‘ఆయుష్మాన్‌ భారత్‌’లో నాలుగేళ్లల్లో రూ.1,514 కోట్లు

ఆయుష్మాన్‌ భారత్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లల్లో రూ.1,514.75 కోట్లు ఇచ్చినట్లు మంత్రి విడదల రజని తెలిపారు.

Published : 25 Mar 2023 04:56 IST

మంత్రి రజని

ఈనాడు, అమరావతి:  ఆయుష్మాన్‌ భారత్‌ యోజన కింద కేంద్ర ప్రభుత్వం గత నాలుగేళ్లల్లో రూ.1,514.75 కోట్లు ఇచ్చినట్లు మంత్రి విడదల రజని తెలిపారు. శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయుష్మాన్‌ భారత్‌ యోజనపై తెదేపా సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఈ పథకం కింద 1,949 ప్రొసిజర్స్‌ ఉన్నాయని, 55.30 లక్షల కుటుంబాలు అర్హత పొందుతున్నాయని తెలిపారు. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 942 ప్రొసిజర్స్‌ ఉండగా.. తెదేపా హయాంలో అదనంగా 117 మాత్రమే తీసుకొచ్చారని వెల్లడించారు. ఇప్పుడు వాటిని 3,148 ప్రొసిజర్స్‌కు పెంచామని తెలిపారు. ఆరోగ్యశ్రీని తెదేపా హయాంలో అనారోగ్యశ్రీ పథకంగా మార్చేశారని విమర్శించారు.


వైకాపా సీటు రాదనుకున్నవారే అమ్ముడుపోయారు

మంత్రి జోగి రమేష్‌

చ్చే ఎన్నికల్లో వైకాపా సీటు రాదనుకున్న ఎమ్మెల్యేలు చంద్రబాబుకు అమ్ముడుపోయారని మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో జగనన్న కాలనీలకు మౌలిక సదుపాయాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ.. ఇళ్లు కట్టిస్తే జగన్‌ పేరు కొన్ని తరాలపాటు నిలిచిపోతుందని, పేదలకు ఇళ్లు దక్కకూడదని తెదేపా వారు కోర్టుల్లో కేసులు వేశారని ఆరోపించారు. ‘‘ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా సభ్యులను ప్రలోభాలకు గురి చేశారు. గతంలో వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు దొడ్డిదారిన అమ్ముడుపోయినా.. జగన్‌ నాయకత్వంలో 2019 ఎన్నికల్లో 150 స్థానాల్లో గెలిచాం. కొనడం, ప్రలోభాలకు గురిచేయడంలో చంద్రబాబు దిట్ట అని అందరికీ తెలుసు. 9 రోజులుగా సభలో తెదేపా వారు చేస్తున్న చిల్లర చేష్టలను ప్రజలు చూస్తున్నారు. పార్టీ గుర్తు లేని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు గెలిస్తే తెదేపా వారు సంబరాలు చేసుకుంటున్నారు’’ అని విమర్శించారు.


మత్స్యకారులకు డీజిల్‌ రాయితీ పెంచాలి

ఎమ్మెల్యే పొన్నాడ

త్స్యకారులకు డీజిల్‌పై ఇస్తున్న రాయితీని పెంచాలని వైకాపా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌ కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో మత్స్యకారులకు ఆర్థిక సాయంపై ఆయన మాట్లాడుతూ..డీజిల్‌ లీటరు రూ.69 ఉన్నప్పుడు రాయితీ రూ.9 ఇచ్చి, ధర రూ.వందకు చేరినా అంతే ఇస్తున్నారని గుర్తుచేశారు. మత్స్యకార భరోసాను కుటుంబంలోని 18 ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కుటుంబంలో ఒక్కరికే ఇవ్వడం వల్ల వేట లేని సమయంలో ఆ మొత్తం సరిపోవడం లేదని పేర్కొన్నారు. మెకనైజ్డ్‌ బోటుకు 12-15 మంది ఉంటారని, కానీ.. 8 మందికే బీమా అమలు చేస్తున్నారని తెలిపారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా బీమా వర్తింప చేయాలని కోరారు. వేట నిషేధ కాలంలో మార్పు చేయాలని విన్నవించారు. గతంలో మత్స్యకారులకు 75శాతం రాయితీపై వలలు, బోట్లు ఇవ్వగా.. ఇప్పుడు 40శాతంతోనే ఇస్తున్నారని తెలిపారు.


అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం అమలు చేయాలి

వైకాపా సభ్యులు

రాష్ట్రంలో ఉన్న 8,600 దేవాలయాలకూ ధూపదీప నైవేద్య పథకం అమలు చేయాలని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. అర్చకుల సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ధూపదీప నైవేద్యాల కింద ఇస్తున్న రూ.5వేల మొత్తాన్ని పెంచాలని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరారు. తితిదేకు లేఖలు రాస్తే సమాధానాలు రావడం లేదని, సభ్యులకు సమాధానాలు ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని