సంక్షిప్త వార్తలు(10)
సీనియర్ పాత్రికేయుడు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి అనారోగ్యంతో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించారు.
ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి మృతి
సింహాద్రిపురం, న్యూస్‌టుడే: సీనియర్ పాత్రికేయుడు, రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి అనారోగ్యంతో బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో మరణించారు. వైయస్‌ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలం కోవరంగుట్టపల్లెకు చెందిన ఆయన.. గత 30 ఏళ్లుగా పలు వార్తాపత్రికల్లో పనిచేసి, ఉన్నతస్థాయికి చేరుకున్నారు. 1978లో జర్నలిజంలోకి అడుగుపెట్టి ఏపీయూడబ్ల్యూజే కడప జిల్లా అధ్యక్షుడిగా 24 ఏళ్లపాటు సేవలందించారు. అనంతరం పలు పత్రికల్లో పనిచేశారు. శ్రీనాథ్‌రెడ్డి మృతికి సీఎం జగన్ ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు.
ఇసుక తవ్వకాలకు అక్రమ బాట
శ్రీకాళహస్తి గ్రామీణం (ఏర్పేడు), న్యూస్‌టుడే: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం సుబ్బానాయుడుకండ్రిగ సమీపంలోని సువర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు కొందరు వ్యక్తులు బుధవారం రోడ్డు ఏర్పాటు చేశారు. ఇటీవల నదిలో పెద్దఎత్తున యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టడంతో స్థానికులు ఏకమై తవ్వకాలను అడ్డుకున్నారు. గతంలో నదిలో ఏర్పాటు చేసిన రోడ్డును తవ్వేశారు. మరలా కొందరు వ్యక్తులు జేసీబీతో నదిలో రోడ్డును ఏర్పాటు చేసి ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. దీన్ని గుర్తించిన స్థానిక రైతులు వెళ్లి అడ్డుకున్నా ప్రయోజనం లేకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు.
కాటి కాపరులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: కాటి కాపరులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి డిమాండ్ చేశారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 వేల మంది ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు చనిపోతే పూడ్చేందుకు శ్మశాన స్థలాలు కేటాయించడంలో వివక్ష కొనసాగుతోంది. వారికి వృత్తి పరికరాలు, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలి’ అని డిమాండ్ చేశారు.
వక్ఫ్ బోర్డు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు అధికారి నియామకం
ముస్లిం సంఘాల నుంచి విమర్శలు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారిగా తెలంగాణకు చెందిన విశ్రాంత అధికారి మూస బిన్ ఇబ్రహీంను నియమిస్తూ ఆ సంస్థ సీఈవో అబ్దుల్ ఖదీర్ ఈ నెల 17న ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అద్దెల వసూళ్లను ఆయన పర్యవేక్షిస్తారు. ఆరు నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు. నెలకు రూ.60 వేల వరకు పారితోషికం వక్ఫ్ నిధుల నుంచే చెల్లిస్తారు. తాత్కాలిక ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ అధికారిగా తెలంగాణకు చెందిన విశ్రాంత అధికారి నియామకంపై ముస్లిం సంఘాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. జీవో నంబర్ 2323 ప్రకారం విశ్రాంత అధికారులకు నెలకు రూ.40 వేలకు మించి చెల్లించడానికి వీలులేదని, అందుకు విరుద్ధంగా రూ.60 వేల చొప్పున చెల్లింపునకు ఆదేశాలివ్వడం వెనుక ఆంతర్యమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై వక్ఫ్ అధికారుల్ని వివరణ కోరగా.. ర్యాటిఫికేషన్ కోసం దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపామని తెలిపారు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు 27 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈనాడు, అమరావతి: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఆరో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర పథ సంచాకులు సురేష్ కుమార్ తాజాగా తెలిపారు. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్‌లు, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ వర్గాల బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికయిన విద్యార్థుల సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశం ద్వారా సమాచారం అందిస్తామని వెల్లడించారు.
పురపాలక ఉపాధ్యాయులకు జిల్లా యూనిట్‌గా బదిలీలు
ముసాయిదా సర్వీసు నిబంధనలు రూపొందించిన పాఠశాల విద్యాశాఖ
ఈనాడు, అమరావతి: పురపాలక ఉపాధ్యాయులకు జిల్లా యూనిట్‌గా బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు సర్వీసు నిబంధనల ముసాయిదాను పాఠశాల విద్యాశాఖ రూపొందించింది. ముసాయిదా సర్వీసు నిబంధనలను వెబ్‌సైట్‌లో ఉంచింది. దీనిపై అభ్యంతరాలను ఆహ్వానించింది. ఇప్పటివరకూ విశాఖపట్నం, విజయవాడ నగరపాలక సంస్థలకు వేర్వేరుగా.. ఆయా జిల్లాల్లో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు విడివిడిగా బదిలీలు నిర్వహిస్తుండగా.. ఇక జిల్లా యూనిట్‌గా చేసేందుకు ముసాయిదా తీసుకొచ్చారు. ఇది కొత్త జిల్లాల ప్రకారం ఉంటుందా, పాత జిల్లా జిల్లాల ప్రకారం ఉంటుందా అనేదానిపై స్పష్టత లేదు. పురపాలక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యాశాఖకు అప్పగించడంతో ఈ సర్వీసు నిబంధనలను రూపొందించింది. దీన్ని పురపాలక ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిబంధనల మార్పు వల్ల సర్వీసు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యూనిట్ నిబంధనల అమలు కంటే ముందే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని మరికొందరు కోరుతున్నారు.
ఘనంగా 24 గంటల కథా మారథాన్
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచ కథా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని బీ ప్లస్ విత్ భాస్కర్ ఛానెల్, యూట్యూబ్ వేదిక ద్వారా 24 గంటల కథా మారథాన్‌ను ఈనెల 19, 20 తేదీల్లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, వంగూరి చిట్టెన్‌రాజు, ఓలేటి పార్వతీశం, సత్యం మందపాటి, పొత్తూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12 దేశాల నుంచి దాదాపు 126 మంది కథకులు వారి కథలను ఆన్‌లైన్‌లో వినిపించారు. ఈ కథాకళతోపాటు ప్రముఖ కార్టూనిస్ట్ కూచి సాయిశంకర్ చిత్ర కళా నైపుణ్యం అబ్బుర పరిచింది. ఒక్కో కథ వింటూ అప్పటికప్పుడు కథాసారాన్ని ప్రతిబింబించే చిత్రాలను వేయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. ఇలాంటి ప్రయత్నం ఇప్పటివరకు ఎవరూ చేయలేదని, కథ-కళ కలిపి సమ్మేళనాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు.
అందుబాటులోకి యూజీసీ ఈ-సమాధాన్ పోర్టల్
ఈనాడు, అమరావతి: ఆన్‌లైన్ ఫిర్యాదులకు ఈ-సమాధాన్ పోర్టల్‌ను తీసుకొచ్చినట్లు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) తాజాగా వెల్లడించింది. ఈ పోర్టల్ ఏకగవాక్ష విధానంలో ఫిర్యాదులను పరిశీలిస్తుందని ఇక నుంచి దీని ద్వారానే ఫిర్యాదులను సమర్పించాలని సూచించింది.
ఏప్రిల్ 30 లోపు వక్ఫ్ ఆస్తుల్ని నమోదు చేయించాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు గుర్తించని వక్ఫ్ ఆస్తుల్ని వక్ఫ్ బోర్డులో నమోదు చేయించుకోవాలని ఆ సంస్థ ప్రత్యేకాధికారి షీరిన్ బేగం తెలిపారు. ప్రతి మసీదు, దర్గా ఈద్గా, పీర్ల చావిడి, పీర్ల పంజాలు, అషుర్‌ఖానాలు, ముసాఫిర్‌ఖానాలు, ముస్లిం శ్మశానవాటికలు, జెండా చెట్లు తదితర అన్ని సంస్థలూ వక్ఫ్ బోర్డు పరిధిలోకి వస్తాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికీ రిజిస్టర్ కానివి కూడా వక్ఫ్ సంస్థలేనన్నారు. ముస్లిం సంస్థల ముసల్లీలు, ముతవల్లీలు, కమిటీ అధ్యక్షులు ఆయా ప్రాంతాల్లోని వక్ఫ్ సంస్థలు, వాటికి చెందిన భూములు, ఇతర ఆస్తుల్లో బోర్డులో నమోదు కానివి గుర్తించి.. ఏప్రిల్ 30లోపు రిజిస్టర్ చేయించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విశ్వవిద్యాలయాలకు ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్ తప్పనిసరి
ఈనాడు, అమరావతి: దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్)ను తప్పనిసరి చేయాలని నీతి ఆయోగ్ పాలకమండలి సూచించింది. నూతన విద్యావిధానం-2020పై ఇటీవల ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉన్నత విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకు కోసం దరఖాస్తు చేసుకోవాలని పాలకమండలి ఆదేశించింది. ఉన్నత విద్యలో గుణాత్మక మార్పును సాధించేందుకు సాంకేతిక విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకు మెరుగుదలకు కృషి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సూచించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Kakinada: ట్రాక్టర్‌ను ఢీకొట్టిన బైక్.. ముగ్గురి మృతి
-
India News
Padmini Dian: పొలం పనుల్లో మహిళా ఎమ్మెల్యే
-
Crime News
Couple Suicide: కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
CM Jagan Tour: పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?