ఆఖరు తేదీ ఏప్రిల్‌ 5

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-ఆగిరిపల్లి: అనాథలు, తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయి నిరాదరణకు గురవుతున్న చిన్నారులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు ఏర్పాటుచేసిన పాఠశాల హీల్‌ ప్యారడైజ్‌. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేటు పాఠశాలలకు దీటుగా బోధించే విద్యాసంస్థ ఇది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 30 ఎకరాల విశాల ప్రాంగణంలో ఈ విద్యాసంస్థ ఉంది. పేద, అనాథ చిన్నారులకు విద్యాబోధనతో పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యాన్నీ అందిస్తున్నారు. అనాథ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది, వారిని ఉన్నతస్థానాలకు చేర్చాలనే లక్ష్యంతో హీల్‌ విద్యాసంస్థను కోనేరు సత్యప్రసాద్‌ ఏర్పాటుచేశారు.

2023-24 ప్రవేశాలు ఆరంభం..

హీల్‌ ప్యారడైజ్‌ విద్యాసంస్థలో 2023-24 విద్యా సంవత్సరానికి ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ ప్రవేశాలను కల్పించేందుకు ప్రస్తుతం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. స్మార్ట్‌ క్లాస్‌రూమ్స్‌ ద్వారా తరగతులు నిర్వహిస్తారు.

15వేల పుస్తకాలతో గ్రంథాలయం

పాఠశాలలో 15వేల పుస్తకాలతో అతిపెద్ద గ్రంథాలయం అందుబాటులో ఉంది. విద్యార్థుల ఆసక్తి మేరకు వారిని కళల్లోనూ ప్రోత్సహిస్తారు. త్రీడీ చిత్రలేఖనం, క్రాఫ్ట్‌, సంగీతం, నృత్యం తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 400 మీటర్ల ట్రాక్‌, బాస్కెట్‌బాల్‌, కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌ కోర్టులున్నాయి.

సేంద్రియ కూరగాయలతో..

బాలబాలికలకు అధునాతన వసతిగృహాలు వేర్వేరుగా ఉన్నాయి. విద్యార్థులకు అందించే భోజనం విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను వినియోగిస్తున్నారు. విద్యార్థులు తాగేందుకు ఆర్‌వో శుద్ధజలాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల ఉన్నత చదువులకూ హీల్‌ సంస్థే సహకారం అందిస్తోంది. డిగ్రీ, పీజీ చదివేందుకు సహకారం అందిస్తున్నారు. విద్యార్థుల కోసం పాఠశాల ప్రాంగణంలోనే ఆసుపత్రిని ఏర్పాటుచేశారు.

‘అమ్మానాన్నలను కోల్పోవడం అంటే జీవితంలో అన్నీ కోల్పోయినట్టే. నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న అలాంటి చిన్నారులకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. హీల్‌ ద్వారా చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపాలన్నదే మా ధ్యేయం. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా అనాథ చిన్నారులు వచ్చి ఇక్కడ చేరొచ్చు’ అని హీల్‌ సంస్థ కార్యదర్శి తాతినేని లక్ష్మి తెలిపారు.


* ప్రవేశాలకు అర్హత: తల్లిదండ్రులు లేని విద్యార్థులకే హీల్‌ ప్యారడైజ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు.
* దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్‌ 5
* విద్యార్థులకు ఇంటర్వ్యూలు: ఏప్రిల్‌ 7 నుంచి 10వరకు
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరిస్తారు www.healschool.co.in
* సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు: 91000 24438, 91000 24437


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు