Delhi liquor Case: 10 గంటలు.. 14 ప్రశ్నలు.. కవితను సుదీర్ఘంగా విచారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం పది గంటలపాటు విచారించింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా సాగిన విచారణలో అధికారులు ఆమెకు 14 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.

Updated : 21 Mar 2023 09:02 IST

 నేడు మళ్లీ విచారణకు రావాలన్న దర్యాప్తు సంస్థ
ఈనాడు - దిల్లీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోమవారం పది గంటలపాటు విచారించింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా సాగిన విచారణలో అధికారులు ఆమెకు 14 ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటలకు మళ్లీ రావాలని ఈడీ నిర్దేశించింది. దిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారు చేయించుకొని అనుచిత లబ్ధి పొందేందుకు  సౌత్‌గ్రూప్‌ ద్వారా ఆప్‌ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారని.. ఇండోస్పిరిట్‌ సంస్థ రూ.192 కోట్ల ప్రయోజనం పొందిందన్న ఆరోపణలపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇందులో కవితకు బినామీగా వ్యవహరించారన్న ఆరోపణతో అరుణ్‌ రామచంద్రపిళ్లైను అరెస్ట్‌ చేసి 14 రోజులపాటు కస్టడీలోకి తీసుకొని విచారించింది. తర్వాత కవితను ఈ నెల 11న తొలిసారి 8 గంటలపాటు, సోమవారం 10 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మళ్లీ మంగళవారం హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ నెల 16న కవిత విచారణకు గైర్హాజరవడంతో, 20న తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరుకావాలని ఈడీ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె సోమవారం ఉదయం ఇక్కడి 23 తుగ్లక్‌ రోడ్డులోని తన తండ్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆమె వెంట భర్త అనిల్‌ ఈడీ కార్యాలయం వరకు వచ్చి వెన్నుతట్టి ధైర్యం చెప్పి పంపారు. సోమవారం విచారణలో ఆమెను.. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులతో కలిపి కూర్చోబెట్టి విచారించారా? లేదా? అనేదానిపై స్పష్టత రాలేదు. అయితే పలు విషయాలపై ఆమె నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ విచారణ అనంతరం బయటికొచ్చిన కవిత.. విజయచిహ్నం చూపుతూ అభిమానులకు అభివాదం చేశారు.

ఈడీ తనకు జారీచేసిన సమన్లను కొట్టేయాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌, ఆ కేసులో తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేయొద్దని కోరుతూ ఈడీ దాఖలు చేసిన కెవియట్‌లు ఈ నెల 24న విచారణకు రానున్నాయి.

గంటసేపు ఒంటరిగా...

ఈడీ అధికారులు మొత్తం పది గంటల విచారణలో ఎమ్మెల్సీ కవితను 14 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. తనకు దిల్లీ మద్యం విధానంతో ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్ర అని ఆమె అధికారులతో అన్నట్లు సమాచారం. తనను నిందితురాలిగా పిలిచారా? అని కూడా ఆమె అడిగినట్లు తెలిసింది. సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకున్నా... గంట వరకు అధికారులెవ్వరూ రాలేదని, అంతసేపూ గదిలోనే ఒంటరిగా కూర్చోబెట్టినట్లు సమాచారం. ఈడీ అధికారులు ప్రశ్నలన్నీ రాజకీయ కోణంలో సంధించినట్లు భారాస వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని