ప్రభుత్వరంగ సంస్థల వార్షిక నివేదికలేవీ?

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) తమ వార్షిక నివేదికలను సమర్పించడం లేదని కాగ్‌ తప్పుపట్టింది.

Published : 26 Mar 2023 04:18 IST

డిస్కంల వాస్తవ నికర విలువ హుష్‌
మరో 17 సంస్థలు నష్టాల్లోనే...
కాగ్‌ నివేదిక

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూలు) తమ వార్షిక నివేదికలను సమర్పించడం లేదని కాగ్‌ తప్పుపట్టింది. వాటిని సమర్పించేందుకు సమయపాలన పాటించేలా ఒక్కో ప్రభుత్వరంగ సంస్థకు లక్ష్యాలను నిర్దేశించాలని సూచించింది. బకాయిలు త్వరగా వెల్లడించేలా పరిపాలన శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలనివ్వాలని సూచించింది. 2022 మార్చి31 నాటికి 17 ప్రభుత్వ రంగ సంస్థలు రూ.26,5341.43 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపింది. ఈ నష్టం వాటి నికర విలువ రూ.18,084 కోట్లను హరించి వేసినట్లేనని నివేదిక వెల్లడించింది. 2022 మార్చి 31 నాటికి ఏపీఎస్‌పీడీసీఎల్‌ రూ.13,456.10 కోట్లు, సీపీడీసీఎల్‌ రూ.9,406.98 కోట్లు, ఈపీడీసీఎల్‌ రూ.7,136.41 కోట్ల మేర నికర విలువ రుణాత్మకంగా మారి వాటాదారుల నిధులు హరించుకుపోయాయని పేర్కొంది.

14 సంస్థల నుంచే వార్షిక నివేదికలు

రాష్ట్రంలో మొత్తం 118 పీఎస్‌యూలు ఉన్నాయి. వాటిలో 97 క్రియాశీలంగా, 21 క్రియారహితంగా ఉన్నాయి. క్రియాశీలంగా ఉన్నవాటిలో 11 విద్యుత్తు రంగానికి సంబంధించినవి. ఇతర రంగాలకు సంబంధించినవి 86 ఉన్నాయి. వీటిలో 2022 సెప్టెంబరు30 నాటికి వార్షిక పద్దులు సమర్పించిన ప్రభుత్వరంగ సంస్థలు 14 మాత్రమేనని కాగ్‌ వెల్లడించింది. 44 ప్రభుత్వ రంగ సంస్థలు దాదాపు మూడేళ్లు, అంతకుమించి సంవత్సరాలనుంచి తమ వార్షిక పద్దులే సమర్పించలేదని వెల్లడించింది. మరో 21 పీఎస్‌యూలు స్థాపించిన నాటినుంచి ఇంతవరకు వార్షిక పద్దులే ఇవ్వలేదని కాగ్‌ విశ్లేషించింది. ఈ వార్షిక పద్దులు సమర్పించకపోవడం వల్ల వాటి ఆర్థిక పరిస్థితి, వాటి రుణాలెన్నో లెక్క తేలే పరిస్థితులు కనిపించవు. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆ నివేదిక సిఫార్సు చేసింది.

* గ్రాంట్లు, రాయితీలు, హామీల రూపంలో ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ సాయం అందిస్తోంది. వాటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన హామీ రుసుముల వార్షిక పద్దుల్లో వీటిని పారదర్శకంగా వెల్లడించాలని కాగ్‌ సూచించింది.

* రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వరంగ సంస్థలకు మద్దతు పలుకుతోంది. వివిధ రకాలుగా ఆర్థికసాయం చేస్తోంది. 2019-20లో రూ.6,741.33 కోట్లు, 2020-21లో 15,726.65 కోట్లు, 2022-23లో 11,476.86 కోట్ల మేర బడ్జెట్‌ ద్వారా సాయం అందించిందని కాగ్‌ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని